Thursday, April 27, 2023

*అద్భుతమైన నిజ జీవిత కథ* *_కూతురు - కోడలు_*

 *అద్భుతమైన నిజ జీవిత కథ*

*_కూతురు - కోడలు_*
*=::=::==::==::==::=::==::==::=*

*నాపేరు లక్ష్మణరావు. నేనుండేది రాజమండ్రి పక్కన ధవళేశ్వరం. మండల రెవెన్యూ అధికారిగా ఉద్యోగం చేసి ఈమధ్యనే రిటైర్ అయ్యాను. నాకొక కొడుకు, ఒక కూతురు. నాకూతురు అచ్చం మా అమ్మ పోలికే. అందుకే చిట్టితల్లీ అని గారాబంగా పిలుస్తాను. నా కొడుకు డాక్టర్ అయ్యాడు... నా కూతురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యింది.* 

*నాకూతురుకి చక్కని సంబంధం వచ్చింది. ఒక్కడే కొడుకు. బాగా ఆస్థిపరులు. అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, అమెరికా ఉద్యోగం. కోటి రూపాయల కట్నం పెట్టి ఘనంగా నా కూతురు పెళ్ళి జరిపించాను. నా కూతురు పెళ్ళిలో ఒక అమ్మాయిని చూసి నా కొడుకు "ఆమెనే పెళ్ళి చేసుకుంటా" నని పట్టుబట్టాడు.* 

*ఆ అమ్మాయి వివరాలు ఆరాతీయగా ఆమె పంచాయితీ గుమాస్తా కూతురని, ఆయుర్వేదిక డాక్టర్ అని, చాలామంచి కుటుంబం అని కానీ, ఆమె తండ్రి ఏమాత్రం ఆస్థులు సంపాదించలేదని తెలిసింది. నాకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు. నా శ్రీమతి, నా కొడుకు "మనకు మంచిగా ఆస్తిపాస్తులు ఉన్నాయికదా!* 
*అమ్మాయి ఆయుర్వేదిక డాక్టర్... మంచి కుటుంబం... కాదనకండి" అంటూ ఒప్పించే ప్రయత్నం చేసారు. చివర ప్రయత్నంగా అమ్మాయి, అబ్బాయి జాతకాలు చూపించాను. నూటికి నూరుపాళ్ళు జాతకాలు కలిశాయి అని విన్నాక ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయిని మా ఇంటి కోడలు చేసుకోవలసి వచ్చింది.* 

*నాకోడలిని మా ఇంటికి తీసుకు వచ్చేటప్పుడు... అదేనండీ అప్పగింతల సమయంలో 200 మందికిపైగా మా ఇంటికి వచ్చారు. ఎన్నో పిండివంటలు. సారె సామాన్లు తెచ్చారు.* 

*ఇంత ఖర్చుపెట్టి ఇన్ని తెచ్చేబదులు డబ్బు ఇవ్వచ్చు కదా అనుకున్నాను. కాని తరువాత తెలిసింది ఏమిటంటే ఆ సామాన్లు, పిండివంటలు చుట్టుపక్కల ఊర్లనుంచి అప్పగింతలకోసం వచ్చిన జనాలు పట్టుకొచ్చారట.* 

*నాకోడలు ఇంటికి వచ్చింది మొదలు రోజూ వైద్య సహాయానికి ఎవరో రావటం, వారికి నా కోడలు ట్రీట్మెంట్ చెయ్యటం, అవసరమైన టెస్టులు చేయించుకోమని చెప్పటం, టెస్టులు చేయించుకునే స్థోమత లేనివారికి రామకృష్ణామిషన్ డయాగ్నాస్టిక్ ల్యాబ్ కి వెళ్ళి తక్కువ ఖర్చుతో టెస్టులు చేయించుకోమని చెప్పటం, రిపోర్టులు చూసి వైద్యం చేసి జబ్బు నయం చేయటం జరుగుతున్నాయి.*

