Saturday, April 8, 2023

శ్రీ రమణీయం - 14🌹 👌విచారణ ద్వారా సహజ ధ్యానం సిద్ధిస్తుంది👌

 [4/7, 08:15] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 14🌹
👌విచారణ ద్వారా సహజ ధ్యానం సిద్ధిస్తుంది👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, 
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

🌈 14. విచారణ ద్వారా సహజ ధ్యానం సిద్ధిస్తుంది🌹

✳️ ఏదోఒక రూపంలో దైవాన్ని ధ్యేయంగా పెట్టుకొని సూటిగా చేసే సాధననే ధ్యానం అని భావిస్తున్నాం. కనిపించే శరీరాన్ని, దాన్ని నడిపించే మనసుని, రెండిటికీ మూలమైన ఆత్మని విశ్లేషిస్తూ సాగే సత్యాన్వేషణనే విచారణ మార్గం అంటాం. ధ్యానం దైవాన్ని నేరుగా అనుభవించేలా చేస్తుందనీ, విచారణలో సత్యంతో పాటు అసత్యాన్ని కూడా ఆలోచిస్తాం కనుక ధ్యానమే మంచిదని ఓ భక్తుడి సంశయం. మనం అనుకొనే రూపాన్ని, నామాన్ని నిరంతరాయంగా స్మరించటం ధ్యానసాధన అయితే, మన ప్రతి ఆలోచనను దివ్యత్వంగా మార్చు కోవటం సహజధ్యానం అవుతుంది.

✳️ *'ధ్యాసే - ధ్యానం'* అన్న జిల్లేళ్లమూడి అమ్మవారి సత్యవచనం ఈ విషయాన్నే ధృవీకరిస్తుంది. ఏ ఆలోచన చేస్తున్నా దానికి మూలం ప్రాణశక్తిగా మనలో ఉన్న చైతన్యమేనని తెలిస్తే ప్రతి ఆలోచన ధ్యానమే అవుతుంది. చిన్న బుడగైనా, పెద్దబుడగైనా ఆ నీటిపై రావలసిందే. అలాగే మన ఆలోచనలన్నీ ఆ చైతన్య కిరణాలే. *శవానికి లేని ఆలోచనా శక్తి మనకి ఉన్నదంటే అందుకు కారణం మనలో ఈశ్వరచైతన్యం ఉండటమే కదా!* మనలో ఆత్మగా అదృశ్యరూపంలో ఉన్న ఈశ్వరుడు నిరంతరంగా ప్రాణశక్తిని గుండెకు అందిస్తున్నంత కాలమే మన జీవితం. మన ఆలోచన మెదడుదే అయినా మనిషి చివరి శ్వాస వరకు చైతన్యం మన గుండెలయతోనే వ్యక్తం అవుతుంది. దైవధ్యానానికి ఆధారమైన ఈ చైతన్యమే మన ప్రతి ఆలోచనకి మూలంగాఉంది. ఇది తెలుసుకోవటమే విచారణా మార్గం.  అందుకే,  ప్రారంభంలో రూపనామాల ధ్యానం అవసరమేనని అదే విచారణకు మార్గమై సహజ ధ్యానాన్ని మనకి ప్రసాదిస్తుందని శ్రీరమణ భగవాన్ సమాధాన మిచ్చారు. 

✳️ మనలోనే ఉండి, చైతన్యంగా వ్యక్తమయ్యే దైవం ఒక్క పిలుపుకే పలికి దర్శనాన్ని, అనుభవాన్ని ఇస్తాడు. అయితే ఆఒక్క పిలుపు ఎలా పిలవాలో, ఎంత ఆర్తితో పిలవాలో, ఎంత భక్తితో పిలవాలో, ఎంత తన్మయత్వంతో పిలవాలో తెలిసే వరకు నామజప సాధన చేస్తూనే ఉండాలి. కోట్ల కొద్ది రామనామ జపం చేసిన త్యాగయ్యకు రాముడు ఒక్క క్షణం దర్శనం ఇవ్వడంలో ఆంతర్యం అదే. 

