✳️🌹🌹🌹🌹✳️✳️🌻🌻🌻🌻✳️
[4/18, 08:08] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 24🌹
👌మన ఉనికే దైవం👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ,
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️✳️🌻🌻🌻🌻✳️
🌈 24. మన ఉనికే దైవం 🌹
✳️ భగవంతుడి దర్శనంకోసం మనం అనేక రకాల సాధనలు చేస్తున్నాం. ఆ సాధనను మనలోనుండి చేయించేది ఎవరో శోధించడమే ఆత్మశోధన. అందుకు శ్రీరమణభగవాన్ చూపిన అతి సులువైన విధానం *'విచారణ మార్గం'.* ఆత్మ విచారణలో పూజలు వద్దని, జపం ఆపమనీ చెప్పటంలేదు. అంతరంగంలో ఉండి నీతో సాధన చేయించే చైతన్యాన్ని తెలుసుకోమని శ్రీరమణ భగవాన్ చెప్తున్నారు.
✳️ ముంజేతికి ఉన్న కంకణాన్ని చూసుకోవాలంటే అద్దం అవసరం లేదు. అలాగే మనలోనే సత్యవస్తువుగా ఉన్న ఆత్మను తెలుసుకునేందుకు మరో ప్రమాణం అక్కర్లేదు. మనదికాని పరాయి వస్తువును తెలుసుకోవాలంటే దాన్ని మనం చూడటమో, వినటమో, తాకటమో చేయాలి. మనలోనే అంతర్భాగంగా ఉన్నవస్తువుకు దాని ఉనికే అనుభవంగా ఉంటుంది. ఉనికి అంటే కేవలం ఉండటం. కళ్ల ఉనికి చూపుద్వారా తెలిసినట్లే ఆత్మ ఉనికి మనం ఉండటం ద్వారా తెలుస్తుంది.
✳️ మనం ప్రతిదానికి ‘నేను’ అనే పదాన్ని వాడుతుంటాం. అది దేహాన్ని ఉద్దేశించి వాడుతున్నాం. అంటే మనఉనికిని మనం దేహంగానే అనుకుంటున్నాం. లౌకిక జీవనంలో నేను దేహాన్ని అనే పరిధి అవసరమే. కానీ ఈ భావన ఆధ్యాత్మిక సాధనలో మనని మాయలో పెడుతుంది. మనని మనం దేహమని అనుకున్నట్లే దైవం అంటే వేరే ఎక్కడో ఉందని అనుకుంటున్నాం. నేను దేహాన్ని అనే భావన పోవాలంటే మన ధ్యాస దేహంపైనుండి పోవాలి. అప్పుడే మనకి శరీరభావన తెలియకుండా పోతుంది. 'అసలునేను' ఎవరో విచారణా మార్గంలో తెలుసుకుంటే మనం ఏవరో, దైవం ఏమిటో అవగాహనలోకి వస్తుంది. మనలోనే మనసుగా ఉండి శరీరంతో ఈ పనులన్నీ చేయించేది ఎవరో విచారిస్తే మాయ వీడిపోతుంది. సినిమాలు చూసేటప్పుడు, ఆటలు ఆడేటప్పుడు మనందరిలో దేహభావన పోతూనే ఉంది. కానీ అప్పుడు మనం 'నేను' అనే ఉనికిని ఉన్నదే మర్చిపోయి పరధ్యాసలో ఉంటుంది. నిద్రలోకూడా దేహభావన లేకుండా పోతున్నా అక్కడ దేహంతో పాటు ధ్యాసకూడా లేకుండా పోతుంది. అలా కాకుండా దేహంపై ఉన్న ధ్యాసను మనలోని ఉనికి పైకి మరలించే విధానం అవసరం. మనలోనుండి నేనుగా వ్యక్తమౌతున్న చైతన్యంపైకి ధ్యాసను మళ్ళించాలి. అందుకు మంత్రజపం మార్గంగా సహకరిస్తుంది. మంత్రజపంలో దేహభావన పోయి మన ధ్యాస మనసు మూలంలోకి వెళ్తుంది. ప్రతిబింబం చూసుకునేటప్పుడు మనకి అద్దంపై ధ్యాస ఉండదు. అద్దాన్నే చూడాలని అనుకుంటే అందుకు మన ప్రతిబింబం అడ్డమేమీకాదు. ప్రతిబింబంపై ఉంచిన ధ్యాసను అద్దంపైకి తెచ్చుకుంటే సరిపోతుంది. అలాగే ప్రస్తుతం దేహంపై ఉన్న ధ్యాసను చైతన్యంగా ఉన్న అసలు 'నేను ఎవరనే విచారణపైకి మార్చాలి. కేవలం మంత్రజపం చేస్తూపోతే ఆధ్యాత్మికంగా ప్రయోజనం ఉండదు. మనలోనుండి ఆ జపాన్ని చేసేది ఎవరో గమనిస్తేనే సత్యం తెలుస్తుంది. అంటే మనసుకి మూలంగా ఉన్న చైతన్యం తెలుస్తుంది. గమనించడం అంటే మనసు చేసే మంత్రజపాన్ని మనమే వినేంత శ్రద్ధగా చేయడం.
