Sunday, August 31, 2025

 ❤️ *భోజ మహారాజు దగ్గరకు ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు ఏదో సంభావన దొరక్క పోతుందా? అని. ఎంతైనా భోజరాజు కదా ఆయన సామాన్య పౌరుడు కాదు. సామాన్యులు అయితే ఏదో తోచించి ఇస్తారు బ్రాహ్మణుడికి. కానీ రాజు తల్చుకుంటే రాజ్యంలో భాగాన్ని అయిన ఇచ్చేసేంత దాతృత్వ గుణం కూడా ఉంటుంది. అందుకని భోజరాజు దగ్గరకు వచ్చిన ఆ బ్రాహ్మణుడు రాజు గారి వద్ద బాగా సంభావన కొట్టేయాలని అనుకున్నాడు.*
💕 *కొందరికి రాజుల దగ్గర, ధనవంతుల దగ్గర లభించే డబ్బు, బహుమానాలే ఇంట్లో ఎన్నో సమస్యలు తీరడానికి ఉపయోగపడతాయి.*
❤️‍🩹 *రాజును మెప్పించాలి అంటే కాస్త పాండిత్య ప్రదర్శనో, కవిత్వం చెప్పటమో, రాజును పొగడటమో - ఏదో చేయాలి" అనుకున్నాడు అతడు. మహారాజును కనుక సంతోషపరిస్తే నా పంట పండినట్లే, బోలెడు బహుమానాలు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనుకున్నాడు.*
💗 *బ్రాహ్మణుని చూడగానే రాజు గారు లేచి నమస్కారం చేసి "స్వామీ! తమరి పేరేమి? ఎక్కణ్ణుంచి వస్తున్నారు?" అని అడిగాడు.*
🩵 *బ్రాహ్మణుడు తన పేరు చెప్పి, "మహారాజా నేను ఆ పరమేశ్వరుడి నివాసం అయిన కైలాసం నుండి వస్తున్నాను" అన్నాడు.*
🤎 *అదేమో నిండు సభ. ఆ సభలో ఉన్న వాళ్ళు అందరూ ఆ బ్రాహ్మణుడి మాటలు విని ఆశ్చర్యపోయారు.*
💖 *రాజుగారికి మాత్రం ఆ మాటలు చమత్కారంగా అనిపించాయి. ఆ బ్రాహ్మణుడితో 'అక్కడ పరమశివుడు ఎలా ఉన్నాడు? క్షేమంగా ఉన్నాడా?' అని అడిగాడు రాజు.*
💛 *అప్పుడు బ్రాహ్మణుడు రాజుతో "పరమశివుడా? ఇంకెక్కడ పరమశివుడు మహారాజా, ప్చ్!! పోయాడు. ఇప్పుడు కైలాసంలో శివుడు లేడు" అన్నాడు.*
💗 *అంతవరకు చమత్కారం అనుకున్న మహారాజుకు బ్రాహ్మణుడి మాట వినగానే నోటమాట రాలేదు. "ఆ! అయ్యో పరమశివుడు పోవడం ఏంటి??" అని అడిగాడు.*
❣️ *దానికి ఆ బ్రాహ్మణుడు, "అవును మహారాజా! శివుడు తనలో సగభాగాన్ని పార్వతికిచ్చి అర్థనారీశ్వరుడు అయ్యాడు గదా!" అన్నాడు.*
❤️ *”అవును అయితే ఇంకా సగం ఉన్నాడు కదా పరమేశ్వరుడు" అన్నాడు అక్కడున్న ఒక వ్యక్తి.*
💕 *”నువ్వు ఆగవయ్యా నేను చెబుతున్నాగా" అని అతని నోరు మూయించాడు బ్రాహ్మణుడు.*