✳️ నేను సాధన చేస్తున్నాను అన్న ఆలోచన ఉన్నంతవరకు అది ధ్యానానికి జరిగే ప్రయత్నం మాత్రమే అవుతుంది. ఈ జపం, తపం, ధ్యానం అన్నీ నాలో ఈశ్వరశక్తిగా ఉన్న ప్రాణమే చేస్తుందని తెలుసుకోవాలి. అపుడే, "నేనెవరు?” అన్న ప్రశ్న కూడా ఈశ్వర శక్తిదేనని తెలుస్తుంది. దానికి సమాధానం కూడా ఆ చైతన్యం నుండే వచ్చిన రోజునే విచారణ మార్గం సిద్ధిస్తుంది. అది మనోబుద్ధితో వచ్చే సమాధానం కాకూడదు. మన సాధన మనోబుద్ధులను దాటి వెళ్తేగానీ అంతటి పరిపక్వత చెందదు. ఈ సృష్టి అంతటా ఈశ్వరుడు చైతన్యం గానే వ్యక్తం అవుతున్నాడు. ప్రతిజీవిలోనూ, వస్తువులోనూ ఈ చైతన్యశక్తి సమానంగా ఉంది. చీమకైనా, ఏనుగుకైనా అదే చైతన్యశక్తి అవసరం. అణువంత మర్రి గింజ మహావృక్షం అయినట్లే పరమాణువు కన్నా సూక్ష్మమైన ఈశ్వరుని నుండి ఈ బ్రహ్మాండం వ్యక్తం అయింది. ఈ బ్రహ్మాండంలోని ప్రతి అణువులో ఈశ్వరుడే ఉన్నాడని తెలిపేదే ఈశ్వర చైతన్యం. ఏ రూపాన్నైనా నిలిపి ఉంచేది అందులో ఉన్న ఆ చైతన్యమే. ఆ శక్తి పోయిన రోజున ఆ వస్తువు ఇక ఉండదు. రూపాంతరం చెందుతుంది. మనం మనోదేహాల భావనలోకాక ఆ చైతన్య భావనతో ఉన్నరోజు ఈ సృష్టి అంతా మనలో భాగం అవుతుంది. 

✳️ తమలో ఉన్న చైతన్యాన్ని అంతటా దర్శించారు కాబట్టే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని, హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని అదే భావనతో తమలోని ఒక శరీరభాగంలా అవలీలగా ఎత్తగలిగారు. ఆ స్థితికి చేరుకోవటమే ప్రతి జీవుడి గమ్యం. ఉన్నతమైన ఆ స్థితి కోసం జరిగే సాధన సంపూర్ణ శ్రద్ధతో ఉండాలి. ఆత్మానుభవమైనా, దైవ దర్శనమైనా ఇష్టం, ప్రయత్నం లేకుండా రావు. 

✳️ సాధనలో ఆహార వ్యవహార నియమాలు మన శ్రద్ధకు సంకేతాలు. ఆహారనియమాల వల్ల గుణాలు విజృంభించకుండా ఉంటాయి. మంత్రజపం ఆ గుణదోషాలనే తీసేస్తుంది. ఆహారంలో శక్తిని శరీరం తీసుకొంటే, గుణాలను మనసు తీసుకొంటుంది. అందుకే సాధకులకు ఆహార నియమం చాలా అవసరం. నాలుకకి మంట పుట్టించే ‘కారం’ లోపలకు వెళ్లి కోర్కెని, కోపాన్ని మండిస్తుంది. జన్మజన్మలుగా మనలో పోగేసుకున్న వికారాలను పెంపొందించే కారం, ఉప్పు, పులుపు, తీపి, వంటి ఆహారాలను మితంగా తీసుకోవాలి. ప్రతి ఆహారం శరీరానికి ప్రయోజనకారిగానూ, మనసుకి హాని చేయించనిదిగానూ ఉండాలి. చక్కని విరోచనకారిగా ఉపయోగపడే కారం మోతాదు ఎక్కువైతే రజోగుణాన్ని పెంచి సాధనను సాగనివ్వదు. మనం తీసుకొనే ఆహారం ఆలోచనా సరళికి కారణం అయితే, ఆ ఆలోచన కర్మకు మరియు ఆ కర్మఫలానికి కారణం అవుతుంది. మనలోనే ఉండి అనుక్షణం చైతన్యశక్తిగా వ్యక్తం అయ్యే దైవాన్ని తెలుసు కోకుండా చేసేది మన ఆలోచనలే. ఈ ఆలోచనా వికారాలను ఆహారమే పెంచుతుంది కనుక సాధకులకు ఆహార నియమాలు తప్పనిసరి.
[4/7, 08:15] +91 73963 92086: ✳️ మన వ్యవహారాలు కూడా సాధనకు అనుకూలించేలా ఉండాలి. నిరంతర నామస్మరణతో చేసే 'ఉచ్ఛ్వాస - మన అంతఃకరణను శుద్ధిచేస్తే... నిశ్వాసలతో సాగే నామస్మరణ - పరిసరాలను పరిశుద్ధం చేస్తుంది. చెడుభావంతో విడిచేగాలి మనకి తగిలినా మనసు కలుషితం అవుతుంది. అందుకే సినిమాల వంటి సామూహిక ప్రాంతాలు సాధకులకు క్షేమకరం కాదు. *సాధకుడు తన భక్తికి ఫలంగా పుణ్యాన్ని కూడా ఆశించకూడదు. ఎందుకంటే దానధర్మాలు, సత్కార్యములవల్ల వచ్చే పుణ్యం కోసం ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధనను వాడుకోనక్కర్లేదు. ఆధ్యాత్మిక సాధన అంటే అది కేవలం దైవదర్శనం కోసమే కావాలి. అనుసంధానంగా వచ్చే ఫలాల వెంట పరుగులు పెట్టకూడదు.* 

