Friday, August 29, 2025

 *ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత, దానిని సాధించడానికి అత్యంత ముఖ్యమైనది ఏమిటి?*


*పరిపూర్ణమైన*  *అన్వేషకుడు* 


ఒకసారి, ఒక గురువు తన శిష్యులకు ఇలా బోధిస్తున్నాడు, "ప్రియమైన శిష్యులారా, పరిపూర్ణమైన అన్వేషకులుగా అవ్వండి, మిడి మిడి జ్ఞానంతో, అసంపూర్ణ అన్వేషకులుగా ఉండకండి." 

పరిపూర్ణమైన, అసంపూర్ణ అన్వేషకుల గురించి విని, కొత్తగా వచ్చిన శిష్యుడికి ఆసక్తి కలిగి, అతని మనస్సులో ఒక ప్రశ్న తలెత్తింది.

అతను అడగకుండా ఉండలేకపోయాడు, "గురువుగారు, పరిపూర్ణంగా అన్వేషించే వ్యక్తిగా ఎలా మారగలం?"

గురువుగారు చిరునవ్వుతో ఇలా ఒక కథ చెప్పారు, "నాయనా, ఒక ఊరిలో ఒక మిఠాయి వ్యాపారి ఉండేవాడు. ఆ మిఠాయి వ్యాపారి రోజూ అనేక రకాల మిఠాయిలు చేసేవాడు, ఒకదానికంటే మరొకటి చాలా రుచిగా చేసేవాడు. చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఆ మిఠాయిలు బాగా ప్రాచుర్యం పొందడం వలన ప్రజలు తరచుగా అతని మిఠాయిలను, రుచికరమైన పదార్ధాలను ఆస్వాదించడానికి వచ్చేవారు.

ఒకరోజు భార్యాభర్తలు ఆ మిఠాయి దుకాణానికి వచ్చారు. వారితో పాటు చాలా సరదాగా, చిలిపిగా ఉన్న ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. ఆ పిల్లవాడి తండ్రి వ్యాపారిని ఒక మిఠాయి తయారుచేయమని అడిగాడు.

భార్యాభర్తలిద్దరూ అక్కడే ఎదురుచూస్తూ నిలబడ్డారు, కానీ ఆ పిల్లవాడు పదే పదే వచ్చి, "మిఠాయి సిద్ధం అయ్యిందా?" అని అడుగుతుంటే, 
దానికి మిఠాయి వ్యాపారి “ఇంకా పచ్చిగా ఉంది, మరికొంత సమయం పడుతుంది” అని చెప్పాడు.

కాసేపు ఆగిన తర్వాత మళ్లీ వచ్చి ఆ వ్యాపారిని ఇలా అడిగేవాడు - "చాలా మంచి వాసన వస్తోంది కదా, మిఠాయి ఇప్పుడింక సిద్ధమయినట్లేనా?" 

మిఠాయి వ్యాపారి, "లేదు, ఇంకా పచ్చిగా ఉంది, మరికొంత సమయం పడుతుంది" అని చెప్పాడు. 

ఇలా ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు...మళ్లీ మళ్లీ ఆ పిల్లవాడు  వచ్చి పదే పదే అడుగుతుండడంతో వ్యాపారికి కాస్త చిరాకు వచ్చింది.

అప్పుడతను ఒక చిన్న గిన్నె తీసుకొని, అందులో పచ్చి మిఠాయి వేసి, "ఇదిగో, ఇది తీసుకో ",అన్నాడు.

పిల్లవాడు అది తిని, “ఈ మిఠాయి బాగాలేదు” అన్నాడు.

 వ్యాపారి తక్షణమే ఇలా బదులిచ్చాడు, "నువ్వు మంచి మిఠాయి తినాలనుకుంటే, వెళ్లి అక్కడ నిశ్శబ్దంగా కూర్చో, వేచి ఉండు." 

ఈసారి ఇంక ఆ పిల్లవాడు వెళ్లి మౌనంగా కూర్చున్నాడు.

మిఠాయి సిద్ధమైనప్పుడు, దానిని ఒక పాత్రలో పెట్టి, అలంకరించి, వారి ముందు వడ్డించాడు.

ఈసారి తిన్న మిఠాయి చాలా రుచిగా అనిపించింది. ఆ వ్యాపారిని ఆ పిల్లవాడు ఇలా అడిగాడు," కొద్దిసేపటి క్రితం తిన్నప్పుడు అస్సలు రుచిగా లేదు. ఇప్పుడు దానికి ఇంత రుచి ఎలా వచ్చింది?"

