Thursday, January 27, 2022

(సం)దేహం

(సం)దేహం

దేహానికి సందేహానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. దేహం అంటే శరీరం; సందేహం అంటే సంశయం లేదా అనుమానం. సందేహం అన్నది కలగనేకూడదు. కలిగాక ఒక పట్టాన అది వదిలిపెట్టదు. ఏ పని చేయాలన్నా, దెయ్యంలా పట్టుకుని అడుగు కదపనీయదు. చేస్తే ఏం కొంప మునుగుతుందోనన్న భయం, ఆందోళన, మనిషిని నిర్వీర్యం చేస్తాయి. బుద్ధి మందగించి ఏ పనీ మొదలుపెట్టలేక, జీవితంలో ఏదీ సాధించలేక చతికిలపడతాడు. శారీరకంగా, మానసికంగా కృశించి నశించిపోతాడు.
రణక్షేత్రంలో అర్జునుడికి ఎదురైన సమస్య జీవితమనే కురుక్షేత్రంలో మనిషికి ఎదురుకావడం సహజం. అలాంటి అనిశ్చితిని ధైర్యంగా ఎదుర్కోవాలి. తెగించి రంగంలోకి దూకాలి. మంచైనా, చెడైనా పనిచేశాక గాని తెలియదు. ఫలితాన్నిబట్టి ముందు ముందు ఏది చెయ్యవచ్చో, ఏది చేయకూడదోనన్న జ్ఞానం సంపాదించుకోవాలి.
యుద్ధరంగంలో ఎదురుగా మోహరించిఉన్న బంధువులు, గురువులు, స్నేహితులను చూడగానే అర్జునుడికి మతిపోయింది. శరీరం, ఇంద్రియాలు గతితప్పాయి. గాండీవం చేజారి, రథంపై కూలబడిపోయాడు. ‘నీవు నిమిత్తమాత్రుడివి. లే! వివేకం అనే ఖడ్గంతో నీ మోహపు తెరను ఛేదించు. భ్రాంతిని తొలగించు. లేకపోతే సంశయాత్ముడవై నశిస్తావు’ అని కృష్ణ పరమాత్మ గీతోపదేశం చేశాక, అర్జునుడు గాండీవం పట్టుకుని విజయోత్సాహంతో రంగప్రవేశం చేసి, సింహంలా చెలరేగి, శత్రువుల్ని చెండాడాడు.
అర్జునుడిలో అంతటి మార్పు ఎలా వచ్చింది? తాను నిమిత్తమాత్రుడినని, సూత్రధారి శ్రీకృష్ణుడని, తాను చెండాడవలసినవి శరీరాలేనని, ఆత్మకు చావులేదని ఎరుక కలిగినందువల్లే మహాభారత సంగ్రామం పరిసమాప్తమైంది. ఇంట గెలిచి రచ్చగెలవాలంటే మొదట మన గురించి మనం తెలుసుకోవాలి. అదే జ్ఞానం. నేను శరీరాన్ని కాదు, ఆత్మను; ఈ మేను అసలైన నేను కాదు అన్న తెలివిడి- జ్ఞానోదయపు తొలికోడి మేలుకొలుపు.
దేహం అన్న పదానికి శరీరం, మేను, ఉపాధి మొదలైన పర్యాయపదాలు ఉన్నాయి. వీటన్నింటికీ ఒకే అర్థం వస్తుంది. దేహం దహనమవుతుంది; శరీరం జీర్ణమవుతుంది; నేను మేను కాదని తెలుసుకోవడానికి అవసరమైన ఒక మాధ్యమం ఈ శరీరం. ఈ దేహాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ఉపాధి అంటారు. దేహం-ఆత్మ వేరు. నశించే గుణం ఉన్న ఉపాధి సాయంతో యోగి నాశనం లేని ఆత్మస్థితి (సమాధి) చేరుకుంటాడు. దేహం పంచభూతాల పంచీకృతం. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం- అనే ప్రకృతి సూక్ష్మ భూతాల పంచీకరణంవల్ల ఈ స్థూల శరీరం ఏర్పడుతుంది. తమోగుణం వల్ల శరీరం జ్ఞానేంద్రియాలు (చెవులు, చర్మం, కళ్లు, నాలుక, ముక్కు), పంచభూతాల సత్వగుణం వల్ల వాటి రజోగుణం వల్ల కర్మేంద్రియాలు (నోరు, చేతులు, కాళ్లు, గుదం, గుహ్యం) పనిచేస్తాయి. శరీరానికి, ఇంద్రియాలకు సారథి- మనసు; బుద్ధి. ఈ శరీర రథంలో పయనంచేసేది ఆత్మ. రథికుడి కనుసన్నల్లో సాగే జీవన యాత్ర ఒక రథోత్సవం.
మనిషికి తాను ఈ శరీరాన్ని, ఈ దేహం తనదే అన్న భావన ఉన్నంతవరకు జీవితం ఒక యుద్ధరంగమే. అతడి అంతరంగంలో క్షీరసాగర మథనం కొనసాగుతూనే ఉంటుంది. ‘నేను పుట్టాను, నేను పెరుగుతున్నాను, నేను తరిగిపోతున్నాను, నేను మరణిస్తున్నాను’ అన్న ఈ అయిదు వికారాలు ‘నేనున్నాను’ అన్న అహంభావానికి మొలిచిన వంకర కొమ్మలు. వెరసి వీటిని షడ్వికారాలు అంటారు. ఇదే దేహాత్మ లేక భూతాత్మ భావన. నేను శబ్దాన్ని కాదు, అర్థాన్ని; నేను పదార్థం కాదు యథార్థాన్ని అన్న సదవగాహన కలిగినప్పుడు సందేహం తొలగి, మనిషి సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మతో సమానం అవుతాడు. నేను ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం అప్పుడే దొరుకుతుంది!
- ఉప్పు రాఘవేంద్రరావు

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment