శ్రీమద్రామాయణము.
(204 వ ఎపిసోడ్),,
"" అర్థాతురాణాం న గురుర్న బంధుః,
కామాతురాణాం న సిగ్గు న లజ్జా,
విద్యాతురాణాం న సుఖం న నిద్రా,
క్షుదాతురాణాం న నరుచి నపక్వం|,""
( కామము అనే పదాన్ని కేవలము శారీరక కలియకగనే పరిగణించకూడదు.ఒక వ్యక్తి పైగానీ ఒక పదార్థముపైగానీ వ్యామోహము ప్రదర్శించటము కామము అనబడుతుంది. కామము అనగా కోరిక. దానిని ఇది అని ఇతమిథ్థముగ తెలుపలేము.)ఇక పద్యార్థములోకి వెడితే,
సంపదలకి లొంగినవాడికి గురువుగానీ బంధువులుగానీ కనపడరు,
కామానికి లొంగినవాడికి సిగ్గు గానీ లజ్జగానీ ఉండవు,
అలాగే విద్య నేర్వదలచినవాడికి సుఖముగానీ నిద్రగానీ యుండవు,
ఆకలిగొన్నవాడు ఆయా పదార్థాలు ఉడికినవా ఉడకలేవా అనే ఆలోచన రానీయడు.
రామాయణములో రామావతారము కేవలము మానవావతారము. అందుకే రాముడు సామాన్య మానవుని వలే సీత కోసము సీతావిరహముతో అలమటించాడు.
ఏ అన్న కూడ తన తమ్మునితో తన భార్యపట్ల విరహాన్ని ప్రకటించుకోలేడు.కానీ పంపాసరోవరములో రాముడు అక్కడి ప్రకృతి శోభలకు ఉత్తేజితుడై ఇంద్రియములను నిగ్రహించుకొనలేక సీతకై ఆరాటపడతాడు.ఆ సందర్భములో
"" మన్మథాయాస సంభూతో వసంత గుణవర్థితః,
అయం మాం ధక్ష్యతి క్షిప్రం శోకాగ్నిర్నచిరాదివ||,(కిష్కింధ కాండ 01-32),
ఓ లక్ష్మణా! సీతావిరహబాధవలన ఏర్పడిన నా శోకాగ్ని వసంత ఋతువునందలి ఈ రమణీయప్రకృతి మరింతగా వృధ్దిచేస్తున్నది. ఈ సమయములో సీత కనపడనందున నా మదనతాపము పెరిగి నా శోకము అధికమగుచున్నది.
""అహో కామస్య వామత్వం యో గతామపిదుర్లభాం,
స్మారయిష్యతి కల్యాణీం కల్యాణతరవాదినీమ్||, (01-68),
నా సీతయొక్క మృదుమధుర వచనాలు మరిచిపోలేకున్నాను. ఆ సుందరి నేనెంతగ ప్రయత్నించిననూ అందనంత దూరతీరములలో చేరియున్నది.కానీ లక్ష్మణా ఈ పరిస్థితులలో కూడ మన్మథుడు నాచే ఆమెను అనుక్షణము స్మరింపజేయుచున్నాడు.అహో ఆ మన్మథుడు ఎంత కుటిలుడని వాపోతాడు.అంతేకాదు,
"" యది దృశ్యేత సా సాధ్వీ యది చేహ వసేమహి,
స్పృహయేయం న శక్రాయ నాయోధ్యాయై రఘూత్తమ||,(01-95),
ఓ రఘువరా లక్ష్మణా! ఒకవేళ సీతయే ఇక్కడ ప్రత్యక్ష మైనచో ఆమెతో మనము ఈ ప్రదేశమునందే నివశింతుము.అయోధ్యనగర నివాసముగానీ ఇంద్రవైభవములుగానీ నేను కోరుకోను.ఈ పచ్చిక బయళ్లపై విహరిస్తు ఇతర విషయాలను గురించి ఎట్టి ధ్యాస లేకుండగ ప్రశాంతముగ ఇక్కడనే యుండిపోతాను.ఇలా మన్మధుని బాణాలకి గురియైన రాముడు తన పరిస్థితికి సిగ్గు పడక లజ్జని త్యజించి తనతో పల్కుతున్న రాముని మాటలకు లక్ష్మణుడు,అన్నా రామా!,
"" త్యజ్యతాం కామవృత్తత్వం శోకం సన్న్యస్య పృష్టతః,
మహాత్మానం కృతాత్మానాం ఆత్మానం నా~వబుధ్యసే||,(01-124),,
అన్నా! నీవెంత ధైర్యశాలివి,మనోనిగ్రహాలలో ఉత్తముడవు.కనుక కేవలము సాధారణ కాముకుని వలే వ్యవహరింపకుమని రామునకే కర్తవ్యాన్ని తెలియచేస్తాడు.
రామాయణములో రాముని పాత్ర ఎంత ఉదాత్తమైన తెలుసుకోవాలంటే రాముని దేవునిగా గాక ఒక సాధారణమానవ మాత్రునిగ విచారణ చేసుకోవాలి.అన్ని అవతారాలలాగ శక్తులు మహిమలు చూపక తన కేర్పడిన కష్టాలను సాధారణ మానవునివలె అధిగమించి ఆదర్శపురుషుని వలే జీవించి అందరిలో పురుషోత్తమ రాముడని పేర్గాంచాడు.అందుకే రామాయణములో ని రాముని దేవునిగ గాక మానవమాత్రునిగా శోధన చేసి జన్మలకు సార్థకత చేకూర్చుకోవాలి.
జై శ్రీరామ్,జై జై శ్రీరామ్.
No comments:
Post a Comment