✳️ సాధనలో ఒక స్థాయికి చేరుకొని అనుభూతులు, అనుభవాలు పొందిన వారిని కూడా ఆహార వ్యవహారాలు మళ్ళీకిందికి లాగేస్తాయి. అందుకే మంచి సద్గుణాలు అలవర్చుకుంటూ సాగే సాత్విక సాధనే శాశ్వత ఫలితాన్ని ఇస్తుందని గ్రహించాలి. కలుషిత మనసుతోనూ రజో, తమోగుణాలతోను చేసే సాధన ఇచ్చే ఫలితాలు ఘనంగా కనిపించినా అవి శాశ్వతం కాదు. రావణుడు, హిరణ్యకశిపుడు వంటి రాక్షసులు చేసిన సాధన మానవ మాత్రులకు సాధ్యం కాదు. కానీ అంతఃశుద్ధి లేని కారణంగా అపురూపమైన వరాలు కూడా వారిని రక్షింపలేక పోయాయి. అందుకే భగవద్దర్శనానికి ముందు అంతఃశుద్ధిని సంపాదిస్తే ఆ తర్వాత వచ్చిన ఫలితాలవలన లోకకళ్యాణం అవుతుంది. అవసరాలకు మించిన విలాస జీవితానికి అలవాటు పడి ఆధ్యాత్మిక సాధనలో కూడా అనవసరపు ఆర్భాటాలు స్నానపానాదులు, నిద్రాహారాలు కనీస అవసరాలు, గూడూ, నీడ, వస్త్రాల వంటివి సౌకర్యాలు. అంతవరకు పర్వాలేదు. ఆపైన వచ్చే విలాసం, భోగం, అంతా అంతఃశుద్ధికి అడ్డే అవుతుంది. 

✳️ దైవానికి సమర్పించే ధూపదీప నైవేద్యాలు - మన అవసరాలను దేవునికి నివేదించటమే. అది భక్తితో చేస్తాం కనుక దోషం లేదు. సాధకులుగా మనం ఇవన్నీ గమనించి ముందుకు సాగాలి. పంట పండగానే సరికాదు ఇంటికి వచ్చే వరకు శ్రద్ధ అవసరం. *మనం చేసే సాధన మనని ఏ స్వర్గానికో చేర్చేంతవరకు సరిపోతే ఎలా? దైవంలో మనని మిళితం చేసే స్థాయి వరకు సాధన సాగుతూనే ఉండాలి.* మన మనసుని మనం నిరంతరం గమనిస్తే లోపాలు సవరించుకొనే అవకాశం ఉంటుంది. కడవకి చిల్లు ఎక్కడవుందో తెలిస్తేనే కదా దాన్ని సవరించగలుగుతాం. మనలో హృదయ స్పందనగా నిరంతరం సహజీవనం చేస్తున్న దైవాన్ని దర్శించాలి. మనం చేసే జపధ్యానం మనలో ఉన్న ఆ దైవమే చేస్తుందని తెలిసే వరకు కొనసాగుతూనే ఉండాలి. ఆ తర్వాత అది సహజ సాధన అవుతుంది. 

✳️ సాధన మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. సత్సంగాల ద్వారా లౌకిక విషయాలపై ఉన్న ప్రేమ క్రమేణా దైవం పైకి మళ్లుతుంది. అది సాధనగా రూపు దిద్దుకుంటుంది. మనలో దివ్యత్వానికి ఉపకరణంగా ఉన్న ఈ దేహమే ప్రకృతిభావన చేత దైవదర్శనానికి అడ్డుగా ఉంది. 

✳️ అందుకే జిల్లేళ్లమూడి అమ్మవారు - "దేహమే సందేహం నాన్నా”! అన్నారు. చాలా మందికి దైవం కలలో కనిపించటానికి కారణం అక్కడ దేహభావన ఉండక పోవటమే. మెళకువలోనే దేహాభిమానం పోగొట్టుకొంటే నిరంతరం దైవంతోనే ఉంటాం. భక్తి, భజన, సత్సంగాలు సామూహికం అయినా సాధన మాత్రం ఎవరికి వారిదే.  ఇవన్నీ సాధనకి ఉపకరిస్తాయి. ఒకరినోట్లో చింతపండు మరొకరి నోరూరించగలదు గానీ పులుపు పుట్టించలేదు. అలానే ఇతరుల సాధన మనలో కూడా ఆసక్తిని పెంచగలదే కానీ అనుభవాన్ని ఇవ్వలేదు. అందుకే దైవ సాక్షాత్కారంలో ఎవరి అనుభవం వారిదే. 

🙏 సద్గురు సాన్నిధ్యం మనలో వికారాలను, వాసనలను అడ్డురానివ్వకుండా సాధన సాఫీగా జరిగేలా చేస్తుంది. మనలోని ఈశ్వరుడ్ని తెలుసుకొనేందుకు విచారణ మార్గంతో సహజ ధ్యానాన్ని సాధిస్తే మనం ఏ రూపంలో సాధన చేసినా అందరికీ అనుభవంలోనే ఉన్న దైవానుభూతిని గుర్తించవచ్చు.

  🙏ఓం నమోభగవతే శ్రీరమణాయ🙏

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment