*సాధువులతో సాంగత్యం*
✍️ వంగూరి చిట్టెన్‌రాజు
🙏🌹🍁🌹🍁🔯🍁🌹🍁🌹🙏
*“సాధూనాం దర్శనం పుణ్యం*
*స్పర్శనం పాపనాశనమ్*
*సంభాషణం కోటితీర్థం*
*వందనం మోక్ష సాధనమ్”*
💫 ఉలుకూ పలుకూ లేని విగ్రహరూపంలో దైవ దర్శనంతో, దైవ ధ్యానంతో పుణ్యం సంపాదించుకోవడం కోసమే కాకుండా అక్కడ ఉన్న సాధువులని దర్శించుకుని, వారి పాదాలని స్పృశించి, వారితో సంభాషించి ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకుని ఐహిక అజ్ఞానాన్ని పోగొట్టుకోడానికీ, మానసిక శాంతిని పొందడానికీ కూడా పూర్వం పుణ్యక్షేత్రాలకు తరలి వెళ్లేవారు.
💫 ఈ 'సాధు' శబ్దం సృష్టిలో సర్వజనులకీ, పశుపక్ష్యాదులకీ కూడా వర్తిస్తుంది. *సత్సాధన సంపత్తి కలిగిన వారందరూ సాధువులే.* అటువంటి వారిని రక్షించడానికే... *“పరిత్రాణాయ సాధునాం, వినాశాయచ దుష్కృతాం”* అనే శ్లోకంలో తన అవతారాలన్నింటికీ ఏకైక కారణంగా ఆ పరమాత్మ ప్రకటించుకున్నాడు. సాధువులతో సమయం గడపడం వలన కలిగే సత్ఫలితాలకి ఉదాహరణగా ఒక ఐతిహాసిక కథ చెప్పుకోవాలి.
💫 ఒక సారి విశ్వామిత్ర మహర్షి ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించాడు. యాగం పూర్తి అయ్యాక అనేక మంది బ్రాహ్మణులకీ, ఋషులకీ వారి వారి స్థాయిని బట్టి దానాలు చేశాడు. వారిలో వసిష్ఠుల వారి వంతు రాగానే ఇంత గొప్ప ఋషికి తగిన దానం ఇవ్వాలని తీవ్రంగా ఆలోచించి తన తపస్సులో ద్వాదశ సంవత్సర తపఃఫలం వసిష్ఠులవారికి ధారాదత్తం చేశాడు విశ్వామిత్రుడు.
💫 కొన్నేళ్ళ తరువాత వసిష్ఠులు ఒక విశిష్టమైన యజ్ఞాన్ని నిర్వహించినప్పుడు విశ్వామిత్రుల వారు కూడా అందులో పాల్గొన్నారు. దానధర్మాల సమయం వచ్చినప్పుడు వసిష్ఠులవారు ఒకప్పుడు సాధుసంఘములో ఒక ఘడియకాలము సమావేశం అయినప్పుడు సమకూరిన ఫలంలో పావు ఘడియ భాగం విశ్వామిత్రుల వారికి దానం చేశారు.
💫 వెంటనే... “నేను పది సంవత్సరాల తపోఫలం ఇస్తే ఈయన కేవలం పావు ఘడియ ఫలం నాకు దానం ఇచ్చి అవమానం చేస్తాడా?” అని విశ్వామిత్రులవారికి విపరీతమైన కోపం వచ్చి యజ్ఞవాటిక లోంచి లేచి వెళ్లిపోతాడు. ఋషులందరూ ఎంత నచ్చ చెప్పినా విశ్వామిత్రుడు వినలేదు.
💫 అప్పుడు ఈ వివాదం పరిష్కరించడానికి నలుగురు న్యాయనిర్ణేతలని ఎంపిక చేసి వారి నిర్ణయానికి కట్టుబడేలా విశ్వామిత్రుడినీ, వసిష్ఠుడినీ ఒప్పించారు. అ నలుగురూ సూర్యుడు, వాయుదేవుడు, ఆదిశేషుడు, అగస్త్యమహర్షి.
💫 ఈ నలుగురినీ ఆహ్వానించడానికి ఎవరు వెళ్ళాలీ అనే ప్రశ్న వచ్చినప్పుడు విశ్వామిత్రుడు లేదా వసిష్ఠుల వారు వెళ్తే సమంజసంగా ఉంటుంది అని సాధుసంఘం తీర్మానించింది. ముందు విశ్వామిత్రుడి పేరు సూచించగానే వసిష్ఠులవారు.. “నేను ముందు వెళ్తే ఆ నలుగురినీ నేను వశపరుచుకుంటాను అని కొందరికైనా అనుమానం వస్తుంది” అని విశ్వామిత్రుడే ఆ నలుగురినీ ఆహ్వానించడానికి అంగీకరించారు.
💫 విశ్వామిత్రుడు ముందు సూర్యుడి దగ్గరకి వెళ్లి విషయం చెప్పి ఆహ్వానించగానే సూర్యుడు “అభ్యంతరం లేదు కానీ, నేను ఒక్క క్షణం ఇక్కడి నుంచి కదిలితే ప్రపంచం అంతా చీకటైపోయి అల్లకల్లోలం అయిపోతుంది. కాలచక్రం ఆగిపోతుంది. ఏం చెయ్యమంటారో మీరే చెప్పండి?” అన్నాడు. ఏమీ చెప్పలేక విశ్వామిత్రుడు వాయుదేవుడి దగ్గరకి వెళ్ళాడు.
