Saturday, January 29, 2022

జీవనయాణం.....

జీవనయాణం.....

ఈ లోకంలో ప్రతి మానవుడు సుఖాన్నే కోరుకుంటాడు. ఎంత తెలివి తక్కువ వాడు కూడా దుఃఖాన్ని కోరుకోడు. కోరకపోయినా పూర్వజన్మ కర్మల ఫలితంగా రావలసిన సమయంలో దుఃఖాలు వస్తూనే ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఈ దుఃఖం ఎప్పుడు పోతుందా.. తిరిగి ఎప్పుడు సుఖం వస్తుందా.. అని ఎదురు చూస్తాడు. ఎదురు చూడటమే కాదు. ఆ సుఖంకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. డబ్బు సంపాదిస్తాడు, వస్తువులు తెచ్చుకుంటాడు. ఇతరుల సాయం అర్ధిస్తాడు. అనేక వస్తువులు కనిపెడుతుంటాడు, తన వృత్తిని మారుస్తాడు, వ్యాపారాన్ని మారుస్తాడు, ఉద్యోగాన్ని మారుస్తాడు, ఉన్న ఊరిని మారుస్తాడు, తన దేశాన్ని కూడా వదిలి విదేశాలకెళతాడు, పెద్దవాళ్ళతో స్నేహం చేస్తాడు, శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమిస్తాడు ఇలా ఎన్నో, ఎన్నెన్నో చేస్తాడు.

వీటి ఫలితంగా దుఃఖాలు పోవచ్చు, సుఖాలు రావచ్చు. కాని ఆ సుఖాలు శాశ్వతంగా ఉండటం లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఆ సుఖాలు దూరమై, మళ్ళీ దుఃఖాలు దరిచేరతాయి. అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడ్డా మానవుడు తాను కోరుకున్న సుఖాన్ని, ఆనందాన్ని పొందలేక పోతున్నాడు. ఎందువల్ల..?

తాను కోరుకొనేది శాశ్వత ఆనందమే గాని, తాత్కాలిక ఆనందం కాదు. ఎప్పుడూ ఉండే సుఖం, ఎప్పుడూ ఉండే ఆనందమే కావాలి. అప్పుడే తపన తీరేది, అన్వేషణ ఆగేది...

అట్టి శాశ్వత ఆనందం, నిత్యసుఖం ఎన్ని వస్తువులు సంపాదించినా, ఎందరు వ్యక్తులను దరిచేర్చుకున్నా, ఎన్ని పరిస్ధితులను, స్ధితులను మారుస్తున్నా రావటం లేదు. అనిత్యమైన సుఖమే వస్తున్నది ఎందువల్ల...

మనం కోరుకొనేది నిత్యసుఖాన్ని, కాని పట్టుకొనేది అనిత్య వస్తువులను. అనిత్య వస్తువులు అనిత్యమైన సుఖాన్నే ఇస్తాయిగాని నిత్యసుఖాన్ని ఇవ్వలేవు. నిత్యవస్తువు మాత్రమే నిత్యసుఖాన్నిస్తుంది. మరేమిటి ఆ నిత్యవస్తువు..? "నిత్యవస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వమనిత్యం" నిత్యవస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే. పరమాత్మకన్న వేరైన సమస్తమూ అనిత్యమే అని శంకరాచార్యుల వారు 'తత్త్వబోధ' అనే ప్రకరణ గ్రంధంలో తెలియజేశారు...

ప్రతిమానవుడు నిత్యమైన పరమాత్మను మాత్రమే పట్టుకోవాలి. అలా పట్టుకోవాలంటే అనిత్య వస్తువులు, విషయాలు, భోగాలు మొదలైన వాటి పట్టు నుండి విడిపించుకోవాలి. ఈ అనిత్యవస్తువుల పట్టు నుండి విడిపించుకొని శాశ్వతమైన పరమాత్మను ఆశ్రయించి, పరమాత్మతో ఇక్యమై పోవుటకే మనకు ఈ మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మలోనే దీనిని సాధించాలి. అలా సాధిస్తేనే ఈ జన్మసార్ధకం. సాధించ లేనిచో ఈ జన్మ వ్యర్ధం...

మరి ఎలా సాధించటం... ఎలా ప్రాపంచికవిషయ వ్యామోహాన్ని వదలటం... ఎలా పరమాత్మను తెలుసుకొని, ఆశ్రయించి, అందుకోవటం... ఎలా సమస్త దుఃఖాల నుండి శాశ్వతంగా నివృత్తి చెంది అనంతమైన, అఖండమైన, దుఃఖ రహితమైన శాశ్వత ఆనందాన్ని పొందటం... ఈ అన్ని సందేహాలకు ఖచ్చితమైన సమాధానమే "భగవద్గీత"...

|| జై శ్రీమన్నారాయణ ||

🙏🙏🌹🌹🕉️🌹🌹🙏🙏

సేకరణ

No comments:

Post a Comment