🧡 గాఢ నమ్మకాలు - మూఢనమ్మకాలు🧡
మన పెద్దలు మన చిన్నప్పట్నుంచి రకరకాల సెంటిమెంట్లు, నమ్మకాలతో మనల్ని పెంచారు.
అలాంటి వాటిల్లో కొన్ని, ఇప్పటికీ మనల్నట్టుకుని వదలకుండా వేలాడుతూనే వున్నాయి...
కొన్ని కాలక్రమేణా, కనుమరుగైపోయాయి...
కొన్నింటిని ఇప్పుడు తలుచుకుంటే, చాదస్తాలు, మూఢనమ్మకాలుగా కనిపిస్తాయి...
కొన్ని చాల మంచివి అనిపిస్తాయి...
అలాంటి వాటిల్లో కొన్ని....
బయటకు వెళ్ళేటప్పుడు, "శకునం చూసుకుని వెళ్ళు" అనేది రోజూ వినబడేది. ఆ శకునాల్లో కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి అని, పెద్ద లిస్టు ఉండేది...
"మంచిదయితే, ముందుకు సాగిపో..చెడ్డదయితే,
వెనక్కి వచ్చేసి, కాళ్ళు కడుక్కుని, కాసేపు కూచుని
మరీ బయల్దేరు" అనేది ఆదేశిక సూత్రం !
ఒక్కొక్కప్పుడు అర్జెంటుగా ముఖ్యమైన పనిమీద, రైలుకో..బస్సుకో వెళ్ళాలంటే, శకునం చూసుకుని,
రిక్షా దొరికి, వాడు సరైన సమయానికి అక్కడికి చేర్చేలోపు..రైలు మిస్సు..బస్సు ఫట్టు అయిపోయి,
పుణ్యకార్యం కాస్తా అటకెక్కేది !
అలా రెండుమూడు దెబ్బలు తగిలాక, ఇంట్లో ఉన్న ముత్తైదువుల్లో ఎవరో ఒకరు, వంటింట్లో ఎంతపనిలో
వున్నా, ఎదురొచ్చి పంపించేవారు.
కొందరికైతే..కూరలకి బయటికెళ్ళాలన్నా, హెయిర్
కటింగ్ కి వెళ్ళాలన్నా, వాళ్ళావిడే శకునం రావాలి !
😊😊
కొందరి శకునం చాలా మంచిదని, ముఖ్యమైన పనులమీద వెళ్ళేటప్పుడు, వాళ్ళని ఏరి కోరి, ఎక్కడున్నా, వెతికి పట్టుకొచ్చేవారు. వాళ్ళుకూడా, అదేదో ప్రత్యేక గుర్తింపుగా ఫీలయిపోయి, ఇదయిపోయేవాళ్ళు !
😎😎
కొందరి బోణీ మంచిదనే నమ్మకాలు,
'ఐరన్ లెగ్గులు'..'ఇనప గజ్జెల తల్లులు' సరే సరి !
పాపం, పూర్వసువాసినులు అయితే, రోడ్డుమీద వెడుతూ, ఎవరైనా బయటకు వస్తుంటే, మొహం అటు తిప్పుకుని, పక్కగా ఆగిపోయేవారు !
😢😢
ఇంక ఏ పని చెయ్యాలన్నా, ప్రయాణం అవ్వాలన్నా,
తెలుగు క్యాలెండర్ తీసి, తిథి వార నక్షత్రాలు చూసి, వర్జ్యం, దుర్ముహూర్తం కూడా చూసి, 'హోర' నప్పుతుందో - లేదో చూశాక, తారాబలం - చంద్రాబలం గణించి, గుణించి, అప్పుడు మనల్ని ఒదిలేవారు !
అప్పటిదాకా "హౌస్ అరెస్టే !"
అదంతా ఒకశాస్త్రం అనుకుని, అలాగే కానిచ్చేవాళ్ళం.
