*🌺🕉మనసు🕉🌺*
*https://chat.whatsapp.com/H4PDHgYJM7nGD0ILJRI20V*
*https://t.me/joinchat/5gVEZGFAscQ3N2Fl*
*మనసొక సత్యపదార్థం దానికి నామరూపాలు లేవు అంటారు స్వామి వివేకానంద. ‘అగోచరమైన శక్తి’ కానీ బాహ్యప్రపంచంతో సంబంధాలు ఏర్పరచుకొని అనుభవాలను గడిస్తుంది’ అంటుంది కేనోపనిషత్తు, సాగర గర్భంలో అంతులేని సంపదలున్నట్లు, మనసుపొరల్లో శక్తి కేంద్రాలు ఉంటాయి. వాటిని జాగృతం చేసే వివేకం, సాధన మనిషికి ఎంతైనా అవసరం. ఆంతరికశక్తుల సాధకుడు ప్రతిభాశాలిగా విరాజిల్లుతాడు. ఆధ్యాత్మిక జగత్తు సూక్ష్మశరీరం, సూక్ష్మరూపయానమంటూ ప్రస్తావిస్తుంది. మనసు ప్రవేశించని చోటు ఉండదు.*
*భూతభవిష్యత్కాలాలను అధ్యయనం చేసుకుంటూ వర్తమానానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటూ అది చక్కని రహదారి ఏర్పరచుకుంటుంది. ఏకాగ్రతతో ఉండే మనసు జ్ఞానార్జనకు మూలం. జ్ఞానం, జీవన ప్రస్తానంలో వెలుగులు నింపుతుంది.*
*విదేహ రాజైన జనకుడు తన సభకు విచ్చేసిన జ్ఞాన సంపన్నుడైన యాజ్ఞవల్క్య మహర్షిని ప్రశ్నిస్తాడు..*
*మానవులకు వెలుగునిచ్చేది ఏదని. చీకట్లో, ఆపదలో, భయవాతావరణంలో ముందుకు నడిపే సాధనం ఏమిటో సెలవివ్వండని అడుగుతాడు. ఈ రెండింటికీ సమాధానం మనసు ఒక్కటే అని సమాధానమిస్తాడు యాజ్ఞవల్క్యుడు.*
*మనసుకు విస్తృతమైన పరిధి ఉందని, సంకుచిత ధోరణితో దాన్ని కుదించక, వికసింపజేసే వివేకం, జీవన సాఫల్యతను ఇస్తుందని మనిషి గ్రహించాలి. మనసు మంచి సలహాదారుగా తన కర్తవ్యం నెరపుతుంది. మనసు ఇంద్రియాలతో సంయోగం చెందినప్పుడు మాత్రమే బాహ్య జగత్తులోని ‘దృశ్యం’ అవగతమవుతుందని పతంజలి యోగశాస్త్రం అంటుంది.*
*సాత్విక లక్షణాలతో గుబాళించే మనసు, సాధకుడిని ఉన్నత స్థితి పొందేలా చేస్తుంది. మానవుడు తననుతాను సంస్కరించుకునే సన్మార్గ ప్రబోధినిగా ఉంటుంది.* *ధ్యాస, ధ్యానమనే ప్రక్రియల సాధన ద్వారా మనసును అమృత కలశంగా చేసుకోవాలని యోగశాస్త్ర నిపుణులంటారు.*
*ఈ ప్రక్రియలు మనసును దారితప్పనీయవు.* *ఉద్రేక,ఉద్వేగాలను నియంత్రిస్తాయి. కోర్కెలపై అదుపు సాధించేలా చేస్తాయి. సమదృష్టి, సమభావన ఉండేలా చేస్తాయి. మనిషిఇక్కడే ఉండి, మనసు ఎక్కడో ఉండే స్థితిని దూరం చేస్తాయి. నిర్మల చిత్తాన్ని ప్రసాదిస్తాయి. శరీరానికి బలం, మనసుకుక స్థిరత్వం నిగ్రహశక్తి వల్లనే ఒనగూడతాయి. మావటి చేతిలోని అంకుశం మదగజాన్ని అదుపు చేస్తుంది. దాన్ని క్రమేపీ సాధు జంతువుగా మారుస్తుంది. ఇష్టం వచ్చినట్లుగా చరించే మనసును నిగ్రహశక్తి అదుపు చేస్తుంది.*
*మధురలో తనను రోజూ పుష్పమాలికలతో పూజించే మాలాకారుడైన సుదాముని ఏం కావాలో కోరుకొమ్మని శ్రీకృష్ణుడు అన్నప్పుడు.. నీ పాదపద్మాలపై నిలిచి ఉండే నిశ్చల మనసును అనుగ్రహించమని, అదే చాలునని కోరతాడతడు. మనసుకు తృప్తి చాలా ముఖ్యం. అసంతృప్తి కార్చిచ్చులా దహించివేస్తుంది. ఈ దీక్ష, దక్షత, ఆత్మీయత, ఆదరణ, కృతజ్ఞత, స్థైర్యం, సాహసం లాంటి సులక్షణాలు మనసుకు పోషకాలు. కరుణ, జాలి, దయ, దాక్షిణ్యంలాంటివి మనసును నవనీతంలా ఉంచుతాయి.*
*మనసు సుక్షేత్రమైన పంటభూమి. ఏ విత్తనాలు నాటితే ఆ పంటను సమృద్ధిగా పొందవచ్చు. కలుపు మొక్కలు పంటను ఎదగనీయవు, వాటిని వీకెయ్యాలి. మానవ బంధాల మాధుర్యవృష్టికి మూలం మనసే. అది జీవిత రథాన్ని నడిపే సారథి. నేటి ఆధునిక సమాజంలో మనుషుల మధ్య అగాధాలు పెరిగిపోవడానికి, భార్య భర్తల మధ్య సఖ్యత లోపించడానికి కారణం ఎదుటివారి మనసులను అర్థం చేసుకోలేకపోవడం. ప్రతికూల ఆలోచనలతో మనోభారాన్ని పెంచుకోవడం, ఎదుటి మనసును చదవడం, అర్దం చేసుకోవడం వివేకంతో కూడిన ప్రజ్ఞాసూచికలు. అద్భుతమైన మనోపరిణతికి అది నిదర్శనం. ఏ ఇద్దరి మనోభావాలూ ఒక్కటిగా ఉండవు. కానీ పరస్పర అభిప్రాయాల గౌరవంతో ఏకోన్ముఖంగా సాగడమే వివేకం.*
*https://www.facebook.com/groups/638078683192004*
No comments:
Post a Comment