✳️ దైవాన్ని దర్శించాలని సాధన చేస్తున్నాం. అసలు మనం ఎవరో తెలిస్తేనే దైవం అంటే ఏమిటో తెలిసే అవకాశం ఉంది. భగవంతుడి సత్యస్వరూపం మన అనుభవంలోకి వస్తే కోటిపుస్తకాల జ్ఞానం వస్తుంది. శ్రీరమణభగవాన్ దేవుడు ఉన్నాడని, లేడనీ చెప్పలేదు. దైవంగురించి అడిగేవారికి, *“ముందు నిన్ను నువ్వు తెలుసుకో”* అని సూచించారు. భగవాన్ తన శరీరం నుండి పూర్తిగా విడివడి తన స్వస్వరూపం ఏమిటో స్పష్టంగా చూసుకున్నారు. కనుకనే అదే భావనతో జీవితమంతా సహజధ్యానంలో ఉండిపోయారు. వారు అనుభవించిన ఆ దివ్యానుభూతిని మనందరికీ పంచేందుకు అనుసరించాల్సిన విచారణా మార్గాన్ని అతిసులభంగా బోధించారు. ఆలోచనలతో నిండిన మనసు నిజస్వరూపం తెలుసుకోవడమే వారు బోధించిన విచారణ మార్గం.
✳️ ఆత్మదర్శనానికి ప్రత్యేకమైన దివ్యనేత్రాలు ఏవీ ఉండవు. మనం ఈ కళ్ళతో దృశ్యాలను చూస్తున్నామని అనుకుంటున్నాం. కానీ, మనలోనుండి ఈ కళ్ళద్వారా ప్రపంచాన్ని చూసే వస్తువు వేరేఉంది. కేవలం కళ్లే లోకాన్ని చూడగలిగితే శవంకూడా ఆ పని చేయాలి కదా! కానీ మనలో ఉన్నదేదో ఆశవంలోలేదు. అందుకే అది మనలాగా ప్రపంచాన్ని చూడలేకపోతుంది. చూసే ఆ అసలు వస్తువు ఏమిటో తెలిస్తే అదే మన దివ్యక్షేత్రం అని అర్థం అవుతుంది. లోకంవైపుకి తిరిగిఉన్న దృష్టిని నీలోనికి తిప్పుకోవడమే విచారణా మార్గం.
✳️ శరీరం అంతటా చైతన్యం వ్యాపించిఉంది. అది ఒక స్థానంనుండి అన్నింటినీ గ్రహిస్తుంది. దాన్నే హృదయం అంటున్నాం. చైతన్యానికి రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఉనికిగా ఉండటం. రెండోది గ్రహించేదిగా ఉండటం. గ్రహించేశక్తినే మనసు అని అంటాం. నిద్రలో చైతన్యం తన ఉనికిని కోల్పోవడం లేదు. గ్రహింపును విడిచి కేవలం ఉనికిగా ఉంటుంది. మనలో ఉనికిగా ఉన్న చైతన్యం గ్రహింపుగా మారటం తొలి దైవానుగ్రహం. మన కాళ్లు, చేతుల్లో చైతన్యం ఉనికిగా ఉంది. ఆలోచించే శక్తి వాటికిలేదు. మనలో ఆలోచించే భాగంవేరే ఉంది. అన్ని అనుభూతులూ దానివే. అదే నిద్రపోతుంది. అంతేకానీ శరీరం నిద్రపోదు. శరీరం నిద్రపోవడమంటే శవంగా మారటమే.
