దశమహావిద్యలు.........!!
విద్య అంటే సరైన జ్ఞానం మన చుట్టూ ఉన్న మాయను పటాపంచులు చేసి సత్యాన్ని చూడగల శక్తినిచ్చేది మహా విద్య.జ్ఞాన స్వరూపిని ఆయన శక్తి ధరించిన పదిరూపాలే దశ మహావిద్యలు.
తంత్ర శాస్త్రంలో శక్తి ఉపాసనను విద్య అంటారు తొడల తంత్రంలో దశమహావిద్యల సాధన ఉంటుంది..
అజ్ఞానం పాపానికి కారణమోతుంది. పాపం దుఃఖానికి కారణం.జ్ఞానం స్వేచ్ఛనిస్తుంది.పరమానందాన్ని కలిగిస్తుంది.అటువంటి జ్ఞానాన్ని అమ్మవారి పది అవతారాలలో ప్రసాదిస్తుంది.ఆ అవతారాలనే దశ మహా విద్యలన్నారు.జ్ఞానానికి పది అవతారాలు ఎందుకు?మహా విద్య పది రూపాలను ఎందుకు సంతరించుకుంది?
ఈ దశ మహా విద్యల తత్వాన్ని చూస్తే, అవి ఇలా సూచిస్తాయి.
కాళీ, చిన్నమస్త - కాల పరిణామం
తార, మాతంగి - వాక్కు, వ్యక్తావ్యక్తం
త్రిపుర సుందరి, కమల - ఆనందం, సౌందర్యం
భువనేశ్వరి, ధూమావతి - అంతరాళం, అతీత పరబ్రహ్మ శక్తి
భైరవి, బగళాముఖి - శక్తి, గతి, స్థితి
1.కాళీ రూపాంతరం - కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.
2.తారా రూపాంతరం - దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.
3.సుందరీ రూపాంతరం - అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.
4.భువనేశ్వరీ రూపాంతరం - దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.
5.భైరవీ రూపాంతరం - దశమహావిద్యలలో 5వ మహా విద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి. ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పారాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.
6.ప్రచండ చండికా రూపాంతరం -దశ మహావిద్యలలో 6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీసిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది.
7.ధూమావతీ రూపాంతరం -దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతి దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.
8.బగళాముఖీ రూపాంతరం - పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ జగళాముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.
9.మాతంగీ రూపాంతరం- మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవి కి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.
10.కమలాత్మిక రూపాంతరం - పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తిపొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈదేవికి మార్గశిరే అమావాస్యతిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది.
No comments:
Post a Comment