🥀 *మానవ ధర్మం*🥀
✍ కాలిపు వీరభద్రుడు
✍️🌹🌹🌹🙏💐🙏🌹🌹🌹✍️
ధర్మాన్ని ఆచరించే సాధనం శరీరం. ఈ శరీరాన్ని దేహం అనీ అంటారు. మరి ఆత్మ? అది పరమాత్మకు సంబంధించిన అంశం. ఆత్మ అనే రథికుడు శరీరమనే రథానికి దిశను నిర్దేశిస్తాడు. మార్గాన్ని చూపిస్తాడు. లక్ష్యాన్ని తెలియజేస్తాడు. అంటే శరీరం ఏయే పనులు చేయాలో, ఏయే ధర్మాలు పాటించాలో ఆత్మ ప్రబోధిస్తుందన్నమాట.
రథం తనంతట తానుగా ముందుకు పోతుందా? పోలేదు. రధం ముందుకు పోవాలంటే దానికి గుర్రాన్ని పూన్చాలి. ఆ గుర్రాలను ఆధ్యాత్మిక భాషలో ఇంద్రియాలని అంటారు. అవి చిత్తానుసారం రధాన్ని లాక్కొని వెళ్లకుండా వాటిని సరైన దారి (ధర్మ మార్గం)లో నడిపించ గల సమర్ధుడైన సారధి ఉండాలి. ఆ సారథే బుద్ధి. ఈ బుద్ధి - మనసు అనే పగ్గాలను బిగువుగా పట్టుకొని, ఇంద్రియాలనే గుర్రాల్ని అదుపులో ఉంచుతుంది. ఇంద్రియాలనే గుర్రాలు, బుద్ధి అనే సారధి చెప్పినదానికి అనుగుణంగా నడుచుకోవాలంటే మనసు అనే పగ్గాలు తప్పనిసరి అవుతాయి. ఆత్మ అనే రథికుడి ఆధ్వర్యంలో బుద్ధి అనే సారధితో పాటు ఇంద్రియాలనే గుర్రాలూ అదుపులో ఉంటాయి. అప్పుడే శరీరమనే రథం సక్రమంగా ధర్మమార్గంలో పయనిస్తుందని కఠోపనిషత్తు చెబుతోంది.
ఇంద్రియాలను క్రమశిక్షణలో పెట్టుకొన్న దేహి (దేహంగల మానవుడు) శీలవంతుడై (బాహ్య
అంతరంగాల్లో సుగుణాలు కలవాడై) జీవితంలో అభివృద్ధి సాధిస్తాడు.
ఎవరికీ కనిపించకుండా దేహం లోపలే ఉండే ఆత్మ, దేహి చేత ధర్మ కార్యాలను చేయిస్తుంది. మానవుడు ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి? ధర్మాచరణతో మోక్షానందం కలుగుతుంది కాబట్టి. ఈ మోక్షానందం శారీరక సుఖాల వల్ల కలిగే ఆనందం కంటే మహోన్న తమైనది. జీవిత రథాన్ని విషయమార్గంలో నడిపితే బంధమంటారు. దైవమార్గాన నడిపితే మోక్షం లభిస్తుందని భగవద్గీత చెబుతున్నది.
మోక్షానందాన్ని పొందడం యోగులకు సాధ్యమని అంటారు. యోగి ధర్మాన్ని రుషి ధర్మమనీ చెబుతారు. " యోగులు ఉగ్రమైన తపస్సు చేసి ఆత్మానందాన్ని సాధిస్తారు. ఈ ఆత్మానందం మోక్షానందానికి సంబంధించిన మొదటి రూపంగా భావిస్తారు. గృహస్థ ధర్మానికి సంబంధించిన స్త్రీపురుష సహజీవనంలోని రమణీయభావం మోక్షానందంలోని రెండో రూపమన్నది పెద్దల మాట.
అందుకే ఏ వ్య వ్యక్తీ తన ధర్మాన్ని తాను విడిచిపెట్టకూడదు. స్వధర్మాన్ని విడిచి పెట్టడం పాపం అనిపించుకొంటుంది, భయావహం కూడా, అని భగవద్గీత తెలియజెబుతోంది.
దంపతులు గృహస్థధర్మమనే యజ్ఞాన్ని చేస్తూనే ఉండాలి. అహంకారంతో పాటు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను ఆహుతి చేయాలి.
మన ఋషులు, మునీశ్వరులు 'సర్వేజనా స్సుఖినో భవంతు' అంటూ ప్రకృతిలోని సకల జీవరాశి హితాన్ని కోరుతూ అరణ్యాల్లో తపస్సు చేశారు. దంపతులు తమ కుటుంబ క్షేమాన్నే కాకుండా పరహితాన్ని సైతం గృహస్ధధర్మంగా భావించి ఆచరిస్తారు. అందుకే గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించడం, యోగిధర్మం పాటించడంకన్నా కష్టతరమని అంటారు. తామరాకుమీది నీటి బొట్టు తామరాకును ఎలా అంటకుండా ఉంటుందో, అలాగే, గృహస్థులూ వ్యవహరించాలి. గృహస్థ ధర్మాన్ని పాటిస్తూనే నిరాసక్త భావాన్ని కలిగి ఉండాలి. తాము చేసే ప్రతి పని వల్ల లభించే ఫలితాన్నీ భగవంతునికే సమర్పించాలి.
గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ విషయాన్ని గృహస్థు ఆచరించాలి.
శరీరం, ఆత్మ - ఈ రెంటినీ వేర్వేరుగా భావిస్తున్నా, ఒకటి లేనిదే రెండోది ఉండదు. అలాగే దంపతులిద్దరూ ఒకటే, వేరుకాదు. దాంపత్య భావంలో శివపార్వతుల అర్ధనారీశ్వర తత్వం ఇమిడి ఉందని భార్యాభర్తలు గ్రహించాలి. గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించాలి. ఇరుగు పొరుగువారిని స్వజనుల్లా భావించి ఆదరించి ప్రేమించాలి. ఇదే మానవులు ఆచరించదగ్గ ఉత్తమ ధర్మం!
*Courtesy* : *ఈనాడు*
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు*
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు
*సేకరణ:*
No comments:
Post a Comment