*అవతార్ మెహర్ బాబా - 63*
🪷
రచన: బి. రామకృష్ణయ్య
*అంతిమ ప్రకటనము*
సెప్టెంబర్ 29, 30 తేదీలలో మెహెరాబాద్ లో ప్రత్యేక సమావేశము ఏర్పాటు చేసారు. 16 సంవత్సరములు అంతకుమించిన వయస్సు గల పురుషులను అనుమతించారు. సుమారు 900 మంది పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే బాబా మహాప్రకటన చేసారు. 29.09.54 తేదీన బాబా అందరినీ ఆలింగనం చేసుకున్నారు. క్రితం రోజు పడిన వర్షం వల్ల చాలామంది ప్రేమికులకు ఇబ్బంది కలిగింది. బాబా
ఈ అసౌకర్యానికి తనలో తానే ప్రశ్నించుకోగా 'మామూలు తీర్ధయాత్రలకు వెళ్ళే భక్తులే అనేక ఇబ్బందులను, కష్టాలను ఓర్చుకొని వెళుతుంటే సాక్షాత్తు అవతారుని సహవాసానికి వచ్చే ప్రేమికులకు ఆ మాత్రం అసౌకర్యం శిరోధార్యమే' అని సమాధానం ఇచ్చారు. (ఫైనల్ డిక్లరేషన్) అంతిమ ప్రకటనను చెప్పి అందరికీ 30.09.54దానిని వినిపించారు. ఆ ప్రకటనకు ముందు బాబా ప్రేమికులందరినీ మెహెరాబాద్ కొండ పైకి, తన సమాధి వద్దకు తీసుకొని వెళ్ళారు. తన ఆఖరి విశ్రాంతి స్థలమైన సమాధి మందిరాన్ని దర్శించమని అందరికీ చెప్పారు. తర్వాత దిగువ మెహెరాబాద్ లో సమావేశ స్థలానికి వచ్చి వేదిక పైన సోఫాలో కూర్చున్నారు. తన అవతారాగ మనానికి కారణ భూతులైన పంచ సద్గురువులను (షిరిడీ సాయిబాబా, ఉపాసనీ మహరాజ్, హజ్రత్ బాబాజాన్, తాజుద్దీన్ బాబా, నారాయణ మహారాజ్ లను) స్మరించి వారు తనకు దివ్య చైతన్యాన్ని కలిగించడంలో నిర్వహించిన పాత్రను వివరించారు. సాకోరీ నుండి వచ్చిన గోదావరి మాయి తదితరులను సభికులకు పరిచయం చేయించారు. గోదావరీ మాయి ఉపాసనీ మహరాజ్ తర్వాత సాకోరీ ఆశ్రమ ఆధిపత్యం వహించింది. ఆమెను బాబా తన తల్లి యశోదగా పేర్కొన్నారు. బాబా అంతిమ ప్రకటనలోని ముఖ్యాంశములు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
'ఇప్పుడు సావధానులై వినండి. నేను మాట్లాడుట, వ్రాయుట కూడా మాని వేశాను. ఈ ఆక్షర ఫలకాన్ని కూడా ఉపయోగించుట మానివేస్తాను. అంతర్ముఖుడనై ఉంటున్నట్లుగా ఉంటాను. ఇన్నాళ్ళుగా పదేపదే వాగ్దానాలు చేస్తున్న
నా మౌన విరమణ ఎట్టకేలకు చాలా దగ్గరగా వచ్చింది. నా అవతార జీవితంలో మూడు దశలు వ్యక్తమవుతాయి.
1. నా శరీరానికి వింతయైన ఒక వ్యాధి సోకుతుంది. అది నేను సూచిస్తూ వచ్చిన నా అవమానానికి కారణభూత మవుతుంది.
2. ఈ అవమానము నేను ఆకస్మికంగా చేయు మౌన విరమణలోను, ఆది
శబ్దోచ్చారణము చేయుటతోను ముగిసి పోతుంది. ఆ ఆదినాదాన్ని కేవలం ఒక్క భగవంతుడు మాత్రమే ఉచ్ఛరించగలడు.
3. నా అవతార వైభవము అవమానము యొక్క స్థానము నాక్రమిస్తుంది. నాలో అణగియున్న అనంతత్వము బయటకు వచ్చి విశ్వమంతా వ్యాపిస్తుంది. నా వైభవము విశ్వమంతా అనుభూతి పొందుతారు కాని నా భౌతిక సమక్షంలో నున్న కొద్దిమంది మాత్రం నా వైభవాను భూతిని పొందరు. నేను వెన్నుపోటుకు గురి అవుతాను. ఆ సమయంలో నా మండలివారు గాని, నా ప్రేమికులు గాని ఎవ్వరూ నా చెంత నుండరు.
నేను నా మౌనం విరమించుటకు ముందుగాని మౌనం విడిచిన వెంటనే గాని ప్రపంచంలో నాలుగింట మూడు భాగాలు నశించిపోతాయి.' అని చెప్పారు. అంతిమ ప్రకటనను సరిగా మధ్యాహ్నం మూడు గంటలకు ఈరుచ్ చదివి వినిపించారు. దాని అనువాదాన్ని మూడు ఇతర భాషల్లోను చదివి వినిపించారు.
ఈ అంతిమ ప్రకటన వలన ప్రేమికుల హృదయాల్లో కలిగిన భయాందోళనలు ఉపశమింప జేయడానికి బాబా దానిని విశదీకరించి జరుగబోయే సంఘటనలు కొన్ని తన భాషలోను, మరికొన్ని మన భాషలోను మరికొన్ని ఉభయ భాషలలోను చెప్పబడ్డాయని కేవలం తన భాషలో చెప్పినది ఎంత ప్రయత్నించినా మన అవగాహన కందనిదని, మన భాషలో చెప్పినది మాత్రమే అవగాహనకు వీలవుతుందని చెప్పారు. కేవలం సంఘటనలు జరిగిన తర్వాతనే బాబా భాషలో చెప్పిన సంఘటనల గురించి తెలుసుకొనగలమని చెప్పారు.
