Sunday, June 30, 2024

 *శ్రీరమణీయభాగవత కథలు- 13*
( బాపు-రమణ )
జరిగిన కథ:

పరీక్షిత్తుకు,
శుక మహర్షి, దేవ-దానవుల జన్మ వృత్తాంతము తెలుపుతున్నాడు

ఇక చదవండి:
*****


*అడవి - నదీతీరం*

సూర్యుడు అస్తమిస్తున్నాడు. నీటిలో నిలచిన కశ్యపుడు అర్ఘ్యం సమర్పించి గట్టుమీదకు వచ్చి ఆశ్రమం వైపు నడుస్తునాడు.

ఎదురుగా ఒక చెట్టు చాటు నుంచి మనిషి కనబడకుండా ఒక తల వంగి తొంగి చూసింది. నల్లని వత్తయిన పెద్ద జుట్టు- మధ్య చిక్కగా కాటుక దిద్దిన పెద్ద పెద్ద కళ్లు. వాటి మధ్య ఎర్రని దీప కళికలా బొట్టు.

కశ్యపుడు స్తోత్రం చదువుకుంటూ నడుస్తున్నాడు.

ఆ చెట్టు దాటుతుండగా ఒక సుకుమారమయిన గాజుల చేయి ముందుకువచ్చి అతడి పంచెపై కట్టుకున్న ధట్టి కొన పట్టుకుంది. అతడు ఉలికి పడి ఆగాడు. వెనక్కి చూశాడు.

చెంగు పట్టి లాగుతూ వయ్యారంగా నిలచిన సుందరి. ఆమె కళ్లల్లో కామం ఆమె నవ్వులో కోరికల ఉమ్మెత్త పువ్వులు.

కశ్య:

దితీ! నువ్వా!

దితి:
(పకపక నవ్వుతూ) నేనే నాధా!

ముందుకు వచ్చి అతని బుజంపై చేయి వేసింది.

కశ్య:
ఏవిటిలావచ్చావు? యింటికెవరైనా అతిథులు వచ్చారా?

దితి:
(మీదకు వస్తూ) లేదు, నేనే అతిథిని. ఇదేఇల్లు. నన్ను సత్కరించండి.

కశ్య : (వెనక్కి అడుగు వేస్తూ) ఏవిటిది? మతిపోయిందా?

దితి: నాకు సంతానం కావాలి.

కశ్య : అందుకే కదా పెళ్లి చేసుకున్నాం. బ్రహ్మదేవుడి ఆజ్ఞఅదే కదా.

దితి : ఎదట మీరుండగా మళ్లీ ఆ దేవుడెందుకు? 
(వెటకారంగా కళ్లు తిప్పుతూ) హుఁ వాళ్లంతా పిల్లలతో కేరింతలు కొడుతూంటే నాకు గుండె మండిపోతోంది.

కశ్య : వాళ్ళంతా నీ అక్క చెల్లెళ్లేకదా!

దితి: నే నొక్కతినే గొడ్రాలిని.

కశ్య: తప్పు -నీకూ చక్కని సంతానం కలుగుతుంది.

దితి: ఇపుడే ఇక్కడే కావాలి (దగ్గరగా లాక్కుని కౌగిలించు కుంటుంది)

కశ్య : (విడిపించుకుంటూ) దితీ! తప్పు!

దితి : భార్య కోరికను కాదనడం ఇంకా పెద్ద తప్పు

ఎండపోయింది. వెలుగు తగ్గింది. ఇద్దరూ అస్పష్టంగా కనిపిస్తున్నారు.

కశ్య : దేనికైనా వేళాపాళా వుంటాయి. ఇది సంధ్యాసమయం. శుభం కాదు.

దితి:
నాకనసరం కావచ్చు 

కశ్య: నీ కనవసరం కావచ్చు.
కాని నాకు మనబిడ్డలకూ చాలా అవసరం దితీ. పగలూ రాత్రి కాని ఈ సంధివేళ లయకారుడైన పరమేశ్వరుడు ప్రళయ రుద్రుడిలా జుట్టు విరబోసుకుని, బూడిద పూసుకుని, భయంకరులైన ప్రమధ గణాలతో మూడు కళ్లూ తెరుచుకుని ఆకాశంలో తిరుగుతూ వుంటాడు. 

