Tuesday, May 5, 2026

 " అప్పుడు.....ఇప్పుడు"
               *****            ***       ****
  వెనుకటి రోజుల్లో "ఇంటి ముందు వేసిన తాటాకు పందిరి పచ్చదనం ఉండే వరకు  చుట్టాలు ఇంట్లో ఉండాలి!" అని పట్టుబట్టేవాళ్ళు! 
        పెళ్లి ఇల్లు సందడిగా ఉండేది పదహారు రోజులపాటు   తాత గారి కాలంలో!......పదహారు రోజుల  పెళ్లిళ్లు జరిగేవి ఆ కాలంలో .. నాన్న హయాము వచ్చేసరికి ఐదు రోజుల పెళ్లి..
    ఇప్పటికీ పల్లెటూర్లలో పెళ్లికి వచ్చిన దగ్గర బంధువులు  కనీసం రెండు మూడు రోజులైనా ఉండి వెళుతున్నారు..
       వెనుక ఇంటిముందు విశాలమైన ఆవరణలో  మంచి రోజులు చూసుకుని తాటాకుల పందిరి వేసేవాళ్ళు.. రెండు మూడు రోజులు ముందే బంధువులు వచ్చేవాళ్ళు.. కొంచెం దూర దూర గ్రామాల నుంచి ఎడ్ల బండ్లు సవారి కట్టుకుని వచ్చేవాళ్ళు.. "పెళ్లివాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే!"అని బండి వెనకవైపు రెండు గడ్డిమోపులు జనప కట్టెలు కట్టుకుని వచ్చేవాళ్ళు.. 
మా తాతకు కోపం వచ్చేది  " మీ యెడ్లకు  నాలుగు మోపులు ఎండు గడ్డి,జనుము కట్టలు మేము వెయ్యలేమ? మీ ఊరు నుంచి మోసుకొచ్చారు ఎందుకు? మా పరువు తీస్తున్నారు!"" అంటూ చిరాకు పడేవాడు..
        తాతకు మహా కోపం.. ఎవరన్నా పెళ్లి భోజనానికి పిలిస్తే రెండోసారి వచ్చి పిలిస్తేనే వెళ్లేవాడు.. దిబ్బ మీద పొలం గట్ల దగ్గర పెరిగిన తోటకూర కాడలు ఇంటికి తీసుకొస్తే ఆ రోజు గనుక నాయనమ్మ వండకపోతే  తోటకూర కట్టలు గేదెలకు వేసేవాడు.. పెళ్లి బంతిలో కూర్చొని భోజనం చేసేటప్పుడు ఎవరన్నా ఇస్తరాకు దగ్గరగా నడిస్తే భోజనం చేయకుండా చిందులు తొక్కి ఇంటికి వచ్చేసేవాడు.. పెళ్లయిన కొత్తలో మా నాయనమ్మ  తమలపాకుల కిళ్ళీ వేసుకుని,తనకు ఇవ్వలేదని మూడు నెలలు ఆమె తో మాట్లాడలేదంట! నాయనమ్మ కథలుగా, కథలుగా తాత కోపతాపాలు గురించి చెప్పేది..
     ఇంటి ముందు వేసిన పెళ్లి పందిరిలో కనీసం ఓ పాతిక నవారు మంచాలు, ఐదారు మడత మంచాలు, నాలుగైదు నులక మంచాలు వేసేవాళ్ళు.. అంత పెద్ద తాటాకుల పందిరి  అది!.. చుట్టాలు మంచాల మీద కూర్చుని  పంటల గురించి,వానల గురించో,ఎకరానికి  ఎన్ని బస్తాల ధాన్యం పండిందో?.. పెళ్లీడుకొచ్చిన పిల్లల గురించి తిరిగ్గా మాట్లాడుకునేవాళ్ళు!  పిల్లలు సందడిగా ఆ మంచాల మధ్య పరుగులు తీస్తూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు..
 అల్యూమినియం జగ్గుతో మంచినీళ్లు తెచ్చి గ్లాసుల్లో పోస్తూ వాళ్లకు అందించేవాళ్ళం చిన్నతనంలో.. ఇంట్లో ఆడవాళ్లు గాజుల మలారం అబ్బాయి వస్తే, చుట్టూ చేరి రంగురంగుల గాజులు వేయించుకోవడం.. గోరింటాకు నూరి చేతులకు పెట్టుకోవడం.. మల్లె పందిరి, సన్నజాజి పందిరి దులిపి పూలు మాలగా కట్టుకోవడం.. పట్టు చీరల జిగేలు, మల్లెపూల మధురమైన వాసన హలంతా వ్యాపించడం..
     పొద్దున్నే మొహం కడుక్కోవటానికి వేప పుల్లలు, కచ్చిక,ఎర్ర రంగులో ఉన్న పళ్ళపొడి పొట్లం నీళ్ళగాబుల దగ్గర పెట్టేవాళ్ళం.. నాలిక గీసుకోవడానికి ఎండిన తాటాకు బద్దలు..