*నా కొడుకు కార్పొరేట్ హాస్పిటల్ లో డాక్టర్ గా చేస్తూ నెలకు లక్ష రూపాయలు జీతం సంపాదించటమే కాకుండా, చిన్న చిన్న హాస్పిటల్స్ లో విజిటింగ్ డాక్టర్ గా వెళ్ళి ట్రీట్మెంట్, ఆపరేషన్లు చేస్తూ ఇంకొక లక్ష రూపాయలవరకూ సంపాదిస్తున్నాడు. కానీ, నా కోడలు సంపాదన మాత్రం ఏమీలేదు.*

*ఒకరోజు లంక గ్రామం నుంచి ఒక రైతు దంపతులు గర్భవతి ఐన తమ కుమార్తెను తీసుకొచ్చారు. ఆ అమ్మాయి చాలా బలహీనంగా ఉంది. నడవటం కూడా కష్టంగా ఉంది. ఆ అమ్మాయిని చూసి ఎందుకు ఇంత అశ్రధ్ధ చేసారు అని మా కోడలు ఆమె తల్లిదండ్రులను మందలించింది. టెస్టులు రాసి రిపోర్టులు తీసుకురమ్మని చెప్పింది. మరునాటి ఉదయం రిపోర్టులతో వచ్చారు.*

 *మీ అమ్మాయికి దాదాపు నెలకుపైగా మంచి ట్రీట్మెంట్ చెయ్యాలి అనగానే రోజూ తీసుకు రావటం కష్టం తల్లీ నీకు తెలియంది కాదు కదా, అని రైతు దంపతులు ప్రాధేయపడ్డారు.  మా కోడలు నా దగ్గరకు వచ్చి పరిస్థితి వివరించింది. నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు, కానీ, నా భార్య ఆ అమ్మాయి పరిస్థితి చూసి కనికరించండి అని సెంటిమెంటుతో కొట్టింది. నాకు ఒప్పుకోక తప్పలేదు.*

*మా ఇంటి ముందర గదిలో బెడ్ వేసి ఆ అమ్మాయికి మా కోడలు ట్రీట్మెంట్ మొదలెట్టింది. ఆ అమ్మాయి తండ్రి ఊరు వెళ్ళి బియ్యం పప్పులు కూరలు తీసుకొచ్చాడు. మా ఇంటి పని, తోటపని మొత్తం ఆ అమ్మాయి తల్లిదండ్రులే చేస్తున్నారు. నెలరోజుల తరువాత టెస్టులకు పంపింది.* 

*టెస్టు రిపోర్టులు చూసి బావున్నాయి అంటూ ఇంకొక వారం రోజుల తరువాత వారిని తిరిగి పంపించేసింది. వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి ఆరోగ్యవంతంగా చక్కగా నడుచుకుంటూ వెళ్ళింది. నాకు నాశ్రీమతికి పాద నమస్కారం చేసి రైతు తన భార్యను కూతురునీ తీసుకుని వెళ్ళాడు.*

*రెండు నెలల తరువాత ఆ అమ్మాయి ప్రసవించిందని తల్లీ బిడ్డ క్షేమమని ఫోన్ వచ్చింది. ఇంకొక నెల రోజుల తరువాత ఆ లంకగ్రామం నుంచి దాదాపు 50 మంది మా ఇంటికి వచ్చారు. నా శ్రీమతికి నాకు, నా కోడలికి కొడుక్కి పట్టుబట్టలు పెట్టారు. కొత్తబియ్యం తెచ్చారు. ఎన్నో రకాల కూరలు దుంపలు.. టమాట, మామిడి, గోంగూర ఆవకాయలు పట్టుకొచ్చారు.* 

*ఇప్పుడు నా ఇల్లు చాలా సందడిగా ఉంటుంది. ధవళేశ్వరం బస్టాండ్ దిగి ఎవరినడిగినా మా ఇంటికి సరాసరి తీసుకొచ్చేస్తున్నారు. నేను రోడ్డు మీదకు వెళ్ళేటప్పుడు ఆటోవాడు, రిక్షావాడు డబ్బులు అడగకుండా గమ్యానికి చేరుస్తున్నాడు. కిరాణాకొట్టు వాడు కూడా సామాన్లు డబ్బు తీసుకోకుండా ఇస్తున్నాడు. మా ఇంటిపని, తోటపని చేయటానికి జీతం అడగకుండా మేము పిలవకుండానే వస్తున్నారు.* 