💐💐
ఎండనబడి వస్తేనో, ప్రయాణబడలికవల్లో, కాస్త తలనెప్పి వస్తే, దిష్టి తగిలినట్టే !!! గుప్పెడు ఉప్పు తీసుకొచ్చి, "ఇరుగుదిష్టి, పొరుగుదిష్టి, ఇంట్లోవాళ్ళ దిష్టి , ఊళ్ళోవాళ్ళ దిష్టి" అని దండకం చదివి, అవతల పడేశాక, మనక్కూడా ఏదో రిలీఫ్ గా వుండేది !
(ప్లాసిబో ఎఫెక్ట్ అనుకుంటా !)
💐💐
చంటిపిల్లలకి నల్లబొట్టు, బుగ్గమీద నల్లచుక్క పెట్టడం, చేతులకి నల్లగాజులు తొడగడం ఇప్పటికీ చూస్తూనే
వుంటాం కదా ?
(నరుడి దిష్టికి నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయ్ ట !)
😱😱
పాపం కొందరి కళ్ళకి "దిష్టి కళ్ళు" అని బ్రాండ్ వేసేసి,
వాళ్ళని బ్లాక్ లిస్టులో పెట్టేసేవాళ్ళు !
కొన్ని రకాల శుభకార్యాలకి, వాళ్ళకి "నో ఎంట్రీ..."
😞😞
ఈరోజుకీ, ప్రతిదానికీ, పంచాంగం బయటికి తీసి,
ఎక్కడ బల్లి పడితే ఏం జరుగుతుందో, తేనెపట్టు,
ఇంటికి ఏవైపు పడితే మంచి జరుగుతుందో,
ఎటువైపు వుంటే కీడు జరుగుతుందో..
చూసుకునేవాళ్ళున్నారు కదా ?
అదేదో ఈగ, ఇంట్లో గూడు పెట్టి, దానికి వెల్ల వేస్తే,
ఇంట్లో శుభకార్యం జరుగుతుందిట !
🫢🫢
ఆడపిల్లలు రజస్వల అయిన సమయాన్నిబట్టి,
వాళ్ళ భావి దాంపత్య జీవితం అంతా ఎలా కొనసాగుతుందో కూడా అంజనం వేసినట్టు, చెప్పేస్తున్నారుగా ?
🤔😡
పిల్లల పుట్టిన నక్షత్రం, పాదం బట్టి, వాళ్ళ భావి జీవితం అంతా మార్చడానికి అస్సలు వీలు లేకుండా, ఎలా "ఎన్క్రిప్ట్" అయిపోతుందో, పుట్టింది శాంతి నక్షత్రంలో అయితే, ఏ ఏ గ్రహాలకి ఏ ఏ శాంతులు చేయించాలి?
ఏఏ దానాలు ఇప్పించాలి ? కుజదోషం ఉందా..
ఉంటే పెళ్ళి చేసేటప్పుడు ఇంకో కుజ దోషారావునే,
లేక కుజదోష కుమారినే వాళ్ళకి కట్టబెట్టాలి" లాంటి
అనేకానేక శాస్త్రాలు మనకు చెప్పి, కాళ్ళు, చేతులు కట్టిపడేసేవారు !
'మన పిల్లల జీవితాల్ని, చేజేతులా, జోతిష్కుల చేతుల్లో పెడుతున్నాం' అనిపిస్తుంది !
😢
అందుకే...చంద్రబోసు గారు,"మౌనంగానే ఎదగమనీ..."
అనే పాటలో, "తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు..నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలీ..." అని, "పిడికిలీ బిగించగా, చేతిగీత మార్చుకో..." అనీ ప్రబోధాత్మకంగా రాశాడు.
నాకు బాగా నచ్చిన పాటల్లో అది ఒకటి !
💐💐
ఇప్పటికీ చాలామందికి వాళ్ళ పిల్లలకు పెళ్ళి సంబంధాలు చూడాలంటే, జాతకాలే ప్రామాణికాలు !
దాన్నే 'వ్యక్తిగత విశ్వాసం' అంటారు.
(మెడికల్ రిపోర్టులు అడిగే దమ్ములు ఇంకా రాలేదుగా ?)
