Sunday, August 31, 2025

 *సంబరాల సంక్రాంతి*
                
సిటీలోనే పుట్టి పెరిగిన క్రాంతికి పల్లెటూరన్నా, అక్కడి జీవన విధానం అన్నా చాలా ఇష్టం. అందుకే  ఏరికోరి మరీ,  పల్లెటూరి అమ్మాయి అయిన కళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కూడా సిటీలోనే జరగడంతో అతనికి పల్లెటూరి సరదా తీరనేలేదు.

అయితే, పెళ్లి అయిన రెండు నెలలకే సంక్రాంతి రావడం, మామగారు మొదటి పండక్కి తప్పకుండా రమ్మనడం, భార్య కళ కూడా ఇంకా కాపురానికి రాకపోవడం……….ఇవన్నీ పల్లెటూరి పండుగ సరదాలు కళ్లారా చూడాలన్న క్రాంతికి , మంకీకి మొబైల్ దొరికినంత ఆనందం కలిగించాయి.

మర్నాడు ఉదయం బస్సులో బయలుదేరి, సాయంత్రానికి మామగారి ఊర్లో దిగాడు క్రాంతి.

అత్తారింట్లో, రాత్రి భోజనాలు అయ్యాక బావగార్ని ఆట పట్టిస్తున్న మనవలు, మనవరాళ్లతో,
"ఇంక కబుర్లు చాల్లెండర్రా! ఆ కుర్రాడు అంతదూరం ప్రయాణం చేసి వచ్చాడు. పడుకోనివ్వండి. మీరూ పడుకోండి. పొద్దున్నే లేవాలి" అంటూ కేకలేస్తున్న  కళ వాళ్ళ బామ్మలో,  తనని రక్షించడానికి తలమీద తెల్ల ముసుగేసుకుని వచ్చిన శ్రీ మహావిష్ణువు కనబడ్డాడు క్రాంతికి.

గదిలోకి వెళ్లి, భార్యతో కష్టసుఖాలు చెప్పుకుని అర్థరాత్రి దాటిన తర్వాత నిద్రకు ఉపక్రమించాడు క్రాంతి.

"ఏమిటా దిక్కుమాలిన నిద్ర. ఓ పండగాలేదు. పబ్బమూ లేదు. రాత్రంతా పనికిమాలిన కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం, పొద్దున్నే లేవకపోవడమూ" అత్తగారి అష్టోత్తరంతో ఉలిక్కిపడి లేచాడు క్రాంతి.

"మీ అమ్మగారు ఎందుకు అలా తిడుతున్నారు? ఏదో కొంచెం బద్ధకంగా ఉండి పడుకున్నా, అంతే! అయినా లేస్తున్నాగా!" బిక్కమొహం వేసుకుని అప్పుడే గదిలోకి వచ్చిన భార్య కళను అడిగాడు క్రాంతి.

"అయ్యో! ఆ తిట్లు మీకు కాదు. ఈరోజు భోగి పండుగ కదా? అందరూ తలంట్లు పోసుకోవాలి. అలా తిట్లతో తలంటితే కానీ మా తమ్ముళ్లూ, చెల్లెళ్లూ లేవరు మరి. సరే ఎలాగూ లేచారు కదా! తెమలండి. మా ఆఖరి తమ్ముడు, చెల్లాయి భోగి పిడకల దండలు మంటల్లో వేస్తారు. వెళ్లి చూద్దాం" అంటూ ముసుగులోంచి భర్తను బయటకు లాగింది కళ.

"ఔనౌను. నన్ను అయితే అంత సున్నితంగా ఎందుకు మందలిస్తారు ?" అనుకుంటూ బద్దకంగా లేచాడు క్రాంతి.

ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడూ భోగి పిడకల దండ మంటల్లో వేసే సరదా తీరలేదు క్రాంతికి. ఈ రోజు ఎలాగైనా ఆ సరదా తీర్చుకోవాలనుకున్నాడు. భార్యకు చెబితే 'ఈ వయసులో ఏమిటి ఈ సరదాలు' అని నవ్వుతుందని, ఆమెకు తెలియకుండా, తమ గదిలో బల్లమీద ఉన్న  ఓ దండని ఎవరికీ కనబడకుండా పట్టుకుని అందరితో పాటు ఆ మంట వద్దకు చేరుకున్నాడు.

అప్పటికే అక్కడ భోగి మంటల హడావుడి మొదలయ్యింది. కొంతమంది అక్కడ చలి కాచుకుంటున్నారు. పిల్లలు ఒక్కొక్కరే వచ్చి తాము తెచ్చిన దండలను ఆ మంటల్లో వేస్తున్నారు. పిల్లలు ఆనందంతో చప్పట్లు కొడుతున్నారు. 

ఇక ఆలశ్యం చేయకూడదని క్రాంతి కూడా తాను తెచ్చిన భోగి దండను మంటల్లోకి విసిరి, తన సరదా తీర్చుకున్నాడు, అందరూ తన వంక ఆశ్చర్యంగా చూస్తూ కేరింతలు కొడుతుండగా, కళ సంభ్రమంగా చూస్తుండగా!!

     **

ఆ రోజు సాయంత్రం కాఫీ తాగుతూ పేపరు తిరగేస్తున్నాడు క్రాంతి. ఇంతలో

"ఒసేయ్ కళా! ఆ దండ ఇలా పట్టుకురావే, ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి వస్తా" వసారాలోంచి అరిచింది బామ్మ.

"ఏ దండ బామ్మా?" అడిగింది కళ.

"అదేనే మీ గదిలో బల్ల మీద పెట్టిన ఆ  దండ. ఆంజనేయ స్వామికి వేద్దామని...."

"ఇక్కడ ఏ దండా లేదు బామ్మా!"

"అయ్యో, లేదా? బయటపెడితే కుర్రకుంకలు తినేస్తారని వాళ్ళ కంట పడకుండా ఆ అప్పాల దండ మీ గదిలో పెట్టా. అయినా తినేసారా? వీళ్ల మొహాలు తగలెయ్యా. కోతులు కన్నా ధారుణంగా తయారయ్యారు. నన్ను క్షమించు ఆంజనేయా.... బామ్మ కేకలతో సీను అర్థమయ్యిన కళ, క్రాంతి వైపు చూసింది 'పొద్దున్న మీరు మంటల్లో వేసినది ఈ దండేనా?" అన్నట్లుగా.

"ఔను అదే ఇది" అని అర్థం వచ్చేలా సిగ్గుతో మెలికలు తిరుగుతూ, అవమాన భారంతో పేపర్లోకి  మరింతగా దూరిపోయాడు క్రాంతి. 

సంక్రాంతి రోజు ఉదయం హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న క్రాంతి,

"పిల్లలూ,  హరిదాసు వచ్చాడర్రా, హరిదాసు" అన్న బామ్మగారి పిలుపుతో ఒక్క ఉదుటున తనూ వీధిలోకి వచ్చాడు, హరిదాసుని ప్రత్యక్షంగా చూడాలని.

ఒకచేత్తో సెల్ ఫోన్ నుంచి ఏవో పాటలు వస్తుండగా, ఇంకో చేత్తో ఏదో గిన్నెలాంటి పాత్ర పట్టుకుని, రంగు రంగుల ఫాంట్, చొక్కా వేసుకుని, బయట ముగ్గులో కూర్చొని ఉన్న హరిదాసును చూడగానే,
"హూ! వీళ్లకు కూడా మోడ్రన్ కల్చర్ అలవాటయ్యింది. తాను చదివిన, బొమ్మల్లో  చూసిన హరిదాసులా లేడు ఈయన" అనుకుంటూ తన దానగుణం గురించి అత్తారింటివారికి గొప్పగా  తెలిసేలా జేబులోంచి ఓ వెయ్యి రూపాయలు తీసి ఆ గిన్నెలో వేసి నమస్కారం చేసాడు క్రాంతి. 