*కానీ నాకున్న ఒకే ఒక బాధ. కోటి రూపాయల కట్నం ఇచ్చి పెళ్ళి చేసిన నా కూతురేమో వాళ్ళ అత్తమామలకు నెలకు 5 లక్షలు పంపుతోంది. అయితే కానీ కట్నం కూడా తేకుండా వచ్చిన నా కోడలు కనీసం నెలకు లక్ష రూపాయలు కూడా  సంపాదించటం లేదు.* 

*ఇలా ఉండగా అమెరికానుంచి అల్లుడు ఫోన్ చేసాడు. నా చిట్టితల్లి నెలతప్పిందని, తనకు తోడుగా ఇంట్లో ఉండటానికి నాశ్రీమతిని నన్ను రమ్మని. ఫోన్ వచ్చిందే తడవు తనకు ఇష్టమైన పిండివంటలు చేయించి, బట్టలు కొని నా శ్రీమతి, నేను అమెరికా పయనమయ్యాము.* 

*నా చిట్టితల్లి చాలా అనారోగ్యంగా ఉంది. విషయమేమిటంటే ఆఫీసులో పనిచెయ్యటం, అక్కడ పెట్టే ఆహారం చిప్స్, పిజ్జాలు, బర్గర్లు, కేకులు, కూల్ డ్రింకులతో సరిపెట్టుకోవటం, వంట దాదాపుగా లేదు. ఎప్పుడైనా టీ కాఫీలు చేసుకోవటం మాత్రం చేస్తున్నారు. నా శ్రీమతి వంటగదిని శుభ్రం చేసింది.* 

*నేను వండి నా కూతురుకి లాలించి, బుజ్జగించి తినిపిస్తున్నాను. అంతా అంటారు, నా శ్రీమతి కంటే నేనే వంట బాగా చేస్తాను అని, చిన్నప్పడు నా చిట్టితల్లి గారాలు పోతుంటే ఆమెకు వండి తినిపించిన సందర్భాలు కోకొల్లలు.*

*ఒక నాలుగు రోజుల తరువాత నా చిట్టితల్లి ఇంట్లో నడుస్తూ పడిపోయింది. హుటాహుటిన హాస్పిటల్ లో చేర్పించాము. తనకు ప్లేట్లెట్స్ కౌంట్ రోజు రోజుకూ పడిపోతుందని, డాక్టర్లు ప్రయత్నిస్తామని, ప్లేట్లెట్స్ డోనర్స్ ని సిధ్ధం చేసుకోమని, ఇదే పరిస్థితి తీవ్రమైతే నా చిట్టితల్లి ఇక ఉండదని చెప్పారు. నా కొడుక్కి ఫోన్ చేసాను. వెంటనే నా కోడలు-కొడుకు, నా కొడుకు అత్త-మామ, నా కూతురు అత్త-మామ అమెరికా వచ్చారు.*  

*హాస్పిటల్లో నా కూతురు రిపోర్టులు చూసిన నా కొడుకు చతికిలపడి పోయాడు. నాకు మరింత భయం వేసింది. నా కోడలు రిపోర్టులు చూసి గైనకాలజీ హెడ్ అపాయింట్‌మెంట్ తీసుకుంది. నేను, నా కోడలు-కొడుకు గైనకాలజీ హెడ్ ని కలిశాము. మీరు ఈ టెస్టులు చేయిస్తే బావుంటుందేమో అంటూ నా కోడలు ఒక పది వరకు టెస్టుల పేర్లు చెప్పింది..*

 *"ఎందుకు ఆ టెస్టుల అవసరమేమిటి?" అని గైనకాలజీ హెడ్ ప్రశ్నించగా నా కోడలు కేసు హిస్టరీ, రిపోర్టులు చూపిస్తూ వివిధ కారణాలు చెప్పింది. హెడ్ గైనకాలజిస్ట్ సరే అంటూ ఆ టెస్టులు చేయించమని చెప్పింది.*