బహుశా ఇప్పుడు ఆడపిల్లల కొరత ఏర్పడ్డాక, మగపిల్లలకి పెళ్ళిళ్ళు అవక, కట్నంతోపాటు, ఇటువంటి నమ్మకాల్ని కూడా పక్కన పెట్టాల్సి వస్తోంది !
సరే వాస్తు శాస్త్రాన్ని నమ్మేవాళ్ళు వర్ధిల్లు గాక !
భూమితో పాటు గిరగిరా..రోజులో 360 డిగ్రీలు తిరిగే మన ఇల్లు కూడా, ఏ ముఖం ఇల్లు అయితే మనకు నప్పుతుందో, చెప్పగలిగే శాస్త్రజ్ఞులకు కొరతే లేదు !
నమ్మే వాళ్ళు వర్ధిల్లుతున్నంతకాలం, నమ్మించేవాళ్ళు కూడా... (డిమాండు - సప్లై సూత్రం ప్రకారం)
వర్ధిల్లుతూనే ఉంటారుగా ! ఎవరిష్టం వాళ్ళది !
అమెరికాలో కూడా "ఏ దేశమేగినా, ఎందుకాలిడినా" అన్నట్టు, మనవాళ్ళు "తూర్పుముఖం ఇల్లు",
"ఈశాన్యం కార్నర్ ప్లాట్" లకు ఎక్కువ డబ్బులు
చెల్లించి మరీ కొంటున్నారు !
అమెరికా బిల్డర్స్ యొక్క వాస్తు వేరనే వాస్తవం...
వీళ్ళకి తెలుసో తెలీదో !!!
"ఆగ్నేయంలో అగ్ని", "నైరుతిలో పడక",
"ఈశాన్యంలో గొయ్యి లేక నుయ్యి" పెట్టరుగా ?
అయినా..."వాళ్ళ నమ్మకాలు - వాళ్ళ డబ్బులు...
వాళ్ళిష్టం" అనుకుంటే పోలా ?
💐💐
మళ్ళీ మా చిన్నప్పటి కథలోకి వద్దాం...
గడప దాటుతూ తుమ్మితే, నన్ను కన్నతల్లే, అర్జెంటుగా నెత్తిమీద నీళ్ళు చల్లి, "ఏ ఊర్లో పుట్టావు ?" అని ప్రశ్నించేది, తనకి తెలియనట్టు ! సరదాకి మూడూళ్ళ పేర్లు తప్పు చెప్పి, తిట్లు తిన్నాక, అసలు ఊరు పేరు చెప్పేవాళ్ళం.
అన్నం తింటుండగా పొలమారితే, మనని, ఎవరో తల్చుకున్నట్టే ! ఒకవేళ నాలిక కరుచుకుంటే, ఎవరో
చెడ్డ దుష్ట దుర్మార్గులు మనల్ని తిట్టుకుంటున్నట్టే !
భోజనానికి కూర్చునే ముందు స్కూలు బట్టలు మార్చుకోకుండా, కాళ్ళూ - చేతులూ కడుక్కోకుండా, అన్నానికి కూచుంటే, అన్నానికి బదులు కడుపునిండా తినిపించేవారు..కరకజ్జాలు ! (మంచి ఆరోగ్య సూత్రమే !)
అదే ఇప్పుడు, కాళ్ళకి వున్న బూట్లు కూడా విప్పకుండా, టీవీ / సెల్ ఫోను చూస్తూ, మంచం / సోఫామీద కూర్చుని, తినడం ఫ్యాషన్ !
తలమాసిన మగాళ్ళు, మంగళవారం, శుక్రవారం, రాత్రివేళ, క్షవరకళ్యాణానికి వెళ్ళకూడదు, గోళ్ళు కత్తిరించుకోకూడదు, గెడ్డం గీసుకోకూడదు !
ఇప్పుడు తెలుసుగా...మన హెయిర్ డ్రెస్సెర్
అప్పాయింట్ మెంటు ఎప్పుడు దొరికితే, అప్పుడే !
