Saturday, April 29, 2023

మనసులోని మర్మం

 *మనసులోని మర్మం*

మనసులో మొదట ఒక ఆలోచన పురుడు పోసుకుంటుంది. తరవాత దాని నిర్మాణం రూపుదిద్దుకొంటుంది. పథకం తయారవుతుంది. ఆరంభం ఎక్కడా...? ఏమిటి... అని చూస్తే అది- మెదిలిన ఒక ఊహే అని అర్ధమవుతుంది.

ఆలోచన ఎప్పుడు పుట్టినా అది ఎంతో శక్తిమంతమైనది. దాన్ని ఇతరులు ఆమోదిస్తారా, నమ్ముతారా లేదా అనేది వేరే సంగతి. ఆ ఆలోచన ఫలించడానికి కావాల్సిన శక్తి ఆది పుట్టిన చోటు నుంచే లభిస్తుంది. దాన్ని మనస్ఫూర్తిగా విశ్వసించి ఆ మార్గాన్ని ఎంచుకుంటే ఇతరులు వెంట నడుస్తారు. శక్తిమంతమైన ఆలోచన ఫలించడానికి అవసరమైన వనరులను అదే ఆకర్షిస్తుంది. ప్రతి ఒక్కరిలో నిద్రాణమైన శక్తిని మేలుకొలిపే లక్ష్యాలు
అవసరం. అవి అభివృద్ధిని వేగవంతం చేస్తాయి. మహాత్మాగాంధీ. నరేంద్రుడు స్వామి వివేకానందుడైనా, సిద్ధార్థుడు గౌతమబుద్ధుడైనా మనసులో ఆలోచనలు పురివిప్పడం వల్లనే. ఆ ఆలోచనలకు అద్భుతమైన శక్తి తోడు కావడం వల్లనే. బంధాలలో ముంచడానికైనా, మోక్షాన్ని ప్రసాదించాలన్నా మనసే కారణమంటారు అనుభవజ్ఞులు.

నెలపాటు ఎవరైనా మనసులోని ఆలోచనలను పరీక్షిస్తే, వారు వారి భవిష్యత్తును ఎలా మలచుకుంటున్నారో వారికే బోధ పడుతుంది. ఆలోచనల మారాలంటే 'ప్రయత్నం' అవసరం.

మనసు మనిషికి -ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరం: ఆరోగ్యకరమైన ఆలోచనలను అనుమతించినప్పుడే అది వరమని తోస్తుంది. మనిషికి ఏ రుగ్మతలు కలిగినా ఆది సాధారణంగా మనసులోని అలజడుల కారణంగానే మనసుకు సోకే రోగమని, మందులతో పోదని అంటారు.
వసిష్ఠ మహాముని యువరాజైన శ్రీరాముడికి, కోరికల్ని వదిలించు కోవాలంటే మనసుకు శిక్షణ అవసరమని చెబుతారు. ఎప్పుడైతే మనసు ప్రతికూల పరిస్థితుల్లో సైతం సుఖాలకు లొంగిపోదో, అప్పుడే మనసును జయించినట్లు, నేను ఇది చేశాను. ఆది చేశాను' లాంటి అహాన్ని విడిచిపెట్టాలి. ఆ దైవం ఈ దేహం ద్వారా చేయిస్తోందని, ఆ శక్తి లేకపోతే ఒక్క అవయవం కూడా కదలదని గ్రహించాలి.

ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక జీవనంలో సాగేందుకు మనసొక్కటే ఉపకరణం. ఆ మనసును పవిత్రంగా, స్వచ్ఛంగా ఉంచుకోవాల్సింది మనిషే మనసు అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. అది అనేక ఆలోచనల మూట, అడ్డం, నిలువు పోగుల కలనేతగా కనిపించే ఒక వస్త్రం. పోగులు విడదీయడం మొదలు పెడితే వస్త్రం ఉండదు. మనసూ అంతే. పట్టించుకున్నంత కాలం 'మనసు... మానేస్తే అది మాయమైపోతుంది!

మనసు స్వస్థానం హృదయం. దానిలో లయం చేయడమెలాగో కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు మూడు విధాలుగా బోధిస్తాయి. కర్మయోగంలో అహం నశిస్తుంది. భక్తియోగంలో ఆహం స్పూర్తి కలుగుతుంది. జ్ఞానయోగంలో ఆత్మానుభవం పొందడం తెలుస్తుంది. ఇదే భగవద్గీత సారం.
మనిషికి తన మనసు ఎలా పనిచేస్తోందీ అర్ధమైతే, భావోద్వేగాల ఆటుపోట్లను
గమనించగలిగితే మనసు చేసే అలజడికి కొట్టుకుపోకుండా స్థిరంగా
ఉండటంసాధ్యమవుతుంది
 మంత్రవాది మహేశ్వర్

No comments:

Post a Comment