ఈ వేళప్పుడు సంగమిస్తే పుట్టే పిల్లలకు శుభం కాదు ఈ సమయంలో దీపారాధనం, దైవ ధ్యానం తప్ప ఏ పనీ చేయరాదు.

దితి పకపక నవ్వి విసురుగా అతని కండువా లాగేసింది. ఆవిసురుకి అతడు బొంగరంలా తిరిగాడు

దితి:
కామ దైవారాధన చేయ వచ్చు.

చేయి పట్టుకుని తన వైపు లాక్కుంది. ఇద్దరూ చెట్టుచాటు చీకట్లోకి వాలిపోయారు.

చెట్టుకొమ్మల చీకట్లలొంచి గబ్బిలాలు ఘోరమైన రొద చేస్తూ పెద్ద పెద్ద రెక్కలతో భీకరమైన చప్పుడు చేస్తూ చీకట్లలోకి ఎగిరి వెళ్లాయి. తీతువులు కూశాయి. గుడ్లగూబలు అరిచాయి. నక్కలు ఊరపెట్టాయి. చీకటిలో ఆ అడివి ఏడువులతో అట్టహాసాలతో ఆర్తనాదాలతో అంబారవాలతో మారు మోగి పోయింది.

*పరీక్షిత్తు యాగశాల*

శుక: ఆ విధంగా కశ్యపుడికి, దితి వల్ల పుట్టిన దైత్యులూ, దనువు కడుపున పుట్టిన దానవులూ దుర్మార్గులై చెలరేగారు. చీకటి బుద్ధుల వల్ల చీకటి రూపాలూ వచ్చాయి. చీకటి లోకం పాతాళంలో తల దాచుకుంటూ అహంకారం కమ్మినపుడల్లా స్వర్గానికి దండెత్తి వెళ్లడం -- దెబ్బతిని రావడం సాధారణం అయిపోయింది. 

ఆ తండ్రికే అదితి కన్న ఆదిత్యులు ధర్మ మార్గంలో నడుస్తూ స్వర్గంలో సుఖంగా వుంటూ పంచభూతాలకూ అష్టదిక్కులకూ పాలకు లయ్యారు.

*స్వర్గం*

ఇంద్ర సభలో అప్పరసలు ఇంద్రుడినీ అగ్ని, వాయు, వరుణుడి వంటి దేవతలనూ పొగుడుతూ నాట్యం చేస్తున్నారు.

శుకు;
దైత్యులే కాదు, ఆదిత్యులు కూడా పెడదారి పట్టారు. తమవైభవానికి కారణం, ఆధారం మహావిష్ణువేనని క్రమంగా మరచిపోయి ఆ పొగడ్తల ప్రభావానికి మైమరచి తామే సర్వలోక పాలకులమన్న గర్వంతో విర్రవీగసాగారు.

*నందన వనం - ఇంద్రుని ఉద్యానవనం*

స్వర్గంలో నందనవనం. చక్కని పూల చెట్లు ఆరామాలు, పొదరిళ్లు జలయంత్రాలతో గంధర్వ అప్పరసలతో కళకళ లాడుతోంది. 

దేవేంద్రుడు ఐరావతం అనే ఏనుగుపై ఠీవిగా కూచుని వస్తున్నాడు. ముందూ వెనకా సేవించే దేవగణాలు అప్సరసలూ- మునులు

ఆ వినువీధి రెండో చివర చెట్టు చాటునుండి మేనక ఒక పూలమాల పట్టుకుని కంగారుగా వస్తోంది. ఆ దారినే దుర్వాసమహర్షి నెమ్మదిగా నడుస్తున్నాడు. మేనక కంగారుగా ఆయనను గుర్తించి వడిగా దాటి వెడుతోంది. దుర్వాసుడు చూశాడు. ఆగాడు.

దుర్వా:  మేనకాదేవీ!

మేనక ఆగి వెనక్కు చూసింది. భయసంభ్రమాలతో వెనక్కి తిరిగి నమస్కరించింది.

(సశేషం)

No comments:

Post a Comment