అప్పుడు మిఠాయి వ్యాపారి అతనికి ప్రేమగా ఇలా వివరించాడు, “బాబు, నువ్వు నన్ను పదే పదే అడిగిన సమయంలో, ఈ మిఠాయి ఇంకా ఉడకలేదు, ఇంకా పచ్చిగానే ఉంది ... కానీ ఇప్పుడు సరిగ్గా ఉడికింది. సరిగ్గా ఉడకని, పచ్చి మిఠాయి తినడం మంచిది కాదు. అయినా కూడా అది తింటే, అప్పుడు కడుపు అనారోగ్యం పాలవుతుంది. కానీ బాగా ఉడికించిన తర్వాత, అది రుచిగా ఉండడమే కాక పోషకమైనదిగా కూడా మారుతుంది."


ఇప్పుడు గురువుగారు తన శిష్యునితో, " నాయనా, అసంపూర్ణ అన్వేషకులకు, పరిపూర్ణంగా అన్వేషించే వ్యక్తికి మధ్య తేడా నీకు అర్థమైందా?" అన్నారు.

శిష్యుడు ముకుళిత హస్తాలతో ఇలా చెప్పాడు, "గురువుగారు, మిఠాయి పచ్చిగా ఉండడం, వండిన తర్వాత రుచిగా ఉండడం - అది నాకు అర్థమైంది, అయితే ఇది ఒక అన్వేషకుడికి ఎలా వర్తిస్తుంది?"

గురువుగారు ఇలా అన్నారు, " నాయనా, ఒక అన్వేషకుడు కూడా మిఠాయి వంటివాడే. మిఠాయి చేసేవాడు నిప్పుల వేడి మీద మిఠాయిని నిదానంగా వండినట్లు, అదే విధంగా సాధకుడు నిరంతరం ధ్యానంతో, సాధనతో తనని తాను వండుకోవాలి. అవసరమైన పదార్థాలను జోడించిన తర్వాత అయినా, మిఠాయి పచ్చిగా ఉంటే, అది రుచిగా ఉండదు.

అదే విధంగా, ఒక సాధకుడు ఎంత జ్ఞానాన్ని సేకరించినా, ఎన్ని కర్మలు చేసినా, అతను తీవ్రమైన ధ్యానం యొక్క తాపాన్ని దాటకపోతే అతను ఉడకకుండా ఉండిపోతాడు. మిఠాయి సరిగ్గా వండాలంటే దాని ప్రక్కనే ఉండి, దానిని నిరంతరం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నట్లే, సాధకుడు కూడా తన మనస్సును జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి.

ఉడుకుతున్నప్పుడు మిఠాయి రంగు మారినప్పుడు, అది తీపి సువాసనను వెదజల్లడం ప్రారంభిస్తుంది, అది తినేటప్పుడు ఆనందాన్ని ఇస్తుంది, అప్పుడే ఆ మిఠాయి సరిగ్గా తయారయినట్లు అర్ధం. 

అదే విధంగా, సాధన, అన్వేషకుడు, అంతిమ లక్ష్యం ఒకటైనప్పుడు; అన్వేషకుడు ప్రేమ యొక్క సువాసనను వెదజల్లడం ప్రారంభిస్తాడు, అప్పుడు అతను పరిపూర్ణమైన అన్వేషకుడుగా అయినట్లు మనం గుర్తించవచ్చు."

అన్వేషకుని సాధన సంపూర్ణంగా జరిగే వరకు, అతనికి నిరంతరం జాగరూకత, మెళుకువ అవసరం. లేకపోతే ప్రపంచంలోని భ్రమలు చాలా ప్రలోభాలకు గురిచేస్తాయి, ఏ సమయంలోనైనా అన్వేషిని తన మార్గం నుండి తప్పించి, పెడత్రోవ పట్టించవచ్చు.

"సమస్తమైనదాన్ని తమ లక్ష్యంగా భావించడం ద్వారా జ్ఞానులు సంతృప్తి చెందుతారు, కానీ సరైన సాధన లేకుండా ఇది కూడా సాధించబడదు."

*సాధన మనిషిని పరిపూర్ణుడిని చేస్తుంది!సులభమైన సాధనను అనుసరించండి. సాధన లేకుండా ఏదీ పొందలేమనే రహస్యాన్ని తెలుసుకోండి. ఆధ్యాత్మికతలోనే కాకుండా ప్రాపంచిక విషయాలలో కూడా సాధన అవసరం.......లాలాజీ* 
*హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం*

No comments:

Post a Comment