 వెనక దొడ్లో గాడి పొయ్యి, ఈతకు చాప మీదకు కూర్చుని  కూరగాయలు తరిగే  ఆడవాళ్లు..
 కొబ్బరి పీచుతోను ఈత ఆకులతో తయారు చేసిన బంతి చుట్టలు ఉండేవి.. వాటిని పరిచి కూర్చోమని బంధువులను ఆహ్వానించేవాళ్ళు టిఫిన్లు, భోజనం వడ్డించటానికి...
 పొద్దున్నే జీడిపప్పు దట్టించిన వేడివేడి ఉప్మా.. కమ్మటి నెయ్యి.. ఇత్తడి, స్టీల్ గ్లాసుల్లో వేడి వేడి కాఫీ పోసి  వచ్చిన చుట్టాలు అందరికీ  ఇవ్వడం..
 మధ్యాహ్నం నాలుగైదు రకాల కూరలతో  భోజనం.. పులిహార,పాయసం తప్పనిసరి..
  సాయంత్రం చిన్న సైజు లడ్డు, కారం బూంది చిన్నసైజు  ఇస్తారాకులలో.. వేడి వేడి కాఫీ..
 రాత్రి ఎనిమిదింటికే భోజనాలు కార్యక్రమం పూర్తి కావడం...బాగా పొద్దు పోయాక పందిట్లో గురకలు వినిపించేవి..
  లగ్న పత్రికలు  ఇచ్చి పుచ్చుకున్నాక పసుపు కొట్టడం వడియాలు పట్టడం.. పెళ్లి కూతుర్ని చేయడం..
 తాటాకుల పందిరి కింద మధ్య వేసిన  పెళ్లి మండపం లో పెళ్లి వేడుకలు.. మరుసటి రోజు మేజువాణి.. ఓ రోజు నాట్య ప్రదర్శన.. అలా ఐదు రోజులు పెళ్లి సందడి జరిగేది..
 ఇప్పుడు పల్లెటూళ్ళలో ఐదు రోజులు పెళ్లిళ్లు జరగకపోయినా దగ్గర బంధువులు ఎవరి తాహతకు తగ్గట్టుగా వారు సాంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి వేడుకలు జరిపిస్తూనే వున్నారు..
 పట్టణంలో పసుపు కొట్టుకోవడానికి రోలు రోకళ్ళు దొరకవు.. కానీ పెళ్లి సామాగ్రి సప్లై చేసే వారు చిన్న సైజు రోలు రోకలి అపార్ట్మెంట్లకు కూడా సప్లై చేస్తున్నన్నారు.. పసుపు కొట్టడంతో ప్రారంభమై, మరో రోజు మెహందీ.. ఆటపాటల" సంగీత్ "కార్యక్రమం.. ఘనంగా పెళ్లి వేడుకలు.. పట్టణంలో కూడా జరుగుతున్నాయి..
       దగ్గర బంధువులకు తాము ఉండే అపార్ట్మెంట్లో లేదా సొంత ఇంట్లో  రెండు మూడు రోజులు ఉండటానికి సౌకర్యంగా ఉండదని, దగ్గర్లో వున్న హోటల్లో రూముల్లో గాని, హోం స్టే అపార్ట్మెంట్లో గాని వసతి ఏర్పాట్లు చేస్తున్నారు..
 పట్టణంలో పెళ్లికి వచ్చే వాళ్ళు ముహూర్తం సమయం చూసుకొని ఫంక్షన్ హాల్ చేరుకోవడం, క్యూ లో నిలబడి వధూవరులకు ఆశీస్సులు అందజేయడం.. పెళ్లికి అటెండ్ అయినట్టుకు గుర్తుగా ఓ గ్రూప్ ఫోటో దిగటం..ఆ తర్వాత క్షణంలో  డైనింగ్ హాల్ వైపు హడావుడిగా వెళ్లి నచ్చిన నాలుగు ఐటమ్స్ తినేసి కార్ పార్కింగ్ వైపు పాన్ నములుతూ నడవడం.. రోడ్డు మీద నిలబడి ఆటో కోసం ఎదురు చూడటం..
             " లెస్ లగేజ్.. మోర్ కంఫర్ట్!" అన్నట్టు.. పెళ్లిళ్లకు అతి తక్కువగా బంధువులను,స్నేహితులను పిలుచుకొని తక్కువ ఖర్చులో పెళ్లి వేడుకలు చేసుకోవడం ఉత్తమం..
       నూతన వధూవరులిద్దరూ "మేమిద్దరం..మాకు ఇద్దరు.. We are two.. We have two.."  అనుకుంటే  మంచిది గంపెడు సంతానం కనకుండా!.. "We are one.. We have one " అని అనుకుంటే ఇంకా మంచిది!

Alaparti Ramakrishna

No comments:

Post a Comment