Friday, January 28, 2022

అందర్నీ ఆలోచింప చేసే అద్భుత రహస్యం.

అందర్నీ ఆలోచింప చేసే అద్భుత రహస్యం.

ఒక ఆదివారం ఉదయం, ఒక పెద్దమనిషి తన బాల్కనీలో సూర్యరశ్మిని, కాఫీని ఆస్వాదిస్తూ కూర్చున్నాడు. తన సైజు కంటే చాలారెట్లు ఉన్న పెద్ద ఆకుని తీసుకుని బాల్కనీకి ఒకవైపు నుంచి మరో వైపుకు వెళ్తున్న ఒక చిన్న చీమ అతని దృష్టిని ఆకర్షించింది.

ఆ వ్యక్తి గంటకు పైగా దాన్ని గమనిస్తూఉన్నాడు. చీమ తన ప్రయాణంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవడం చూశాడు. అది చాలా సార్లు ఆగిపోయింది, మలుపులు తీసుకుంది, ఆపై దాని గమ్యం వైపు కొనసాగింది.

ఒక సమయంలో ఆ చిన్న చీమ నేలలో ఒక పగులును ఎదుర్కొంది. కొద్దిసేపు ఆగి, పరిస్థితిని విశ్లేషించి, ఆ పగులు పైన ఆ భారీ ఆకును వేసి, ఆ ఆకు మీదుగా నడిచి, అవతలివైపు వెళ్లిన తర్వాత ఆకును తీసుకుని తన ప్రయాణాన్ని కొనసాగించింది.

భగవంతుని సృష్టిలో అతి చిన్నదైన చీమ తెలివికి ఆ పెద్దమనిషి ముగ్ధుడయ్యాడు.

ఈ సంఘటన అతన్ని విస్మయానికి గురిచేసింది, సృష్టి యొక్క అద్భుతం గురించి ఆలోచించేలా చేసింది. సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని చూపించింది. అతని కళ్ల ముందు, ఒక చిన్నజీవి పరిమాణం లేకపోయినా, విశ్లేషించడానికి, ఆలోచించడానికి, పరిశీలించడానికి, అన్వేషించడానికి, కనుగొనడానికి, అడ్డంకులను అధిగమించడానికి మెదడును కలిగి ఉంది.

కొద్దిసేపటి తర్వాత చీమ తన గమ్యస్థానానికి చేరుకోవడం చూశాడు - భూమి లోపల ఉన్న నివాసానికి ప్రవేశ ద్వారం, నేలలో ఉన్న చిన్న రంధ్రం.

ఇప్పుడు ఆ చీమ తన నివాసానికి కష్టపడి, జాగ్రత్తగా తీసుకువచ్చిన అంత పెద్ద ఆకును ఇంత చిన్న రంధ్రంలో నుండి ఎలా తీసుకువెళుతుందా, అని ఆ పెద్దమనిషి అనుకున్నాడు.

చిన్న జీవి ఐన చీమ, చాలా కష్టపడి, గొప్ప నైపుణ్యంతో, దారిలో ఉన్న అన్ని కష్టాలను అధిగమించి తెచ్చిన పెద్ద ఆకును వదిలేసి, ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళింది.

ఆ పెద్దమనిషి చీమ చిన్న రంధ్రంలోకి వెళ్లిన చాలా సేపటి వరకు దాని గురించే ఆలోచిస్తూ, తన జీవితాన్ని కూడా
ఆ చీమ ప్రయాణంతో ముడిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు.

చీమ ఇంత కష్టంతో కూడుకున్న ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ముగింపు గురించి ఆలోచించలేదు, చివరికి వచ్చేసరికి ఆ పెద్ద ఆకు దానికి భారం తప్ప మరేమీ కాలేదు.

ఆ జీవికి తన గమ్యాన్ని చేరుకోవాలంటే దానిని వదిలివేయడం తప్ప వేరే మార్గం లేకపోయింది.

చీమలాంటి ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో మనం కూడా మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, సమస్యలను ఇలాగే ఎదుర్కొంటామా అని ఆలోచించాడు.

ప్రయాణం చివరి భాగంలో, చీమకు ఆకు భారం తప్ప మరేమీ కాదని గ్రహించి, చాలా సులభంగా ఆ ఆకును వదిలేసి ముందుకు సాగింది.

మన ప్రయాణంలో మనం కూడా బోలెడు కోరికలను మోస్తూ వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం అని అనుకున్నాడు.

మన ఆనందం మన కోరికలు తీరడంపై ఆధారపడి ఉంటుంది. కోరికలు నెరవేరనప్పుడు, నిరాశ, కొన్నిసార్లు ఆ కోరికలే భారంగా మారి, మన గమ్యాన్ని చేరుకునే మార్గంలో అడ్డంకులను సృష్టిస్తాయి. వీటన్నిటినీ తేలిగ్గా వదిలేసుకొని చీమలాగా ముందుకు వెళ్లగలమా?

జీవితపు ఉద్దేశ్యం ఏమిటి, మన జీవితం నుండి మనం ఏమి ఆశిస్తున్నాం, ఇలాంటివి మనం అసలు ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా?

అతను తన ఆలోచనలలో లోతుగా మునిగిపోయుండగా, అకస్మాత్తుగా డోర్బెల్ మోగింది. అతను తన కాఫీ కప్పు తీసుకొని లోపలికి వెళ్ళాడు.

బయటికి అంతా మామూలుగా అనిపించినా, లోపల మాత్రం కొత్త ఆలోచనల సుడిగుండం అతనిలో ఎగసింది.

కోరికల నుండి మనల్ని మనం విడిపించుకోనే ఏకైక మార్గం - వాటి నుండి మన దృష్టిని మరల్చి వాస్తవమైన విషయంపై దృష్టి పెట్టడం. ✍️

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment