Sunday, April 23, 2023

మానవ జన్మ యొక్క గొప్పతనం

 🕉
*మానవ జన్మ యొక్క గొప్పతనం*

అన్ని జన్మలలోను మానవజన్మ మాత్రమే ఉత్తమమైనది, దుర్లభమైనది.

జన్మలు 3 రకాలు

1) దేవజన్మ
2) మానవజన్మ
3) జంతుజన్మ

ఈ జన్మలు ఎలా వస్తాయి? వాటి ప్రత్యేకతలేమిటి?

మానవుడు తన జీవితకాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు, ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి, వాటినే కర్మఫలాలు అంటారు.

అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి, అందులో అన్నీ పుణ్య కర్మలఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవజన్మ నెత్తుతాడు. 
అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. 
అది భోగభూమి, కనుక అక్కడ అతడికి ఏ కర్మలూ చేసే అధికారం లేదు. 
అందువల్ల పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలాచరించే అవకాశం అక్కడ లేదు
తన కర్మఫలాలననుసరించి భోగాలనుభవించి, ఆ కర్మఫలాలు క్షయంకాగానే.క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి” అన్నట్లు ఈ మర్త్యలోకాన్ని మానవ లోకాన్ని చేరుకోవలసిందే

మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే,  ఈ దేవజన్మలో కేవలం మనోబుద్ధులుంటాయి గాని కర్మజేయుటకు సాధనమైన స్థూలశరీరం ఉండదు.
కనుక భగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు దేవజన్మ.

ఇక అన్నీ పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా నీచయోనులందు జన్మిస్తాడు.
ఆ జన్మలలో ఆ కర్మ ఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడతాడు.
జంతుజన్మలలో కర్మలు చేస్తున్నట్లు కన్పించినా, ఆ కర్మలన్నీ బుద్ధిపరంగా ఆలోచించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని చేసేవి కావు.కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి...
కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించుటయే గాని పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. 
*కనుక భగవత్సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు.*

ఇక పుణ్యపాపకర్మలఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది.
ఈ జన్మలలో పుణ్య కర్మఫలాల కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు, పాపకర్మఫలాలకారణంగా దుఃఖాలు, బాధలు అనుభవిస్తాడు.

84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తర్వాత లభించే అపురూప జన్మ గనుకనే ఈ మానవ జన్మ... ఇట్టి ఈ అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమమైన మానవజన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలనీ శాస్త్రాలు చెబుతున్నాయి.

🕉🙏

No comments:

Post a Comment