Sunday, January 30, 2022

ఉత్తమ యోగి

 **ఉత్తమ యోగి*


*https://chat.whatsapp.com/Hn9td4orXeXEJWnAtY9TtM*


*https://t.me/joinchat/5gVEZGFAscQ3N2Fl*


*అందరం బావుండాలి అనేది ఒక గొప్ప మంత్రం. అందరూ అంటే ఒక్క మనుషులే కాదు. సర్వజీవులు కూడా.*


*మన ఆలోచనలు మంచిగా ఉంటే మన పనులూ మంచిగా ఉంటాయి. మన భావాలు గొప్పగా ఉంటే మన ఆచరణ దివ్యంగా ఉంటుంది. కోతి, సింహంలా ఉండగలదా? సింహం నరుడిలా మసలగలదా? నరుడికొక్కడికే బుద్ధి ఉంది. మంచి చేసే అవకాశం ఉంది. అందరూ బావుండాలని ఉద్యమించే దమ్ము, దైర్యం ఉంది. లోక కల్యాణం- నరుడి రూపంలో మాత్రమే దైవం చెయ్యగలడు.*


*మనిషి భగవంతుడికి ప్రతిరూపం. భగవంతుడిలో ఉన్నవే మనిషిలో కనిపించాలి. దైవ లక్షణాలు ప్రతి మనిషిలో కనిపించవు. తనలో దైవత్వం ఉందని మనిషి తెలుసుకోవాలి. దాన్ని నిరూపించాలి. అటువంటి సాధకుడే నిజమైన మనిషి అంటారు స్వామి వివేకానంద.*


*మన బాగు కోసం మనం పని చేద్దాం. అదే సమయంలో అందరి మంచినీ కోరుకుందాం. తోటంతా ఆకుపచ్చగా ఉండాలి. పుష్పాలతో, పండ్లతో పరిమళభరితంగా ఉండాలి. అప్పుడు పక్షులు, తుమ్మెదలు వాటికవే వస్తాయి. అంతా బావుంటే అందరూ వస్తారు. ఒక దగ్గరకు చేరతారు. సుఖం-సంతోషం చవి చూస్తారు.*


*ఇతరుల మంచిని కలలోనైనా తలవని మనసుకు ఆరోగ్యం ఉండదు. అనారోగ్యం పోదు. స్వార్థానికి మించిన అస్వస్థత లేదు. ప్రేమే ప్రేమను తెస్తుంది. అందరి సుఖాన్ని కోరుకుంటేనే మనకు నిజమైన సుఖం లభిస్తుంది. హృదయమే హృదయాన్ని తెరుస్తుంది. కలిసి ఉండటంలో, మంచిని కోరుకోవడంలో మాత్రమే నిజమైన ఏకత్వం ఏర్పడుతుంది. ఈ గొప్ప భావన నీరసాన్ని, నిస్సత్తువను, భయాన్ని తొలగిస్తుంది. అందరిలోకి నదిలా ప్రవహించి, సముద్రంగా బతికిన వాళ్లే దివ్యపురుషులుగా మిగిలిపోయారు.*


*దైవ భాష మనకు అర్థం కాదు. ప్రేమ అనే లిపితో అది తయారయింది. మనల్ని గురించి ఆలోచనలు తగ్గాలి. దాదాపుగా మనల్ని మనం మరచిపోయి, అందరి గురించి ఆలోచించాలి. అప్పుడు మన శక్తి మరింత పెరుగుతుంది. హద్దులు చెరిగిపోతాయి. ఆనందం పెల్లుబుకుతుంది.*


*పువ్వులు తీసుకెళ్ళి మనం దేవుడికి పెట్టొచ్చు. మరో నలుగురి చేతికి నాలుగుపువ్వులు ఇచ్చి ఆయనకు పూజ చేయించడం మరింత మెరుగు. అలాగే నాలుగు ఆలోచనలు కలుపుకోవాలి. అందరూ బావుండాలని కోరుకోవడానికి దేవతల్లాంటి పుణ్యపురుషులు కావాలి. అందరూ బావుండాలి అని అందరూ అనరు. కాని అలా అనేవాడు మాత్రం మనిషి కాడు, మహనీయుడే. వేదశాస్త్రాలు మనిషి బాగుకోసమే. మనిషి బాగుండాలంటే అతడి మనసు బావుండాలి. మనసు బావుండాలంటే, అది యోగం అనే చెట్టు మీద కూర్చుని క్షేమం అనే పాటను పాడుతూనే ఉండాలి.*


*పది మంది బాధల గురించి, వాళ్లలో ఒకడిగా మారి బాధపడితే మన బాధను వెంటనే మరచిపోతాం. అది చిన్నదై, కనుమరుగై పోతుంది. అటువంటి అవగాహన రావాలి మనిషికి. ఆ మనిషే విశ్వానికి మిత్రుడు. ప్రకృతికి పుత్రుడు.*


*మన ఇల్లు మనం ఎన్ని అంతస్తులైనా అందంగా కట్టుకోవచ్చు. నిలువ నీడలేని వాళ్లందరికీ ఒక నీడ ఉండాలని కోరుకోవాలి. ఆ పనిలో సహకరించాలి. ఈ విధమైన ఆలోచనా విధానానికి మించిన పూజ, ప్రార్థన లేవని సత్పురుషులు ఏనాడో చెప్పారు.*


*భూమ్మీద జన్మించిన ప్రతి మనిషీ వేదాంతి కానక్కరలేదు. పరోపకారార్థమిదం శరీరం అన్న ఆర్యోక్తిని అర్థం చేసుకొని ముందుకు సాగేవాడే నిజమైన ఆత్మజ్ఞాని. దీనులు, హీనుల దారిలో పూలను చల్లి అక్కున చేర్చుకోలేకపోయినా, ముళ్లను తొలగిస్తే చాలు. అటువంటి వాడికి మించిన యోగి ఉండడు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలియజేసిన ఉత్తమ యోగి అతడే. సందేహం లేదు!*


*https://www.facebook.com/groups/638078683192004*

No comments:

Post a Comment