*సుషుప్తి అవస్థ......!!*
*సుషుప్తి అంటే గాఢ నిద్రయే. మనస్సు మొదలైన 14 ఇంద్రియాలు వాటికి అసలు కారణమైన అజ్ఞానంలో లీనమై పోగా, ఐక్యమై పోగా అవి వాటి వాటి పనులు నిర్వర్తించకుండా "జడం"గా ఉండిపోతాయి*. *అప్పుడు ఏ విషయానుభవమూ ఉండదు. కన్ను చూడటం, చెవి వినటం, ముక్కు వాసనలు చూడటం, నాలుక రుచులు చూడటం, మనస్సు ఆలోచనలు చేయటం ఇలా ఏదీ లేకుండా..*
*ఏమీ తెలుసుకోకుండా ఆనందంగా ఉండేది సుషుప్తి అవస్థ. అందుకే దీనిని 'కిమపిన జానామి, సుఖేన మయానిద్ర అనుభూయత' - నాకేమీ తెలియదు సుఖంగా నిద్రపోయాను అని మాత్రం అనుభవమయ్యే అవస్థ సుషుప్తి అవస్థ అని నిర్వచించారు. ఈ సుషుప్తి అవస్థలో ఉండే జీవుడికి ఒక పేరుంది. అదే ప్రాజ్ఞుడు*.
*ప్రాజ్ఞుడు అంటే రెండు అర్థాలు చెప్పుకోవచ్చు..*.
(i) ప్ర+అజ్ఞ = ప్రాజ్ఞ : అంటే గొప్ప అజ్ఞానం అని. ఈ సుషుప్తిలో ఏమీ తెలియదు. నీవెవరో తెలియదు. ఎక్కడున్నావో తెలియదు, నీ భార్యబిడ్డలు ఎవరో తెలియదు. అసలు నీవున్నావో లేవో తెలియదు. అందుకే గొప్ప అజ్ఞానం అనే అర్థం బాగా సరిపోతుంది.
(ii) ప్రా+జ్ఞ = నిరుపయోగమైన జ్ఞానం అని. జ్ఞానం అనేది బయటి ప్రకృతి నుండి జ్ఞానేంద్రియాల ద్వారా మనస్సుకు చేరుతుంది. తర్వాత బుద్ధికి చేరుతుంది. ఇది జాగ్రదవస్థలో సర్వసాధారణం. అయితే సుషుప్తిలో ఈ జ్ఞానం అనేది మనోబుద్ధుల నుండి, ఇంద్రియాల నుండి ఉపసంహరించబడుతుంది. అంటే అవి జ్ఞానంతో పనిచేయవు. ఏమైందీ జ్ఞానం.. అది మూటగట్టబడి, సీల్ వేసి ఒక మూలన పెట్టినట్లు అవుతుంది. అందువల్ల ఇది నిరుపయోగంగా ఉన్న జ్ఞానం అవుతున్నది. అందుకే ప్రా+జ్ఞ అనేది సరిపోతుంది.
ఇంతకీ ఈ ప్రాజ్ఞుడెవరు? ఆత్మయే - జీవుడే. ఆత్మయా? జీవుడా? ఆత్మయే ఇంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యంలో ఉన్నంత కాలం ఆత్మను జీవుడు అంటారు. ఆ జీవుడే జాగ్రదవస్థలో విశ్వాన్ని చూచే విశ్వుడు. ఆ జీవుడే స్వప్నావస్థలో స్వప్న ప్రపంచాన్ని తెలుసుకుంటున్న తైజసుడు. ఆ జీవుడే సుషుప్తిలో ఏమీ తెలియకుండా ఉన్న ప్రాజ్ఞుడు.
ఈ సుషుప్తిలో జీవుడు ఎక్కడ ఉండి తన కార్యకలాపాలు సాగిస్తాడు.. అంటే హృదయస్థానంలో ఉండి. విత్తనంలో కొమ్మలు, పూలు కనిపించకుండా ఉన్నట్టు సుషుప్తిలో జగత్తు కనిపించకుండా ఉంటుంది.
🙏🏻ఓం నమః శివాయ 🙏🏻
No comments:
Post a Comment