"అయ్యయ్యో! మీరు నమస్కారం చేయడం ఏమిటి? మీ పెళ్లికి రానందుకు మీరే నన్ను మన్నించాలి. పైగా కానుక కూడా ఇచ్చారు" అంటూ పైకి లేచాడు హరిదాసు, ఆ వెయ్యి రూపాయలు జేబులో కుక్కుకుంటూ.

"సర్లే ఇంక లోపలికి రా!" అన్న తన అత్తగారి పిలుపుతో "వస్తున్నా, పిన్నీ" అంటూ ఆవిడ వెంట నడిచాడు హరిదాసు.

"ఎవడీడు??" వెర్రి మొహం వేసుకుని కళను అడిగాడు క్రాంతి.

"మా పెద్దమ్మ కొడకండీ. వీడి పేరు హరిదాసు. వాళ్లమ్మ ఆ గిన్నెతో కందిపప్పు తెమ్మందిట. అందుకే వచ్చాడు" చెప్పింది కళ.

"మరి ఆ ముగ్గులో కూర్చుని ఏం పీకుతున్నాట్ట?" అసహనంగా అడిగాడు.

"ఓ అదా ! ఆ ముగ్గు ఎన్ని చుక్కలతో వేసారో లెక్క పెడుతున్నాడు"

"వాడు చుక్కలు లెక్క పెట్టడం కాదు. నాకు చుక్కలు చూపించాడు" అని మనసులోనే మూలుక్కున్నాడు క్రాంతి, రెక్కలొచ్చి చుక్కల్లోకి ఎగిరిపోయిన తన వెయ్యి రూపాయల గురించి తలచుకుంటూ.

         *****      
ఆ రోజు సాయంత్రం,
"ఏమండీ! బోర్ కొడుతోందేమో? అలా వెళ్లి శిల్పారామాన్ని చూసొద్దాం రండి" అన్న కళ పిలుపుతో,

"ఏమిటీ శిల్పారామమా ? ఇక్కడా?" అనుమానంగా  అడిగాడు క్రాంతి.

"ఏం ఇక్కడ ఉండకూడదా?" రెట్టించింది కళ.

"అబ్బే, ఎందుకు ఉండకూడదు, ఉండొచ్చు. ఇప్పుడు, పల్లెటూళ్లు కూడా బాగా  డెవలప్ ఔతున్నాయిగా!" అంటూ ఆనందంగా ఆమె వెంట బయలుదేరాడు క్రాంతి.

ఓ నాలుగు వీధులు దాటిన తర్వాత, ఓ ఇంటి వద్దకు రాగానే,
"ఏమేవ్ కళా! ఎవరూ మీ ఆయనా? రండి లోపలికి" అంటూ ఆహ్వనించింది ఆ ఇంటావిడ.

"ఔను అక్కా ఆయనే! బావగారు లేరా" లోపలికి వస్తూ అడిగింది కళ.

"వచ్చేస్తారు. రండి కూర్చోండి మరిదిగారూ, ఈలోగా ఇవి తీసుకోండి" అంటూ ఓ ప్లేటులో జంతికలు, ఓ మినపసున్ని ఉండ పెట్టి క్రాంతికి ఇచ్చి, వేరే గదిలో మచ్చట్లలో పడ్డారు మగువలిద్దరూ.

జంతికలు పని పట్టేసి, సున్నుండ వ్యవహారం తేల్చడానికి సమాయత్తం అయ్యాడు క్రాంతి. కానీ ఇనుప ఉండలా ఉన్న ఆ మినప ఉండ అతని చేతినుంచి తప్పించుకుని, కాలు చిటికెన వేలు మీద పడి అక్కడ చిన్న కన్నం కొట్టి, అక్కడ కారిన రక్తాన్ని వంటబట్టించుకుని జరజరా గెంతుకుంటూ గుమ్మం వైపు దౌడు తీసింది.

దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని కృతనిశ్చయుడైన క్రాంతి, సోఫా లోంచి లేచి, గుమ్మం ముందు వంగి ఆ ఇనుప ఉండను అందుకోబోయేంతలో………

"అయ్యో,అయ్యో ! సిటీలో ఉన్నాడన్న మాటే గానీ ఎంత వినయం, ఎంత విధేయత? గుమ్మంలో నన్ను చూడగానే లేచి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసాడు. కళా! మీ నాన్న భలే అల్లుడ్ని పట్టేసాడే! లే నాయనా! లే " అన్న మాటలు వినబడడంతో, ఆ మనిషిని చూసి "నీకు అలా అర్థం అయ్యిందా నిన్ను తగలెయ్యా" అనుకుంటూ ఆ ఉండను పక్కనున్న తూములో కుక్కి, చేతులు దులుపుకుని లేచి, తిరిగి సోఫాలో కూలబడ్డాడు క్రాంతి, అప్పటికే అక్కడ కూర్చున్న కళ అతని వంక వింతగా చూస్తుండగా!

కాసేపటికి తేరుకున్న క్రాంతి "కళా! త్వరగా తెములు మరి. శిల్పారామాన్ని చూపిస్తా అన్నావ్" అన్నాడు నెమ్మదిగా.

"అయ్యో! చెప్పనేలేదు కదూ! ఇది మా పెద్దనాన్న కూతురు శిల్ప. ఆ వచ్చినాయన మా బావగారు రామం. నేను కళాక్రాంతి ఎలాగో ఇది శిల్పారామం" చెబుతున్న భార్య వంక వెర్రి చూపు చూస్తూ, 
"నా పిండాకుడే నా పిండాకుడు. ఇంకా నయం సుందరాన్ని చేసుకోలేదు 'శిల్పసుందరం' అని పెట్టుకునేవారేమో" అని నోటితో తిట్టలేక నోట్లోని పళ్లని పెద్ద శబ్ధంతో పిండుకున్నాడు క్రాంతి.

     *****

కనుమ రోజు ఉదయం టీవీ చూస్తున్న క్రాంతికి ఎక్కడినుంచో భీభత్సమైన అరుపులు కర్ణకఠోరంగా వినబడడంతో భయంతో చెవులు గట్టిగా మూసుకుని టీవీ చూడసాగాడు.

ఈలోగా పిల్లలు "గంగిరెద్దు వచ్చింది. గంగిరెద్దు" అని సంతోషంగా కేకలు వేయడంతో ఆ ముచ్చట కూడా తీర్చుకుందామని వీధిలోకి వచ్చాడు. 

సన్నాయి లాంటి వాయిద్యాన్ని కర్ణకఠోరంగా వాయిస్తున్న అతని వద్దకు వెళ్ళి,

"ఏమయ్యా! నక్కలు, కుక్కలు కలిసి జుగల్బంధీ చేస్తున్నట్లు అంత భయంకరంగా వాయించకపోతే, హాయిగా మనసుకు హత్తుకునేలా ఓ పాట వాయించవచ్చు కదా?" అడిగాడు అసహనంగా.

"బాబయ్యా! అంత అత్తుకునేలా పాట వాయిస్తే, మీరు కుర్చీకి అతుక్కుపోయి హాయిగా యింటారు కానీ,  ధర్మం సేయడానికి లెగిసొత్తారా బాబయ్యా? అందుకే కావాలనే అంత సెండాలంగా వాయిత్తాం, ఆ వాయింపు వినలేక చచ్చినట్టు బయటకొత్తారని" క్రాంతికి గూబ గుయ్యిమనేలా చెప్పాడు ఆ బూరా ఊదే ఆయన.

