Sunday, November 6, 2022

🌻 "వాసనాక్షయము" 🌻

 🙏🕉🙏                    ....... ఓం నమో భగవతే "శ్రీ"రమణాయ

🌻🌻 "వాసనాక్షయము" 🌻🌻
       🌼🌻🌼🌻🌼🌻🌼
             🌼🌻🕉🌻🌼
                   🌼🌻🌼
                         🌼
"శాస్త్ర జ్ఞానంతో సత్యవస్తువును తెలుసుకున్నప్పటికీ.. నేను ఆ బ్రహ్మమునే అని నిత్యము హృదయంలో ధ్యానిస్తున్నప్పటికీ, జీవితంలో ఆ జ్ఞానం నిలబడటం లేదు. బ్రహ్మముగా వ్యవహరించలేక పోతున్నాం. జీవుడిగానే వ్యవహరిస్తున్నాం. కర్తను, భోక్తను అనే భావిస్తున్నాం. దీనివల్ల జననమరణాలలో ఇరుక్కుంటున్నాం." 

"దీనికి కారణం అనాదియైన బలవత్తరమైన వాసనలే. వాసనా మేఘాలు కప్పటం వల్ల (ప్రాపంచిక విషయాలలో మునిగిపోవటం వల్ల) నా స్వస్వరూపంలో నిలువలేక పోతున్నాను."

"మరి ఈ వాసనలనే మేఘాలను తొలగించుకొనేది ఎట్లా..."

"మనస్సును ప్రయత్నంతో బహిర్దృష్టి నుండి అంతర్దృష్టికి మళ్ళించి స్వస్వరూపంలో కొంతకాలం నివసించి ఈ వాసనలను తొలగించుకోవాలి."

"ఈ వాసనాక్షయమే ముక్తి. అది ఇక్కడే సాధించాలి.. దీని నుండి గ్రహించాల్సిందేమిటి? మనస్సునెప్పుడూ ప్రాపంచిక విషయాల మీదకు పోనివ్వకుండా ఎప్పుడూ ఆత్మ లక్షణాలను విచారించాలి. నేను ఆ బ్రహ్మమునే అని భావించాలి. ఇక్కడ జరుగుతున్న పనులకు కర్త ఈ క్షేత్రమేనని, అలాగే సుఖదుఃఖాది అనుభవాలు పొందుతున్నది మనస్సేనని నిరంతరం భావన చేయాలి. వీలు దొరికినప్పుడల్లా నేనెవరు... అని ప్రశ్నించుకోవాలి. అనాత్మయైన దేహేంద్రియాలపై నేను, నాది అనే భావాలే అధ్యాస, భ్రమ."

"జ్ఞాని అయినవాడు ఈ అధ్యాసను పోగొట్టుకోవాలి. ఎలా...? స్వస్వరూప జ్ఞానంతో, నేను ఆత్మను, బ్రహ్మమును అనే భావనతో, శరీరమనోబుద్ధుల తాదాత్మ్యం వదిలి ఆత్మ తాదాత్మ్యంతో అధ్యాసను అంతం చేయాలి.. వాసనాక్షయం చేసుకొంటేనే ముక్తి అని క్రిందటి శ్లోకంలో చెప్పారు. వాసనలను క్షయం చేసుకొనే ప్రయత్నంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి." 

"అందులో ప్రధానమైన ఆటంకాలు అహంకార మమకారాలే, వాటినెలా తొలగించాలి.. దేహము, ఇంద్రియాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆత్మ - బ్రహ్మము కనిపించదు. కనుక దేహేంద్రియాలతో తాదాత్మ్యం చాలా తేలిక. ఈ తాదాత్మ్యం వల్లనే అహంకార మమకారాలు. నేను, నాది, అనే భావాలు. అసలు ఈ భావాలు ఎలా పుడుతున్నాయి.. దేహాన్ని చూచి నేను అనుకోగానే ఈ దేహానికి సంబంధించిన వానిని నావి అనుకుంటున్నాం. అంటే “నేను” విస్తరించుకోగానే “నావి” అనే భావన కలుగుతున్నది. ఈ శరీర మనోబుద్ధులనే నేను అనుకుంటున్నాను.. అసలు ఇలా అనుకుంటే తప్పేమిటి.."

"ఇలా అనుకుంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం తప్పదు. ఐతే నష్టం ఏమిటి... దుఃఖాలు తప్పవు. మంచిపనులు, పుణ్యకార్యాలు చేసి తప్పించుకోవచ్చు గదా... ఎన్ని తప్పించుకున్నా జన్మదుఃఖం, జరాదుఃఖం, వ్యాధి దుఃఖం, మరణదుఃఖం తప్పవు గదా - మరైతే దుఃఖాలు తప్పేదెలా? జన్మలు లేకుండా పోతేనే. కనుక ఈ (మనోబుద్ధులను) నేనును అంతం చేసుకోవాలి..."
            🌼🌻🌼🌻🌼
                  🌼🕉🌼

No comments:

Post a Comment