ఎవరూ పైన కూర్చుని, కాళ్ళు ఊపకూడదు...
దరిద్ర దేవత, వలచి, వరిస్తుందిట !
ఆడపిల్లలు జుట్టు విరబోసుకుని ఉండకూడదు.
వాళ్ళ జుట్టు కొసలు మగాళ్ళకి కనబడితే, మగాళ్ళకి ఆయుక్షీణం ! ఆడవాళ్ళు కాటుక, బొట్టు, లేకుండా కనబడకూడదు ! ఐదో తనానికి నష్టం వస్తుంది !
11/12 ఏళ్ళ ఆడపిల్లలు కూడా, ఓణీ వేసుకోకుండా తిరగడం సభ్యత కాదు. మగాళ్ళకి చీపురు తగలకూడదు !
ఇప్పుడు అలాంటివన్నీ చెప్పకూడదు - వినకూడదు !
అప్పుడు అది కరెక్టు... ఇప్పుడు ఇది కరెక్టు...
💐💐
చివరిగా మా చిన్ననాటి సంఘటన ఒకటి చెప్పుకుని ముగిస్తాను. మా నాన్నంటే, మా ఇంట్లో అందరికీ హడల్ ! "అంతస్తులు" సినిమాలో గుమ్మడే !
ఆయన రాత్రి 7 గంటలకి రేడియో వార్తలు వింటుంటే, ఎవరూ గోల చెయ్యకూడదు, ఆయన రూంలోకి వెళ్ళకూడదు !
ఓరోజు మా అమ్మ పిల్లలందరినీ కూర్చోబెట్టి, బయట వరండాలో కథలు చెబుతోంది. అప్పట్లో రాత్రిళ్ళు,
"కోతి" అనే మాట అనకూడదు. పొరపాటున ఎవరైనా
"కోతి" అంటే, వెంటనే చెవి గిల్లుకోవాలి.
"అలా గిల్లుకోనివాళ్ళు, వచ్చే జన్మలో "కోతిగా" పుట్టడం ఖాయం" అనేది మాకు చెప్పిన శాస్త్రం.
అప్పుడు నాకు మూడేళ్ళుంటాయి.
మా అమ్మ చెప్పిన కథలో, పొరపాటున "కోతి" వచ్చేసింది ! అసలు కథే కోతి మీద ! కోతి రాకుండా ఎలా ఉంటుంది ? కాబట్టి అందరం వెంటనే ఎవరి చెవులు వాళ్ళే గిల్లేసుకున్నాం.
నాకు మా నాన్న మీద వల్లమాలిన జాలి కలిగింది.
తన గదిలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని, పడకుర్చీలో పడుకుని, ప్రశాంతంగా రేడియో వార్తలు వింటున్న
మా నాన్నకి, మేము "కోతి" అన్నామని తెలియక,
చెవి గిల్లుకోకపోతే, ఆయన వచ్చే జన్మలో "కోతిగా" పుట్టడం నాకు ఇష్టం లేక, పరుగెత్తుకెళ్ళి, ఖంగారుగా ఆయన చెవిని గట్టిగా గిల్లేసి, ఆయన కళ్ళు తెరిచేలోగానే వచ్చేశాను.
నిద్రపోతున్న సింహాన్ని లేపానని నాకేం తెలుసు ?
ఆయన చాలా సీరియస్ గా వచ్చి, "నా చెవి ఎవరు గిల్లారు ?" అని అడిగితే, నేను మా అమ్మ కొంగు
వెనకాల దాక్కున్నాను.
మా అమ్మ, "మీరు వచ్చే జన్మలో కోతిగా పుడతారని
వాడికి భయం వేసి, గిల్లాడు" అనగానే, ఆయనకి
నవ్వొచ్చి, "వెధవ్వేషాలు" అని ముక్తాయించి,
వార్తల్లోకి వెళ్ళిపోయారు !
.."పాపము శమించు గాక !"
వారణాసి సుధాకర్ గారి సౌజన్యంతో
No comments:
Post a Comment