ప్రశాంతత
* తాత్వికత *
ఆయన మహాజ్ఞాని. ఆయన వద్దకు ఓ ధనవంతుడు వెళ్లాడు.
‘నాకు ప్రశాంతతే లేదండీ’ అన్నాడు ధనవంతుడు.
‘మీకేమిటి లోపం....బోలెడంత సంపద ఉంది. ఎక్కడికైనా పోవచ్చు. దేన్నయినా కొనుగోలు చేయవచ్చు’ అన్నారు జ్ఞాని.
‘అవన్నీ అలా ఉండనీ స్వామీ! నాకిప్పుడు కావలసింది సంతోషం’ అన్నాడు ధనవంతుడు.
‘అలాగైతే బయలుదేరండి... ఫుట్‌బాల్ మ్యాచ్ చూడ్డానికి పోదాం’ అన్నారు జ్ఞాని.
అదొక పెద్ద మైదానం. క్రీడాకారులు ఎంతో ఉత్సాహంతో ఫుట్‌బాల్ ఆడుతున్నారు. జ్ఞాని, ధనవంతుడు అందరితో కలిసి మ్యాచ్ చూస్తున్నారు.
కాస్సేపు తర్వాత జ్ఞాని ‘ఎంత జోరుగా ఆడుతున్నారో కదూ’ అన్నారు. ధనవంతుడు ‘స్వామీ! ఆ బంతి ఎన్ని దెబ్బలు తింటోందో కదూ’ అన్నాడు.
వెంటనే జ్ఞాని ‘ఆ విషయాన్నెందుకు చూస్తున్నారు’ అని ప్రశ్నించారు.
అప్పుడు ధనవంతుడు, ‘స్వామీ, నా పరిస్థితి కూడా అంతేనండీ... ఓవైపు ఆదాయపు పన్ను శాఖ అధికారులు... మరొకవైపు కార్మికులు.... మధ్యలో ఆస్తిని వాటా వేసివ్వమని పిల్లలు గొడవ చేస్తున్నారు.... ఇలా నాలుగువైపుల నుంచీ రగడ. తన్నులు తింటున్నాను’ మానసికంగా ఏం చేయాలో తెలీక అన్నాడు.
‘సరే, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దులే. పోదాం పదా. మరొక చోటుకి పోదాం’ అన్నారు జ్ఞాని.
ధనవంతుడిని ఓ సంగీత కార్యక్రమానికి తీసుకుపోయారు. అక్కడ వేణునాద కచేరీ సాగుతోంది. ఆ నాదం మనుసుకు హాయిగా ఉంది. కార్యక్రమం ముగిసిన తర్వాత ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు. కారెక్కారు.
జ్ఞాని మొదలుపెట్టారు...
‘ఇప్పుడు చెప్పండి. బంతికీ, వేణువుకు ఏమిటి తేడా’
‘ఈ రెండిరటికీ అవసరం గాలి. బంతి తాను స్వీకరించిన గాలిని తానే దాచుకుంటోంది. బయటకు పోనివ్వడం లేదు. అందుకే అది దెబ్బలు తింటోంది. వేణువు అలా కాదు. ఓవైపు గాలిని స్వీకరిస్తూనే మరోవైపు దానిని విడిచి పెడుతూ మధురమైన నాదంతో వీనులవిందవుతోంది. ఈ క్రమంలో అది మనిషి పెదవులతో బంధాన్ని ఏర్పాటు చేసుకుంటోంది’ అన్నారు జ్ఞాని.
ధనవంతుడు ఆలోచనలో పడ్డాడు. ‘తన సంపదా బంతిలో ఉన్న గాలి లాంటిదే. అది వేణువును వెతుక్కుంటూ పోవలసిన సమయం ఆసన్నమైంది’ అని అర్థం చేసుకున్నాడు.
దీనిని బట్టి అర్థం చేసుకోవలసింది మన వద్ద ఉన్న డబ్బుని మనకోసం ఖర్చు పెడు తున్నప్పుడు ఆనందం, ఇతరుల కోసం ఖర్చు పెడుతున్నప్పుడు ప్రశాంతత లభిస్తుంది.
No comments:
Post a Comment