శబ్దానికి ఆధారం ఓంకారమే! ఓంకారం దేహంలో ఉంది. 'ఓం' అని శబ్దం చేయగానే, ఆ తరంగాలతో దేహం పులకితమవుతుంది. దివ్య ప్రకంపనలు శరీరాన్ని చుట్టుముడతాయి. అప్పుడు శరీరం సహజ ధ్యానంలోకి అత్యంత సహజంగా వెళుతుంది. ఆ తరవాత నిశ్శబ్దంలో ఓలలాడుతుంది. ఓంకారానికి, ఓంకారానికి మధ్య ఏర్పడుతున్న నిశ్శబ్దాన్ని సాధకుడు గమనించాలి. అక్కడ మనసు ఆగిపోతుంది. ఆ నిశ్చలత్వమే ఓంకారాన్ని ఉద్దీపింపజేస్తుంది. వేదభూమికి ఆధారం ఈశ్వరుడు. ఆయనకు శబ్దరూపం ఓంకారం. ఓంకారంతో ధ్యానంలోకి ప్రవేశిస్తే చాలు. ఆనందం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఓంకారం అంటే, ఆనంద స్వరూపం. అది ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. అన్నమయ,ప్రాణమయ, మనోమయ, ఆనందమయ కోశాల్ని దాటి వెలుగులీనుతూ ఉంటుంది అది. ఎవరు ఆ ప్రణవ శబ్దం చేస్తారో, వారితో సులువుగా కలుస్తుంది. వారిని తనలో కలుపుతుంది. నిశ్శబ్దానికి నేపథ్యంగా ఉండేది ఓంకారమే. అది విశ్వంలో ఆత్మగా ఉంది. ఓంకారం- పిలిస్తే పలుకుతుంది. ఋషుల చుట్టూ తిరుగుతుంది. ధ్యానుల శరీరాల్ని డమరుకాలు చేస్తుంది. జ్ఞానుల దేహాల్ని పాంచజన్యాలుగా మారుస్తుంది. శ్రీకృష్ణుడి మురళిలోకి ప్రవేశించిన ఓంకారం బృందావనమంతా విహరించిందని పురాణ గాథలు చెబుతాయి. ఆ ఓంకారాన్ని ఆహ్వానించి, ఆవాహన చేసుకున్న మానవ జన్మ ధన్యమైనట్లే.
ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః ఇలా ప్రతి నామం ముందూ ఓంకారం భూషణమై వెలుగుతుంది. ప్రతి స్తోత్రమూ ఓంకారంతోనే ప్రారంభమవుతుంది. ప్రతి శ్లోకమూ ఓంకారంతోనే జీవిస్తుంది. ఓంకారంతోనే విశ్వం ప్రారంభమైంది. అది చివరికి ఓంకారంలోనే లీనమవుతుంది.
No comments:
Post a Comment