1. వింత వ్యాధి బాబా శరీరానికి సోకుట - (మన భాష)
2. దాని పర్యవసానంగా బాబాకు కలిగే అవమానం (మన భాష)
3. మౌన విరమణ చేసి ఆది శబాన్ని ఉచ్చరించుట (బాబా భాషలో -ఏక కాలంలో మన భాషలో కూడా చెప్పబడింది ఎందుకంటే బాబా ఆ ఆది శబ్దాన్ని ఉచ్ఛరించినప్పుడు అది అందరికీ వినబడేలా ఉంటుంది.)
4. బాబా వైభవము (ఉభయ భాషల్లో)
5. ప్రపంచం నాలుగింట మూడు వంతులు నాశనమగుట - (కేవలం బాబా భాషలోనే)
6. బాబాకు వెన్నుపోటు సంభవించుట (బాబా భాషలోనే)
7. బాబా భౌతిక శరీర త్యాగము - (ఉభయ భాషల్లో)
'విశ్వవ్యాప్తంగా ప్రపంచం భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను ఇవ్వబడే (షాక్) ఊపును స్వీకరించుటకు సిద్ధమగు వరకు పై సంఘటనలు జరిగే క్రమంలో గాని జరుగవలసిన కాల పరిమాణంలో గాని మార్పు జరుగవచ్చును' అని చెబుతూ 'కాల పరిమాణంలో మార్పు జరిగితే నేను భౌతిక శరీరం ద్వారా చేసే బాహ్యక్రియల తో సంబంధం తెగిపోతుంది' అన్నారు బాబా. 'నేను ప్రపంచానికి మరణించిన వానిలాగా మార్పుచేయబడిన కాల పరిమితి వరకు ఉండవలసివస్తుంది' అని బాబా చెప్పారు.
అవతారాగమన ప్రయోజనాన్ని అందరికి అందివ్వడం కోసం బాబా ఏర్పరచుకున్న తన దివ్య ప్రణాళిక ననుసరించి జరుగ వలసిన రీతిలో ఆ సంఘటనలు జరుగు తాయి. ప్రాపంచిక జీవితంలో నిమగ్నులై ఆధ్యాత్మి కానుభవం లేశమైన లేని వారు బాబా జరుప తలపెట్టిన సంఘటనల గురించి అవి ఎప్పుడు ఎలా జరుగుతాయ ని చెప్పడానికి ప్రయత్నించడం కేవలం ఊహాజనితమే అవుతుంది. బాబా ఏర్పరచుకున్న ప్రణాళిక ప్రకారం అవి ఆయన నిర్ణయించుకున్న రీతిలో తగు సమయంలో జరుగుతాయన్నది మాత్రం నిర్వివాదాంశం.
📖
*అక్షర ఫలకాన్ని విసర్జించుట*
బాబా 10.07.25 తేదీన మౌనం ప్రారంభించగానే చెప్పదలుచుకున్న విషయాలను పలక, బలపం ఉపయోగించి వ్రాసి చూపించేవారు. 1927వ సంవత్సరం లో వ్రాయడం మానేసి అక్షర ఫలకం ద్వారా చెప్పే మాటలను చూపించడం ప్రారంభించారు. అంతిమ ప్రకటన రోజు సూచించినట్లుగా బాబా 07.10.54 తేదీ నుండి అక్షర ఫలకాన్ని కూడా వాడడం మానివేసి సంజ్ఞల ద్వారా మాట్లాడటం ప్రారంభించారు. ఆ రోజు దసరా. షిరిడి సాయిబాబా నిర్యాణం చెందిన రోజు. రాముడు రావణ సంహారం చేసిన రోజు. ఆ సంజ్ఞలను మాటల రూపంలో వ్యక్తం చేయడం బాబాకు సన్నిహితుడైన మండలి సభ్యుడు ఈరుచ్ కి కలిగిన భాగ్యం. ఆ పనిని అంత సమర్థవంతంగా ఎలా నిర్వహించగలిగానో తనకే తెలియదని ఈరుచ్ చెప్పుతారు. పాశ్చాత్య ప్రేమికుల లో ముఖ్యుడైన మాల్కమ్ స్లాష్ 07.10.54 రోజు న్యూయార్క్ లో
చనిపోయారు. అంత ప్రాముఖ్యమైన రోజున గతించిన మాల్కమ్ అదృష్టవంతు డని బాబా చెప్పారు. బాబా పనిని నిర్వర్తించి భారతదేశం నుండి వెళ్ళే ముందు బాబా ఆలింగనం పొందాడు. బాబా ఆజ్ఞ ప్రకారం ఆ రోజు మండలి వారు మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి 12 గంటల వరకు ఉపవాసం చేసారు. సాయంత్రం మండలి వారికి ప్రణమిల్లుట ద్వారా తన పంచ సద్గురువులకు ప్రణమిల్లి తరువాత బాబా తనకు తానే ప్రణామం చేసుకున్నారు. కొంతసేపు ప్రశాంతంగా ఉన్న తర్వాత బాబా ముందుగానే చెప్పినట్లు ఈరుచ్ తో ప్రార్థనలు చదివించారు. సరిగా సాయంకాలం 7 గంటలకు బాబా అక్షర ఫలకాన్ని వదిలేసారు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment