Sunday, January 30, 2022

పొగడ్త చెరుకు ముక్క!!

 👉 తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి

https://t.me/teluguvelugu01


_*🎋పొగడ్త చెరుకు ముక్క!!🎋*_

🕉️🌞🌎🏵️🌼🚩


 *పొగడ్త చెరుకు ముక్క లాంటిది. దాన్ని ఆస్వాదించాలి. అంతేగాని ఆసాంతం మింగేయాలనుకొంటే ప్రమాదం. తొలి గెలుపు అంతిమ విజయానికి సోపానం కావాలి. ముఖస్తుతికి లొంగిపోతే కళ్లు బైర్లు కమ్మి, పైకి చేర్చే నిచ్చెన కనిపించదు. ‘నిరంతరం నిన్ను పొగుడుతూ ఉండేవాడు లోలోపల నిన్ను ద్వేషించే శత్రువైనా అయి ఉండాలి. లేదా నీ నాశనం కోరే కపటి అయినా అయి ఉండాలి’ అంటాడు విదురుడు మాయాజూదంలో గెలిచిన దుర్యోధనుడితో. మహాభారతంలో* 


*ముఖస్తుతితో, కపట ప్రేమతో కౌరవుల నాశనానికి కారకుడయ్యాడు శకుని. నిజానికి మహాభారత యుద్ధానికి పరోక్షంగా శ్రీకృష్ణుడికి సహాయపడింది శకునే! అందుకే పార్థసారథికి సౌబల్యుడు (సుబలుడి కొడుకైన శకుని) అంటే ఇష్టం.* 


 *పశ్చాత్తాపాలకు తావులేని శాశ్వతమైన విజయాలు విమర్శలను స్వీకరించేవాడికే లభిస్తాయని అనుభవజ్ఞులు అంటారు. ఎందుకంటే తప్పొప్పులు బేరీజు వేసుకోవడం విమర్శల వల్లే అలవడుతుంది. మనల్ని మరింత ఎదగాలని మనసారా కోరేవారు పొగడ్తల కన్నా నిజమైన విమర్శలతోనే స్ఫూర్తినిస్తారు.*


*కొడుకు విజయాన్ని కోరే తండ్రి అందుకే అతిగా పొగడడు. పొగడ్తలు మనం ఇతరులతో వెర్రిగా పోటీపడటానికి మాత్రమే ప్రోత్సహిస్తాయి. ఎదుటివాడి బలాన్ని గుర్తించలేం. విమర్శలు మనతో మనమే పోటీ పడేలా చేస్తాయి. దీంతో ఎదగడం సులువవుతుంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేంత వివేకం లభిస్తుంది. అప్పుడు మనల్ని పొగిడేవారిని ఇష్టపడకపోవడమే కాక, మనల్ని ఇష్టపడనివారిని సైతం ప్రశంసించగలుగుతాం.* 


 *పొగడ్తల వల్ల దురభిమానం పెరిగి, వినమ్రత తగ్గే ప్రమాదం ఉంది. ప్రమాదం ఎందుకవుతుందంటే మన బలహీనతల్ని మనం గమనించడం మరచిపోతాం. మన ఎదుగుదలకు* 


*తోడ్పడేవారు మన విజయంలో జరిగిన చిన్న పొరపాట్లను సైతం ఎత్తి చూపి ‘అలా చేయకుండా ఉంటే గెలుపు సంపూర్ణమయ్యే’దని అంటారు. మనలోని లోపాల్ని తెలుసుకొంటే నిజమేమిటో, భ్రమలేమిటో ఎరుకలోకి వస్తాయి. పర్యవసానంగా జ్ఞానం పెరుగుతుంది. అప్పుడు కానీ తెలియదు- మనం ఇంకా ఎంత ఎదగాల్సి ఉందో!* 


 *సద్విమర్శలు మనం ఇంకా చేయాల్సిన పనుల గురించి చెబుతాయి. జీవితంలో ఎదుగుతున్నవాణ్ని, ఎదిగే అవకాశాలు ఉన్న వ్యక్తిని పొగడ్తలతో ముంచెత్తరాదని పెద్దలు అంటారు. ఒక గొప్ప విమర్శ మహాత్ముల మార్గంలో నడిపిస్తుంది. అనుచిత పొగడ్త విజయాన్ని నియంత్రిస్తుంది. మనకు ఉన్నది ఒక్క జీవితం మాత్రమే. పొగడ్తలకు, అసూయాపరుల అసత్య ప్రశంసలకు లొంగకపోతేనే- ఈ జీవితాన్ని విజయవంతంగా గడపగలుగుతాం.* 


 *సాధకుణ్ని అభినందించాల్సిందే. అభినందనకు, అనుచిత పొగడ్తకు తేడా ఉంది.* 


*అభినందన మెరుగుపరచుకోవడానికి తోడ్పడుతుంది. ముఖస్తుతి అభివృద్ధికి అడ్డంకి అవుతుంది. కుటిలురు మూర్ఖుల్ని పొగుడుతుంటారు. మూర్ఖులు ఆత్మస్తుతి, పరనిందలో మునిగి ఉంటారు. అనుచిత పొగడ్త సాలెగూడు లాంటిది. దానికి లొంగిపోతే వెలుపలికి రావడం కష్టం. పొగడ్తలు వింటూ వినాశనానికి దారులు వేసుకొంటూ సాగితే- విమర్శల్ని స్వీకరించి బాగుపడే అవకాశాలను కోల్పోతాం. వివేకవంతులు ఆత్మవిమర్శ, పరుల అభినందనలతో ఎదుగుతూ నిత్యవికాసాన్ని పొందుతూ ఉంటారు. ఈ లోకంలో సద్విమర్శ చేస్తూ నిజాన్ని చెప్పడంకంటే కష్టమైన పని లేదు; కుటిలత్వంతో ముఖస్తుతి చేయడంకంటే సులువైంది లేదని కౌటిల్యుడి వ్యాఖ్య...*

 https://chat.whatsapp.com/FzSgSrhbQQN2nbSdhx1hU0

నిరంతరం పక్కనే ఉంటూ పొగిడేవాడు, ఆ పొగడ్తలను వినేవాడు... ఇద్దరినీ ముఖస్తుతి నాశనం చేస్తుంది...🙏

No comments:

Post a Comment