Sunday, June 30, 2024

_దేవదాసుకు డెబ్బై రెండు!_* *_ఎప్పటికీ అదో ట్రెండు..!

 *_దేవదాసుకు డెబ్బై రెండు!_*
  *_ఎప్పటికీ అదో ట్రెండు..!_*                             

          _(26.06.1953_)

🥃🥃🥃🥃🥃🥃🥃

(*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
    _9948546286_)

✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽

నిజానికి ఇది సందేశమే
లేని సినిమా..
హీరో ధీరోదాత్తుడు కాడు..
ఉదాత్తుడు అంతకంటే కాదు
పైగా పలాయనవాది..
పిరికి..కొంచెం చలాకి..
బాధ్యత లేని వ్యక్తి..
ప్రేమను గెలిపించుకోలేని భీరువు..కోపిష్టి..
అన్నిటినీ మించి తాగుబోతు..!

అయినా..అతగాడిని హీరో
అన్నారు..ఆరాధించారు..
ఆకాశానికెత్తేసారు..
ప్రేమదాసు..మందుదాసు..
దేవదాసుకు జనం దాసోహం
వసూళ్ల ప్రవాహం..
అతగాడి పాటలు..మాటలు
అలా దొర్లుతూనే ఉన్నాయి
తెలుగునాట అహరహం!

ఉన్నతీరు మారి..
ఊరు మారి..
సూటూబూటూ 
తొడిగిన జమీందారు దేవదా

లూజు లాల్చీ..పంచె కట్టు..
చింపిరి జుత్తు..
చేతిలో మందు గ్లాసు..
పక్కన కుక్క..
చావుకు సిద్ధంగా ఉన్న 
భగ్నప్రేమికుడు దేవదాసు..

ఇద్దరిలో హీరోని కన్నది
ప్రేక్షకలోకం..
మైకంలో ఉన్న దేవదాసును
చూస్తేనే అదోలాంటి మైకం
నచ్చేసిన అతగాడి వాలకం..
పల్లెకు పోదాం పారును చూద్దాం ఆంటూ చలాకీగా
గుర్రం బండిపై సొంత ఊరికి సాగిన ప్రేమయాత్ర..
జగమే మాయ..
బ్రతుకే మాయ..
వేదాలలో సారమింతేనయా..
అనుకుంటూ జడివానలో జట్కా బండిపై
అంతిమయాత్ర..
ఈ నడుమ అఖండంగా
వినోదా వారి విజయయాత్ర!
ముసలోన్ని కట్టుకుని
విలపిస్తూ మాటాడే
సావిత్రి కళ్ళు..
కన్నీటి వాకిళ్ళు..
అక్కినేని నిషాకళ్లు..
ఇవే దేవదాసు సక్సెస్ సూత్ర
శరత్..వేదాంతం.. 
సుబ్బరామన్ మహామంత్ర..!

పార్వతిని వదులుకున్నప్పుడు తెలియని ప్రేమతత్వం..
తను వేరొకరితో పెళ్లి జరిగి
వెళ్లిపోతుంటే 
కల ఇదనీ..నిజమిదనీ
తెలియదులే..
బ్రతుకింతేనులే...
అని ఆక్రోశించింది..
అనురాగం చేజారిపోగా
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్..ఓడిపోలేదోయ్..
అంటూ వేదాంతం ఒలకబోసింది..!

అక్కినేని నటన..
సావిత్రి అభినయం...
లలిత విరాగం..
ఎస్వీఆర్..సీఎస్సార్..
ఆర్ నాగేశ్వర రావు..
జివిజి..సీత..
సేవకుడు ఆరణి..
బండివాడు సీతారాం..
అందరి కలగలుపు .
ఘంటసాల గొంతు..
బాలసరస్వతి.. జమునారాణి..
ఆ ఇద్దరి వాణి...
సముద్రాల రచన..
సుబ్బురామన్ సంగీతం..
వేదాంతం దర్శకత్వం..
అన్నీ అపూర్వమే..
వీరెవరూ ఇప్పుడు 
బ్రతికి లేరు..
కాని దేవదాసు..
సినిమాలో మరణించినా
సినిమా ఉన్నంతకాలం
బ్రతికే ఉంటాడు..!

_*దేవదాసు..*_
_ఓ సజీవ పాత్ర..._
_ఆధునిక చరిత్రలో_
_తొలి భగ్న ప్రేమికుడు.._
_తాగినా తగ్గని వాడు.._
*_చనిపోయినా..చిరంజీవి..!_*
_________________________

No comments:

Post a Comment