*నా కోడలుని "ఆమె అనుభవమంత వయసు నీకు లేదు ఆమెకే సలహాలిచ్చే ప్రయత్నం చేస్తున్నావే" అంటూ తీవ్రంగా చీవాట్లు పెట్టాను. సాయంత్రం కాగానే నా అల్లుడు, కూతురు అత్త-మామ హాస్పిటల్ లో ఉండి మమ్మల్ని ఇంటికి వెళ్ళి తెల్లారి రమ్మని చెప్పారు. నా కోడలు చెప్పిన టెస్టుల రిపోర్టులు తీసుకుని ఇంటికొచ్చాము.* 

*నా మనసు మనసులో లేదు. నా కోడలు తల్లిదండ్రుల బలవంతం మీద ఏదో ఎంగిలిపడ్డాము. నా శ్రీమతి నా కోడలి తల్లి ఒక బెడ్‌రూంలో నిద్రపోతున్నారు. నా కొడుకు నేను ఒక బెడ్‌రూంలో పడుకున్నాము. కానీ నిద్రపట్టడం లేదు. ఇంతలో నా ఫోన్ మ్రోగింది. భయం భయంగా ఫోన్ ఎత్తాను.*

 *ఫోన్ చేసింది హెడ్ గైనకాలజిస్ట్. మీతో వచ్చి టెస్టులు చేయించమని చెప్పిన అమ్మాయి మీ అమ్మాయి కేసును చక్కగా అనలైజ్ చేసిందట. హైదరాబాద్ లో నాకు తెలిసిన ఆయుర్వేదిక డాక్టర్ ను అడిగి తెలుసుకున్నాను. మరొక్క విషయం ఆ డాక్టర్ గారి శిష్యురాలు ధవళేశ్వరంలో ఉంటుందట. ఆమె భర్తకూడా డాక్టరేనట. ఆమెను మీరు రప్పించి మీ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయిస్తే ఖచ్చితంగా ఫలితం ఉండొచ్చు అంటున్నారు అని చెప్పింది.* 

*కలా, నిజమా! నమ్మలేకపోయాను. హెడ్ గైనకాలజిస్ట్ కు ఫోన్ కలిపి మాటాడి నిర్ధారణ చేసుకున్నాను. ఇప్పుడు నా కోడలు అపర ధన్వంతరి అవతారమూర్తిలా అనిపించింది. బెడ్‌రూం లోనుంచి లేచి హాల్లోకి వచ్చాను.*

 *నాకోడలు రిపోర్టులు చూస్తూ, మధ్య మధ్యలో కంప్యూటర్లో వివిధ కేసులు చూస్తూ, నా కూతురి ట్రీట్మెంట్ ఎలా చేయాలో నోట్స్ తయారు చేస్తుంది. ఆమె తండ్రి హాల్లో పచార్లు చేస్తున్నాడు. నన్ను చూసి "బావగారూ! నిద్ర పట్టలేదా?" అంటూ పలకరించాడు.*

 *కోడలు ఇటు తిరిగి చూసింది. "నాన్నా! అమ్మను లేపి టీ పెట్టమని చెప్పవా! నిద్ర వస్తుంది" అన్నాది. "టీ పెట్టడానికి మీ అమ్మను ఎందుకు నిద్రలేపాలి తల్లీ, నేను పెట్టిస్తాను కదా!" అంటూ నాకోడలి తలపై ఆప్యాయంగా నిమిరాను.* 

*"అయ్యో మామయ్య గారూ! మీకెందుకు శ్రమ" అని కోడలు అనగానే "మనపని మనం చేసుకుంటే శ్రమ ఏమిటి" అంటూ వంటగదిలోకి వెళ్ళాను. నావెనుక నా కోడలి తండ్రి. టీ కాచి మూడు కప్పులలో పోశాను. టీ త్రాగుతూ నా కోడలు మామయ్య గారూ.... తనకు ఏ ఇబ్బంది లేదు... మీరు కంగారు పడవలసిన పనిలేదు అంటూ భరోసా ఇచ్చింది.*

*మరునాడు హెడ్ గైనకాలజిస్ట్ ని కలిశాము. నా కోడలు "ట్రీట్మెంట్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది" అని అడిగింది. ఆమె హైదరాబాద్ లోని డాక్టర్ గారిని సంప్రదించి కొద్దిపాటి మార్పులతో ఆమోదించింది.*