✳️ దేహభ్రాంతి పోవాలంటే ఇష్టాయిష్టాలు శరీరానికి సంబంధించినవికావని గుర్తించాలి. నదిలోని చల్లని నీళ్ళలోకి దిగినప్పుడు కలిగే అనుభూతి మనసుకే. కాళ్లకి ఉండదు. ఈ విషయాన్ని విచారణలో గ్రహిస్తే మనం ఈ శరీరం కాదని తెలుస్తుంది. ఆ శరీరాన్ని నడిపే మనసు, దాని మూలంలో ఉన్న చైతన్యం మన అసలు స్వరూపమని తెలుస్తుంది. మనలోనే ఉనికిగా ఉన్న దైవాన్ని తెలుసుకోడానికి అనేక పాట్లు పడుతున్నాం. అందుకు కారణం... మన ఉనికిని మనం మర్చిపోవడమే. నాలుక ఉందని తెలియాలంటే రుచులే చూడాలా? రుచి తెలుసుకోడానికి నాలుక కావాలిగానీ నాలుక ఉందని తెలుసుకోడానికి ఏ రుచితో పనిలేదు. మనసుకూడా అంతే. అలోచనలు మనసును ఆవరించి ఉన్నాయేగానీ ఆలోచనలే మనసు యొక్క స్వరూపం కాదు. దానికంటూ ఓ స్వరూపంఉంది. మన ఉనికే దాని స్వరూపం. ముందు మన ఉనికి మనకి తెలిస్తే మనం ఏమిటో, దైవమంటే ఏమిటో తెలుస్తుంది. దైవాన్ని ఫలానా పద్ధతిలో మాత్రమే ప్రత్యేకించి దర్శించాలనుకునే విజ్ఞానం దైవానుభూతిని దూరం చేస్తుంది. మన స్వస్వరూపాన్ని తెలిపేది విచారణ. దానిని ప్రయాసగా భావించే మనసు పూజల పేరుతో ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తుంది. యాంత్రికంగా సాగే పూజలు, జపధ్యానాలు మనసును విచారణ నుండి తప్పిస్తాయి. జపం చేసేది మనసు. ఆ మనసంటే మనలో చైతన్యంగా ఉన్న స్వరూపమే. అది తెలుసుకోవడమే సాధన యొక్క గమ్యం.
✳️ భగవంతుడు మనలోనే ఉన్నాడన్న సత్యాన్ని ఆలోచనలతో ఉరుకులు పెట్టే మనసు పట్టుకోలేదు. అందుకే దైవనామంతో మనసును నింపితే అది నెమ్మదించి మనలోని దైవత్వాన్ని, ఉనికిని తెలుసుకోగలుగుతాం. మనం ఎవరో తెలుసుకోవాలంటే కేవలం జపం చేస్తేచాలదు. ఆ జపం చేసేవాడిని తెలుసుకునే ప్రయత్నం జరగాలి. అంటే మనసు మూలాన్ని తెలుసుకోవాలి. మన ఉనికి మనకి అనుక్షణం తెలుస్తుంది. కానీ మన జ్ఞాపకాలు, గుర్తులు, వాసనలు ఆ అనుభూతిని పొందనివ్వడంలేదు. దైవం అంటే ఇంకా ఏదో ఉందనే భ్రాంతిలో ఉంచుతున్నాయి. ఆ భ్రాంతిపోతే మనఉనికే దైవంగా స్వస్వరూపంగా, చైతన్యంగా అనుభవంలోకి వస్తుంది. నేను ఈ దేహాన్ని అన్న భావనతో దైవాన్ని వెతకటం మనసును ద్వంద్వభావంలో ఉంచుతుంది. దేహానికి, దైవానికి మధ్య అనుసంధానంగా ఉన్న నేను అనే మనసు స్వరూపం తెలిస్తే ఈ ద్వంద్వవైఖరి పోతుంది. మనలోని ఉనికి (అసలు నేను) అటు దైవంగానూ ఇటు దేహంగానూ ఉందని తెలుస్తుంది.
✳️ రోజులో ఓ గంట యాంత్రికంగా దైవస్మరణ పేరుతో గడిపి అదే ఆధ్యాత్మిక జీవనమని అనుకుంటున్నాం. అసలు మన జీవితమే ఆధ్యాత్మికతతో నిండిఉందన్న సత్యం తెలియాలి. అందుకు మనం ప్రతి క్షణం ప్రతికదలిక శ్రద్ధతో నిండి ఉండాలి. మనసుకి శ్రద్ధ అలవడితేతప్ప నిన్ను నీవు తెలుసుకోలేవు. నిత్యజీవితంలోని ప్రతిపనిలోనూ శ్రద్ధగా ఉంటేనే అది మనసుకి అలవాటుగా మారుతుంది. మన నిత్యకర్మల్లో కౌశలం ఉంటే అనుక్షణం ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవించవచ్చు. కౌశలం అంటే మనకి అప్పగించిన ప్రతిపనిని పరిపూర్ణ శ్రద్ధతో చేయటం. అదే ఆధ్యాత్మికజీవనానికి తొలిమెట్టు అవుతుంది. శ్రద్ధతో చేసే పనుల వల్ల అశాంతి ఉండదు. శ్రద్ధతో చేసే ప్రతిపని దైవార్పిత కార్యంగా మారి మనసును శుద్ధిచేస్తుంది. దైవధ్యానం కేవలం పూజల్లోనే కాదు. నిరంతరం జరగాలి. అది శ్రద్ధతో ఉన్న మనసుకే సాధ్యం. ఎక్కడి నుండి తీసిన వస్తువును అక్కడ పెట్టే శ్రద్ధలేని వారికి దైవాన్ని తెలుసుకునే శ్రద్ధ ఎలా వస్తుంది? చాలా మంది మతిమరుపు ఉందనుకుంటారు. అశ్రద్ధనే మనం మతిమరుపు అని అనుకుంటున్నాం. ప్రతి చిన్నపనిలో శ్రద్ధ అలవడితే జీవితమే మధురంగా మారిపోతుంది. మరొకరి వస్తువును ఆశించే లక్షణం తగ్గితే మనసులోని స్వార్థం పోతుంది. నిత్యజీవితంలో తనకు అవసరమైన వస్తువులపైనే శ్రద్దపెట్టలేని మనసు తనపైనా, జపంపైనా ఎలాశ్రద్ధ నిలపగలుగుతుంది. జీవితంలో శాంతి లోపించేది అశ్రద్ధ వల్లనే. ఎవరింటికైనా వెళ్తానన్న సమయంలో వెళ్ళలేకపోవడం కూడా దోషమేనని శ్రీరామకృష్ణ పరమహంస మందలించేవారు. దేవుని పటాలకు, మన ఇంటిగోడలకు బూజు వ్రేలాడుతుంటే నిత్యజీవితంలో మనకి శ్రద్ధ లోపించినట్లే. చదివే పుస్తకానికి అట్ట చినిగినా గుర్తించలేని వారికి ధ్యానానికి అవసరమైన శ్రద్ధలేదని గుర్తు. మనకి లేని శ్రద్ధ మన పిల్లలకు నేర్పాలని చూడటం వివేకంకాదు. విచారణా మార్గంలో నిన్ను నీవు తెలుసుకోవడమంటే మన మనసుకి గమనించే శ్రద్ధను అలవాటు చేయటమే. చీకటిలో ఉన్న వస్తువును వెతకాలంటే టార్చిలైట్ ఎలా అవసరమో దైవాన్ని తెలుసుకోడానికి నిన్ను తెలుసుకోవడం అంత అవసరం. నీ స్వరూపం నీకు తెలియకుండా నువ్వు కోరుకునే దైవస్వరూపం ఎలా తెలుస్తుంది. నీ స్వస్వరూప జ్ఞానమే దైవాన్ని వెతికే టార్చిలైట్గా ఉపకరిస్తుందని ఆత్మవిచారణ మార్గం బోధిస్తుంది.
సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️✳️🌻🌻🌻🌻✳️
No comments:
Post a Comment