💫 వాయువు అంతా విని, “నేను సర్వప్రాణులకి ప్రాణప్రదమైన వాయువుని కదా. మీకు తెలియనిది ఏముందీ? నేను వస్తే అంతా నిర్జీవం అయిపోతుంది. మరేమన్నా మార్గం ఉందా?” అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆదిశేషువు దగ్గరకి వెళ్లి విషయం వివరించాడు. ఆదిశేషువు తలలు ఊపి “నేను యావత్ భూమండలాన్నీ నా తలల మీదే మోస్తున్నాను కదా. దానికి మీరు మరో ప్రత్యమ్నాయం ఏర్పాటు చెయ్యగలరా ఋషివర్యా?” అని అడిగాడు. విశ్వామిత్రుడు ఏమీ చెప్ప లేక అగస్త్యమహర్షి దగ్గరకి వెళ్లి కనీసం మీరైనా ఈ వివాదం తేల్చమని అడిగాడు. “తప్పకుండానూ, కానీ శ్రీకైలాసగిరిలో దాక్షాయణి వివాహ సమయంలో దేవతలు, ఋషులు సువర్ణగిరి మీద కొలువు తీరడం వలన భూమి ఉత్తర భాగానికి ఒరిగిపోయింది కదా! అప్పుడు ఆ భూమిని సరిపరచడానికి పరమశివుడు నన్ను దక్షిణభాగాన ఉన్న మరత్తువామల పర్వతానికి వెళ్లి కొమ్ము కాయమన్నాడు కదా! ఇప్పుడు నేను మీ పంచాయితీకి వస్తే భూమి మళ్ళీ ఉత్తరం వేపుకి వంగిపోకుండా ఏమన్నా మార్గం ఉందా?” అని అడిగాడు.
💫 నిరాశతో వెనక్కి వెళ్లి ఇలా అన్ని చోట్లా జరిగిన సంగతులు విశ్వామిత్రుడు సాధుమండలికి వివరించాడు. ఇప్పుడేం చెయ్యాలా అని అందరూ ఆలోచించి మరే మార్గమూ లేక వసిష్ఠులవారినే మళ్ళీ ప్రయత్నించమన్నారు. “మీరందరూ ఆశీర్వదిస్తే మీ ఆజ్ఞ శిరసావహిస్తాను” అని ముందుగా వసిష్ఠులవారు సూర్యుడి దగ్గరకి వెళ్లి వృత్తాంతం అంతా వివరించారు. సూర్యుడు విశ్వామిత్రుడికి చెప్పినదే చెప్పాడు. దానికి వసిష్ఠుడు, “దానికి ఒక ఉపాయం ఉంది. నాకు పూర్వం ఒక ఘడియ సాధువులతో సమావేశానికి అవకాశం లభించింది. అంత మహిమ గల సాంగత్యం ప్రపంచంలో ఇంకేమీ లేదు. సాధు సంసర్గములో ఒక నిమేషం అనేక దివ్య సంవత్సరాల తపోమహిమ కంటే ఎక్కువే. అట్టి పవిత్రమైన దివ్యఫలాన్ని నేను విశ్వామిత్రుల వారికి నా యజ్ఞదానంగా ఇచ్చాను. కానీ దాని విలువ ఆయనకి తెలియక అది తిరస్కరించారు. అందువలన ఆ సాధుసంపర్కం జరిగిన ఘడియలో పావుభాగము నేను అభిమంత్రించి నా జపమాలలో నిలుపుతాను. సాధు సాంగత్యములో నిజమైన మహిమ ఉంటే అది మీరు తిరిగి వచ్చే వరకు ప్రపంచానికి వెలుగు ఇస్తుంది.” అని తన జపమాలను మంత్రించి నిలపగానే అది సూర్యుని కన్న ఎక్కువ కాంతితో ప్రకాశించింది.
💫 తర్వాత అదే విధంగా వాయుదేవుడు, ఆదిశేషువు, అగస్త్య మహర్షికి కూడా ఒక్కొక్కరికి పావు ఘడియలో తనకి సాధు సాంగత్యం వలన వచ్చిన తపోఫలాన్ని వారి, వారి స్వధర్మానికి విఘాతం రాకుండా దానం చేసి, వసిష్ఠులవారు ఆ నలుగురినీ వెంటబెట్టుకుని రావడం చూసి విశ్వామిత్రుడు నిర్ఘాంతపోయాడు. తన తపస్సు ఇంకా పరిపక్వం చెందలేదు అనీ, తనలో రజోగుణావశేషాలు మిగిలే ఉన్నాయనీ, శాంతం, వినయం తక్కువగా ఉన్నాయనీ గ్రహించి మళ్ళీ తపస్సు కొనసాగించడానికి వెళ్లిపోయాడు.
💫 ఈ కథలో నీతి ఏమిటంటే సాధువులతో సంభాషించడం, వారు చెప్పేది ఆలకించడం వలన ప్రపంచాన్ని నియంత్రించే శక్తి వస్తుంది. కానీ కాషాయ వస్త్రాలు వేసుకున్న వారందరూ సాధువులు కాదు. సాధన సంపత్తి ఉన్నవారే... కాని, సాధువు వేషంలో ఆర్ధిక సంపత్తి పెంచుకున్న వారు సత్సాంగత్యానికి అర్హులు కాదు. చాలా మంది అభిభాషణలు కేవలం వినడానికి మాత్రమే బావుంటాయి.
*సేకరణ:*
No comments:
Post a Comment