"నీ వాయింపు మాట ఎలా నీ సమర్ధింపు నాకు నచ్చిందోయ్. ఇదిగో ఇది ఉంచు" అంటూ ఓ వంద నోటు అతని చిరిగిన కోటులో పెట్టి, ఆ గంగిరెద్దు చెవి వద్దకు వెళ్ళిన క్రాంతి,

"గంగిరెద్దులాగ భలే జీవిస్తున్నావోయ్. మొహంలో జీవకళ ఉట్టిపడుతోందనకో! ఔనూ, ఈ వేషం వేసినందుకు రోజుకు ఈయన ఎంతిస్తాడు" అడిగాడు నెమ్మదిగా, ఇతను ఏంచేస్తున్నాడా అని మిగతా వారంతా క్రాంతి వైపు అయోమయంగా చూస్తూండగా.

ఇతని చేష్టలకి సమాధానంగా ఆ గంగిరెద్దు తల అటూఇటూ ఊపింది.

దానికి క్రాంతి, "ఎంతిస్తారో చెప్పడానికి అంత సిగ్గు ఎందుకోయ్?  మా సిటీలో కూడా బోనాలకి ఇలాగే పులి వేషం వేసుకుని వస్తార్లే! ఆంతకీ  బయటికి చెప్పడానికి వెధవ మొహమాటం అయితే పోనీ చెవిలో చెప్పు" అంటూ తన తల తీసుకుని వెళ్లి, గంగిరెద్దు తల ముందు పెట్టాడు.

ఊహించని ఈ సంఘటనకు బిత్తరపోయిన ఆ గంగిరెద్దు, "అంబా" అంటూ బిగ్గరగా అరచి, తన తలతో కుమ్మిన కుమ్ముకు అంతరిక్షం నుంచి అగాధంలో పడిన స్కైలాబ్ లాగ వెళ్లి హాలులో ఉన్న బల్ల మీద పడ్డాడు క్రాంతి.

"ఏమిటే ఆ చప్పడు? ఏం పడింది? కొంపదీసి అటకమీద ఉన్న బాన కాదు కదా?" అడిగింది బామ్మ లోపలి గదిలోంచి.

"బామ్మా! పడింది బాన కాదు బావ" నవ్వుతూ చెప్పింది పెద్ద మరదలు.

"ఔనా? పాపం ఏమయినా విరిగాయా?" ఆదుర్దాగా అడిగింది బామ్మ.

"విరిగాయి. బల్లకు రెండు కాళ్లు, బావకు రెండు కీళ్లు" మళ్ళీ  అదే నవ్వుతో చెప్పింది పెద్ద మరదలు.

"తప్పే! బావను అలా ఏడిపించకూడదు. ఏవండీ,  ఏమైనా దెబ్బలు తగిలాయా?" గోముగా అడిగింది అప్పుడే రంగప్రవేశం చేసిన కళ.

"హి...హి...హి..అబ్బే ఏం లేదు. ఆ ఎద్దు వేషగాడికి నా భాష అర్ధమవ్వలేదంతే...సరే గదిలోకి నడు, కాళీయమర్ధనం చేయడానికి. అదే ...కాలికి మర్ధనా చేయడానికి" అంటూ భార్య ఆసరాతో, కుంటుకుంటూ గదిలోకి నడిచాడు క్రాంతి, బయట ఉన్న గంగిరెద్దు వైపు తినేసేలా చూస్తూ.

ఆ రోజు కనుమ పండగ కావడంతో, ఈ మూడు రోజుల అనుభవాలూ దృష్టిలో ఉంచుకుని, ఎందుకైనా మంచిదని, కాకిలాగే క్రాంతి కూడా కదలకుండా ఇంటి పట్టునే ఉండిపోయి, మర్నాడు సంక్రాంతి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సిటీకి బయలుదేరాడు.

No comments:

Post a Comment