Tuesday, May 5, 2026

 మేలుకొలుపు

దేశ సంక్షేమానికి కావాల్సింది ఉత్తమ పౌరులు. వారు ఎక్కడి నుంచో రారు. మన కృషితోనే తయారవుతారు. పిల్లల బాల్యమనేది- వారిదైన ప్రత్యేక వ్యక్తిత్వం, గుణగణాలు రూపుదిద్దుకునే కీలకసమయం. ఆ వయసులో వారికి విలువలు నేర్పి ధర్మపథంలో తీర్చిదిద్దగలిగితే మంచి వ్యక్తులుగా ఎదుగుతారు. పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో కుటుంబం, పాఠశాల, సమాజం కీలక పాత్ర పోషిస్తాయి. చిన్ననాటి నుంచే మనసులో ప్రేమ, సహనశీలత, మానవతా విలువలు, మంచీ చెడుల విచక్షణ పెంపొందించగలిగితే పిల్లలు మంచి పౌరులుగా రూపుదిద్దుకుంటారు.

బిడ్డ సక్రమ పెరుగుదలకు- ఆహారం రెండు రెట్లు, తండ్రి నాలుగు రెట్లు, తల్లి ఆరు రెట్లు, గురువు ఏడు రెట్లు ప్రభావాన్ని చూపుతారని; విద్య, శీలం, వినయం లాంటి గుణాలను బాల్యంలోనే నేర్పితే వృద్ధాప్యంలో వారు ధార్మికులుగా, గౌరవనీయులుగా ప్రశం సలు అందుకుంటారని 'విదురనీతి' పేర్కొం టోంది. 'నాకు వందమంది పిల్లల్ని ఇవ్వండి, వాళ్లను భావి భారతపౌరులుగా తీర్చిదిద్దు తాను' అన్నారు స్వామి వివేకానంద. పిల్లల్ని తీర్చిదిద్దడం ఓర్పు, నేర్పు, కూర్పులతో కూడిన కళ. గ్రీకు పురాణాల్లో ఒక కథ ఉంటుంది. నార్సిసస్ అనే అందమైన యువకుడిలో తల్లి చిన్ననాటి నుంచే అహంకార భావాన్ని పెంచింది. అతడు కేవలం తన గురించి మాత్రమే ఆలోచించేవాడు. తన ప్రతిబింబాన్ని నీటిలో చూసి, దాన్నే ప్రేమించి, చివరికి అందులోనే మునిగి మరణించాడు.
పిల్లలకు జాలి, కరుణ, సహనం, ఇతరులతో కలసి మెలసి జీవించడమనే విలువలను నేర్పాలి. అప్పుడే సంఘం పట్ల ప్రేమతో, బాధ్యతతో జీవించే వ్యక్తులుగా ఎదుగుతారు. మన పురాణ గాథలు అందుకు గొప్ప పాఠాలుగా నిలుస్తాయి. పిల్లల ఎదుగుదల అనుకరణ, ప్రోత్సాహం, అనుభవం, పరిసరాల ప్రభావం అనే నాలుగు ప్రధాన మార్గాల్లో జరుగుతుంది. అంటే, పిల్లలు తల్లిదండ్రుల ప్రవర్తనను అనుకరిస్తారు. చిన్న తప్పును ఉపేక్షించి వదిలేస్తే, అది పెరిగి పెద్దదవుతుందంటుంది. యోగవాసిష్ఠంలో లవణాసురుని కథ ఇందుకు ఉదాహరణ. లవణాసురుడు చిన్ననాటి నుంచే క్రూరమైన పనులు చేస్తూ, ఎవరూ ఆపకపోవడంతో చివరికి రాక్షసుడిగా మారాడు. ధర్మానికి ప్రతిరూపుడైన శ్రీరాముడి చేతిలో మరణిం చాడు. కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారం పిల్లల పెంపకంలో మూడు దశలు- లాలన, శిక్షణ, మిత్రత్వం. బాల్యంలో లాలించి చెప్పడం, కౌమారంలో శిక్షణ నివ్వడం, యుక్తవ యసులో మిత్రులుగా చూడటం అవసరం. ఎంత పెద్ద వృక్షమైనా చిన్నవిత్తనం నుంచే ఎదుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు కలిసి పిల్లల్లో విలువల్ని నాటాలి. భద్రతనిచ్చే, ప్రేమను పంచే తల్లిదండ్రులు సంరక్షణదారులుగా ఉంటే, పిల్లలు మెరుగైన సామాజిక సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం పిల్లల్లో అస్థిరత, భయం, ఒంటరితనాలను పెంచుతుంది. పెద్దలు ప్రేమతో, ఓర్పుతో, దయతో వ్యవహరిస్తే పిల్లలు మనోబలంతో, ఆత్మవిశ్వాసంతో పెరుగుతారు. ప్రేమతో పెరిగిన బిడ్డలే భవిష్యత్తు ప్రపంచాన్ని బాధ్యతతో తీర్చిదిద్దగలరు.

డాక్టర్ శ్రీదేవీ శ్రీకాంత్

No comments:

Post a Comment