💖 *తరువాత మళ్ళీ భోజరాజుతో "పార్వతికి సగభాగం ఇచ్చి, మిగతా సగం శ్రీహరికిచ్చేశాడు" అన్నాడు బ్రాహ్మణుడు.*
💓 *ఆ మాట వినగానే భోజరాజు కాస్త తేరుకున్నాడు. "పోవడమంటే ఇలా ఆన్నాడా ఈ బ్రాహ్మణుడు" అని మనసులో అనుకుని తరువాత "ఈ బ్రాహ్మణుడిని ఎలాగైనా ప్రశ్నలతో ఇరికిస్తాను" అనుకున్నాడు.*
❤️ *”మరి పరమశివుడు తన ఆస్థిపాస్తులు ఎవరికిచ్చాడు?” అని అడిగాడు రాజు. "ఇప్పుడు సమాధానం చెప్పు చూద్దాం" అన్నట్టు ముఖం పెట్టి.*
💕 *”ఏముంది మహారాజా! నెత్తిమీది గంగను హిమాలయాలకు పంపించాడు. చంద్రుణ్ణి అంతరిక్షంలోకి పంపాడు. పాములను నాగలోకానికి పంపేశాడు" అన్నాడు బ్రాహ్మణుడు.*
🧡 *”అయ్యో అవునా అయితే పరమశివుడు నాకోసం ఏమీ ఇవ్వలేదనమాట. నువ్వు కైలాసం నుండి వస్తున్నావంటే నాకోసం ఆ పరమశివుడిని అడిగి ఏమైనా తీసుకొచ్చి ఉంటావని అనుకున్నాను" అన్నాడు రాజు.*
💚 *”మహారాజ మీరేమి బాధపడక్కర్లేదు. అన్నీ అలా ఇచ్చేసిన తర్వాత కూడా ఆయన బోళా శంకరుడుగదా! అడిగినవారికి లేదు అనకుండా ఏదడిగితే అది ఇచ్చే ఔదార్యం గలవాడు గదా! ఆ ఔదార్యాన్ని మీకు ఇచ్చేసాడు అంట. చెప్పమన్నాడు శివుడు" అన్నాడు బ్రాహ్మణుడు.*
💕 *ఆ మాటలు వినగానే భోజరాజు పొంగిపోయాడు. అయినా కూడా బయటకు కనబడనీయకుండా. "అవునా!! నేను ఇక్కడున్నాను. నాకొసమే ఔదార్యం ఇచ్చిన పరమశివుడు నీకోసం ఏమీ ఇవ్వలేదా??" అన్నాడు.*
❤️ *”ఎంత మాట మహారాజ!! నేను ఆ శివుడి దగ్గర ఉన్న వాణ్ణి.నాకు ఏమీ ఇవ్వకుండా ఎలా పంపుతాడు. ఆయన దగ్గర మిగిలింది కేవలం భిక్ష పాత్ర మాత్రమే. అందుకే నాకు దాన్నే ఇచ్చాడు" అన్నాడు బ్రాహ్మణుడు.*
💕 *”ఆహా అవునా!!" అన్నాడు రాజు.*
❤️ *”అవును మహారాజ!! పరమశివుడు ఇచ్చిన భిక్ష పాత్రను తీసుకుని ఎక్కడంటే అక్కడికి పోలేను కదా. అందుకే ఆయన ఔదార్యాన్ని ప్రసాదించిన మీదగ్గరకు వచ్చాను" అన్నాడు బ్రాహ్మణుడు.*
💗 *మొత్తం విని ఆ సభలో ఉన్నవాళ్లు అందరూ ఆశ్చర్యపోయారు. "ఔరా!! ఈ బ్రహ్మణుడి మాట చాతుర్యం ఎంత గొప్పది”అనుకున్నారు*
❤️ *ఆ బ్రాహ్మణుడు మాట్లాడినది అంతా తెగ నచ్చేయడంతో రాజు ఆయా బ్రాహ్మణుడికి బోలెడు బహుమతులు ఇచ్చి సంతోషపెట్టి పంపాడు.*
💕 *~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment