వేసవిలో...🌸
బుజ్జాయిల జ్ఞాపకాలు!
ఖాళీ అయిన పిట్ట గూడులా నా మనసు...
వేసవి సెలవులకి ఊరెళ్లిన
మా బుజ్జాయిల జ్ఞాపకాలు
పాత ఛాయా చిత్రాలతో ఊసులు!
పెరిగిన ఉష్ణోగ్రతల కంటే
అసౌకర్యంగా...
అదోలా...
ఏమి తినబుద్ధికాకుండా,
రాత్రిళ్లు నిద్ర లేకుండా!
పెన్సిళ్లతో గోడలపై అల్లరిగా
గీసిన పిచ్చిగీతలు,
అక్కడక్కడా పడేసిన పేపర్ పడవలూ, రాకెట్లు!
ఆ మూల ఈ మూల పడున్న కలర్ ఫుల్ వాటర్ బాటిళ్ళు!
మమ్మల్ని హత్తుకునేది ఎవరని ప్రశ్నించే టెడ్డీ బేర్లూ... పిల్లోలు!
పండుగాడు పక్కనజేరి "కతజెప్పునానీ "
అంటున్నట్టే ఉంది!
బిట్టు అల్లరిగా సెల్ లాక్కున్నట్టే ఉంది!
ఇల్లు ఇల్లంతా పిల్లలేరబ్బా అని వాపోతున్నట్టే!!
కళ్లజోడు లాగి పెట్టుకోని
ఫోజివ్వడం...
చేతి గాజులు సవరిస్తూ పాట పాడటం
చిన్నిమనసుల్లో నా వాళ్ళు అనే భరోసా!
కోట్లు కుమ్మరించినా దక్కని మమకారం!
ఈ వేసవిలో చిన్నారులకి
హైదరాబాద్ ఎగ్జిబిషన్లు, స్నో ల్యాండ్ విహారాలు...
ఒక్కోటి వాళ్ళబాల్యం గుర్తులు!!
✍️ఎం. వి. ఉమాదేవి.
No comments:
Post a Comment