 *ఆరోజునుంచి నా చిట్టితల్లికి నా కోడలి పర్యవేక్షణలో ట్రీట్మెంట్ మొదలయ్యింది. డాక్టర్లు 11 వ రోజున కొద్దిగా గుణం కనిపిస్తుంది అన్నారు, 18 వ రోజున ప్లేట్లెట్స్ నష్టపోవట్లేదు అన్నారు. నెల రోజులు దాటాక నా చిట్టితల్లికి ఏమీ ఇబ్బంది లేదు అని చెప్పారు.*

*నా చిట్టితల్లి నెమ్మదిగా లేచి నడవటం మొదలెట్టింది. నా కోడలు చెప్పిన ఆహారమే పూర్తిగా నా చిట్టితల్లి కి పెడుతున్నాము. ఒక్కోసారి బాగా లాలన చేసి పెట్టాల్సి వస్తుంది. ఐనా నాకోడలు కానీ నేను కానీ ఎంతమాత్రం విసుగు చెందలేదు.*

*నా చిట్టితల్లి డెలివరీ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ నాకు భయం ఆవహిస్తోంది. నా కొడుకు, వాడి మామగారు నాకు ధైర్యం చెబుతున్నారు. నా శ్రీమతికైతే కోడలి ట్రీట్మెంట్ మీద పూర్తి నమ్మకం వచ్చేసి ధైర్యంగా ఉంది.*

*నా చిట్టితల్లికి పురుటి నెప్పులు ప్రారంభమయ్యాయి. నా కోడలు హెడ్ గైనకాలజిస్టుతో ఎంతో అవసరమైతే తప్ప సిజేరియన్ చేయవద్దు అని చెప్పి ఒప్పించింది. సుఖప్రసవం అయ్యింది. నా చిట్టితల్లి చిన్నారి చిట్టితల్లికి జన్మనిచ్చింది. తల్లీ బిడ్డా క్షేమమని హాస్పిటల్ వర్గాలు ఆనందంగా తెలియజేసాయి.*

*నా మనసు కుదుట పడింది. ఇంటికి వచ్చాను. నా కూతురు మామగారితో వీళ్ళు ఇక్కడుండి సంపాదించింది చాలు, ఇండియాలో కూడా మంచి జీతాలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి కదండీ, మీకు అభ్యంతరం లేకపోతే మీ కోడలినీ- కొడుకునూ మనతోపాటే ఇండియా తీసుకు వెళ్దామండీ అని అభ్యర్ధించాను. నా కోడలి తల్లిదండ్రులు కూడా వారికి సర్ది చెప్పారు. చివరికి ఆయన ఒప్పుకున్నాడు.*

*రెండునెలల తరువాత ఇండియా పయనమయ్యాము. వారం రోజుల తరువాత నా కోడలి పుట్టినరోజు. వంటగదిలోకి వెళ్ళి నా కోడలికిష్టమైన పులిహోరా చేశాను. నా కోడలు స్నానం చేసి కొత్తబట్టలు కట్టుకుని నాశ్రీమతికి, నాకూ పాదనమస్కారం చేసింది. అక్కడకు వచ్చిన నా కోడలి తల్లిదండ్రులకు కూడా పాద నమస్కారం చేసింది. ఆవుపాలలో బెల్లం వేసి కలిపి నా కోడలికిచ్చాను.  పాలు కొంచెం త్రాగిన తరువాత నా స్వహస్తాలతో చేసిన పులిహోర ఆమెకు అందించాను.*

 *నా కోడలికి ఆమె తల్లిదండ్రులకు ఆనందానికి అవధులు లేవు. ఇంతలో గేటు చప్పుడయ్యింది. చాలామంది నా కోడలిని ఆశీర్వదించటానికి, శుభాకాంక్షలు చెప్పటానికి ఇంటికి వచ్చారు. వచ్చినవారికందరికీ టీ, కాఫీ, టిఫిన్లు పెట్టి పంపించాను.*

*ఇక మా ఇంటికి నా కోడలి దగ్గర వైద్యానికి వచ్చేవారికి నాకు చేతనైన సాయం చేస్తున్నా. ఖండాంతరాలకు వ్యాపిస్తున్న నా కోడలి సేవలకు తోడుగా ఉండి చంద్రునికో నూలుపోగుగా మారాలని.*

No comments:

Post a Comment