"జ్ఞానగీత" (నిత్యజీవితంలో ఉపనిషత్తులు) - *ముండకోపనిషత్తు* - 1వ భాగము.
''ముండక ఉపనిషత్తు'' లేదా ''ముండకోపనిషత్తు'' అధర్వణ వేదములోనిది. ప్రాచీన ఉపనిషత్తులలో ఇది ఒకటి. తలపైనున్న జుట్టును పూర్తిగా తీసివేయుటకు ఉపయోగించే కత్తిని "ముండకము" అని అంటారు. జుట్టును అజ్ఞాన చిహ్నంగా భావించి పూర్తిగా దానిని తొలగించి, సర్వసంగపరిత్యాగిగా జీవించు వానిని "ముండకుడు" అంటారు. ఈ ఉపనిషత్తులో "బ్రహ్మవిద్యకు" అంటే "ఆత్మవిద్యకు" ఎక్కువ ప్రాధాన్యత యివ్వడం జరిగింది. ఇందులో భాగాలను ముండకములని, అవాంతరభాగాలను ఖండములని విభజించుట జరిగింది.
శాంతిమంత్రము :
ఓ యజ్ఞప్రియులైన దేవతలారా! ఎల్లప్పుడూ మేము మంచి మాటలనే విందుముగాక! మంగళకరమైన వాటినే చూచెదముగాక! పరిపృష్టి గల అవయములతో మిమ్ములను స్తోత్రము చేయుదుముగాక! మీ చల్లని దీవెనలతో దీర్గాయుర్దాయమును పొందెదముగాక! కీర్తిగల ఇంద్రుడు, అంతా నెరింగిన ఆదిత్యుడు, ఆపదలను రూపుమాపు గరుత్మంతుడు, దేవగురువైన బృహస్పతి మాకు శుభమును ప్రసాదించెదరుగాక! ఓం శాంతిః శాంతిః శాంతిః.
ఉపోద్ఘాతము :
గృహస్థాశ్రమంలో నున్న (సంసార జీవితాన్ని అనుభవిస్తున్న) శౌనకుడు అనే జిజ్ఞాసువు అంగిరస మహర్షిని, స్వామీ! ఏది తెలుసుకుంటే సర్వమూ తెలుసుకున్నట్లవుతుంది? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు అంగిరసడు, శౌనకునికి "పరావిద్య" మరియు "అపరావిద్య" అనే రెండు విద్యలను బోధిస్తాడు. పరావిద్య అంటే పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానం. అపరావిద్య అంటే లౌకికమైన ధర్మాధర్మము లకు సంబంధించిన జ్ఞానం. ఈ రెండింటిలో పరావిద్య శ్రేష్టమైనదని, దాన్ని జ్ఞానంతో గ్రహించువాడు ఈ సంసారచక్రం నుంచి విముక్తుడవుతాడని బోధిస్తాడు.
ఆ విశేషాలను తదుపరి భాగంలో పరిశీలిద్దాము.. 🙏🏻
No comments:
Post a Comment