దోశలంటే నాకు చాలా ఇష్టం..
తినడానికే కాదు, వెయ్యడానికి కూడా..
వేడి పెనం మీద గుండ్రంగా ఉల్లిపాయ రుద్ది, ఆపైన సుయ్ మంటూ పెనం సిగ్నల్ ఇవ్వగానే గరిటెతో పిండి వేసి గుండ్రంగా సినిమాల్లో జ్ఞాపకాల్లా రింగులు రింగులుగా తిప్పుతూ కాస్త నూనో, నెయ్యో వేసి చుట్టూ చూసేలోపల చుట్టుకోకుండా హాయిగా ప్లేట్ లోకి దోషరహితం గా నడిచి వచ్చేసే దోశ ని చూస్తే నాకేవిటో చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది మరి..
అంతేనా?
అంతేనా అంటే అంతే కాదు..
ఒక్క గిన్నెడు పిండి ఉండాలే కానీ ఎన్ని రకాలు వేసుకోవచ్చో తల్చుకుంటేనే మనసు ఆనందోశాగరమవుతుంది..
మెత్తటి దోశలు, నూనె ఎక్కువేస్తే కరకర లాడేవి..
లోపల ఆలూ కూర పెడితే మసాలావి..
కారం చట్నీ రాస్తే ఎర్ర కారంవి..
ముందు ఊరి పేర్లు తగిలించి మైసూర్ మసాలావి..
ముద్దగా ఆలూ కూర చేసి దళసరిగా దావణగేరేవి..
మడత వెయ్యకుండా ఓపెన్ దోశ..
పొడి చల్లి పొడిదోశ
ఇలా ఎన్నో, ఎన్నెన్నో..
కదా!!
అవును.. మా ఇంట్లో పొయ్యి మీద పెనం పెట్టగానే " నాకు పలచగా, క్రిస్పీగా అంటూ వస్తాయి అభ్యర్ధనలు..
ఆపైన నాకు ఎర్ర చట్నీ, ఫుల్ రోస్ట్.. మసాలా.. ఇలా పెరుగుతూనే ఉండే కోరికల చిట్టా..
' ఓ అలాగే, ఒహో అలాగే' అంటూ అంచులు కూడా అందంగా కాలేలా, ఒకే మందంలో ముద్దుగా వేసి ప్లేట్ల నిండా పరుచుకునే రుచికరమైన దోశలు వేసి ఇస్తానా?
ఆరగించి ఆనందిస్తున్న కుటుంబాన్ని చూసిన నా అతివ మనసు ఆనందామృతాన్ని ఆస్వాదిస్తుందా?
ఇక్కడివరకు బానే ఉంది కథ..
ఆపైన ఉంటుంది అసలు విషయం..
" నీకు నేను వేస్తాను సుబ్స్" అనగానే మొదలవుతుంది..
గుండెల్లో ఏదో సడి.. ఉండుండి ఓ అలజడి..
“మొదటిది నేను వేసుకుంటాను, ఆ తర్వాత నేను తింటూ ఉండగా “అని నసుగుతాను..
" ఓకే" ఒప్పుకోలు..
అమ్మయ్యా.. మొదటిది వాటంగా కాలి ఒడుపుగా ప్లేట్ లోకి వచ్చింది..
పచ్చడో, పొడో వేసుకుని తినడం మొదలు పెడతానా?
" ఎన్ని గరిటెలు పిండి? రెండా?" మొదలు.. ప్రశ్నల పర్వం..
" మనక్కావలసిన సైజుని బట్టి" ఏం చెప్పాలో తెలీక నా జవాబు
" అదే! ఎంత సైజు కావాలి నీకు?" రెండోది..
" మీడియం సైజ్ చాలు"
" ఆ.. మీడియం సైజ్ అంటే మన డిన్నర్ ప్లేట్ అంతా?"
పెనం వేడెక్కిపోతోంది.. ప్రశ్నలెస్తూ పోతే దోశెలెప్పుడు వెయ్యడం? ఇంకా నయం ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా? అనలేదు..
“ఊ.. సరిగ్గా అంతే! “నా జవాబు..
“వేసాను.. క్లాక్ వైజ్ స్ప్రెడ్ చెయ్యాలా? ఆంటీ క్లాక్ వైజా?”
మింగుతున్న దోశ అడ్డుపడడేమిటో అర్ధమవుతున్న వేళ..
“నేను వేసెయ్యనా?”
“ఆహా.. నువ్వే వేస్తే నేనెలా నేర్చుకుంటాను?”
“నేర్పడాలు, నేర్చుకోవడాలు అన్నీ నా దోశ మీదేనా?” అని స్వయంకృషిలో మిశ్రోగారిలా నా ఆక్రోశం..
చేసేదేమి లేక “సరే..”
మొత్తానికి అక్కడ చెయ్యెటు తిరిగితే దోశ అటు తిరిగింది..
“నూ..” అనే లోపు
“ఒక్క చెంచా” నేను గట్టిగా..
" చాలా బాగా కాలుతోంది.. యూ విల్ గెట్ ద బెస్ట్ దోశ" అన్న భరోసా..
మనకీ దిలాసా..
“తిరగెయ్యనా?”
“ఊ..”
" అయ్యో"
“ఏమయింది? “
“ఏవిటో మరి? రావట్లేదు..”
“ కాలలేదేమో సరిగ్గా..”
మరో నిమిషానికి చిన్నప్పుడు అమ్మావాళ్ళు 'ఉండచుట్టుకుపోతుందిఅంటూ తిట్టుకునే ఉలీ ఉలీ చీరలా, ఉండలా చుట్టుకున్న పదార్ధమొకటి ప్లేట్ లోకీ
“ఇదేమిటి? ఇలా అయింది?” మాట్లాడే ఓపిక లేకపోతే కళ్ళే ప్రశ్నిస్తాయి..
" సారీ..ఈ సారి బాగా వేస్తాను. అయినా ఇది రెగ్యులర్ పిండి కాదు కదా, ఇన్స్టంట్ ది కదా అందుకే ఇబ్బంది పెడుతోంది.. ఇందాకా వేసాను కదా, తెలిసింది, ఇప్పుడు బాగా వేస్తాను”
దోశ తిరిగినట్టే చరిత్రా తిరుగుతుంది.. పునరావృతమే.
ఈ సారీ చుట్టుకున్నదే. తుంగచాపలా..
“ఇది దోశా, ఉప్మానా? “ ఈసారి ప్రశ్న నాది..
“దోప్మా..”తడుముకోని జవాబు తనది..
అంటే?
“రవ్వ దోశ కని పిండి కలిపావు కనక, ఉప్మాకీ అదే రవ్వ కనక.. వేసిన దోశ సరిగా కాలకుండా దోశకీ, ఉప్మాకి మధ్యలో ఉంది కనక దోప్మా.. “
అదన్నమాట విషయం..
దీనివల్ల మనకి తెలిసిందేమిటి?
" ఫలానా సినిమాలో హీరో వెంకటేష్ చెప్పినట్టు '
ఎవరి బొకేలు వాళ్ళే కొనుక్కోవాలి.. ఎవరి దోశలు వాళ్ళే వేసుకోవాలీ.
( పొద్దున్నే తను వేసిన ఒక దోశ సరిగా రాక మా ఇంట్లో జరిగిన సంభాషణకి కాస్త కల్పనలూ, రంగులూ ఎంబ్రాయిడరీలు అద్ది :) 😃
Subhadra Vedula
No comments:
Post a Comment