Friday, April 28, 2023

కొత్త కుటుంబం

 కొత్త కుటుంబం  రచన :  శ్రీ భండారు శ్రీనివాసరావు

నా చిన్నతనంలో మా ఇంటికి ఓ కొత్త అతిధి ఒకరు వచ్చారు. వచ్చారు అనడం కంటే తీసుకు వచ్చారు అంటే బాగుంటుందేమో. ఆ రోజుల్లో మాది ఓ చిన్న బస్తీ. బజారు పనిమీద వెళ్ళినప్పుడు కనబడిన ఈ అతిధి మా నాన్నను ఇట్టే ఆకర్షించాడు. రోజూ ఒకసారయినా పనిపెట్టుకుని బజారుకు వెళ్లి అతగాడిని చూసివస్తుండేవాడు. అలాటిది ఒకరోజు ఏమయితే అయిందని అతడిని ఏకంగా ఇంటికే తీసుకువచ్చాడు.

అంతే! అతడి రాకతో, ఆ రోజునుంచి మా ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది.
అతిధి అంటే ఒకటి రెండు రోజులుండి పోయేవాడు. అదేమి చిత్రమో కాని, వచ్చిన వాడు వచ్చినట్టే టంకంలా మా ఇంటికి అతుక్కుపోయాడు.ఇంట్లో అడుగు పెట్టిన కొత్త అతిధి, కొత్తా పాతా తేడాలేకుండా ఇంటిల్లిపాదినీ ఇట్టే ఆకట్టుకున్నాడు. కధ అంతటితో ఆగలేదు. ఇరుగింటి వాళ్ళు,పొరుగింటివాళ్ళు చిన్నా పెద్దా అంతా కట్టగట్టుకుని అతడి ముచ్చట్లు వినడానికి మా ఇంటి మీదికి ఎగబడేవారు. మొదట్లో ఉదయం ఓ గంటా సాయంత్రం ఓ రెండు గంటలు కాబోలు అందరితో కలుపుగోలుగా మసలుకునేవాడు. ఆ తరువాత మాత్రం ముంగిలా ముసుగేసుకుని తొంగునేవాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. కొన్ని సార్లు అతడి మాటలు అర్ధం అయ్యేవి. మరికొన్నిసార్లు అర్ధం అయినట్టు వుండేవి. ఇంకొన్ని సార్లు అతడు ఏం మాట్లాడుతున్నాడో, యే భాషలో మాట్లాడుతున్నాడో తెలిసేది కాదు. అర్ధం కాకపోయినా అతడి మాట తీరు అందరికీ నచ్చేది. ఇది అది అని లేకుండా చరిత్ర, లెక్కలు, పురాణాలు ఏది కదిల్చినా వాటిల్లో అతడికున్న పరిజ్ఞానం మాత్రం అమోఘం. సినిమా కబుర్లు మొదలు పెట్టాడంటే చాలు ఇక వాటికి అంతూపొంతూ వుండేది కాదు.

చూస్తుండగానే యాభయ్ ఏళ్ళు గడిచిపోయాయి. అతిధిగా ఇంట్లో కాలుమోపిన అతడు రోజులు గడుస్తున్నకొద్దీ అభ్యాగతిగా మారిపోయి ఇప్పుడు అదే ఇంట్లో ఓ మూలన పడివున్నాడు. ఇప్పటికీ కబుర్లకు కొదవ లేదు. వినేవాళ్ళకే కొరత. విశేషం ఏమిటంటే మొదట్లో విసుక్కున్న మా అమ్మ ఇప్పుడు అతడి రంధిలో పడిపోయింది. అతడు చెప్పే అత్తాకోడళ్ళ కధలంటే చెవికోసుకునేవరకు వెళ్ళిపోయింది. మా నాన్నా అంతే. అతడిని చూస్తే చిరాకుపడే వాడల్లా ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. పేపరు చదవడం కూడా మానేసి అతడు చెప్పే రాజకీయాలు వింటూ కూర్చుంటున్నాడు.

ఇంతకీ పేరు చెప్పడం మరచిపోయినట్టున్నాను కదూ. అందరికీ తెలిసిన పేరే. అతడి అసలు పేరు టీవీ. జాతకనామం దూరదర్శన్. కాలం గడుస్తున్నకొద్దీ అర్జునుడి మాదిరిగానే రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. పూటకో ఛానల్ పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో ఇప్పుడు రోజుకో పేరు. కొద్దికాలం క్రితమే పెళ్లి చేసుకున్నాడు. అతడి భార్య పేరు కంప్యూటర్. ముగ్గురు పిల్లలు. పెద్దాడి పేరు ఇంటర్నెట్. రెండో సంతానం సెల్ ఫోన్. కొత్తగా ఓ మనవడు వచ్చాడు వాళ్ల కుటుంబంలోకి. అతడికి ముద్దుగా ఐ పాడ్ అని నామకరణం చేశారు.
మా పాత కుటుంబంలో ప్రవేశించిన ఈ కొత్త కుటుంబం తామరతంపరగా పెరిగిపోతూనే వుంటుందేమో.
 
(ఇంటర్నెట్లో కనబడ్డ ఇంగ్లీష్ కధనానికి స్వేచ్చానువాదం)

సేకరణ: సుధాకర్ కురువాడ

No comments:

Post a Comment