వేమన ఒక క్రియాయోగి
ఓం నమో శ్రీ యోగానందగురవేనమః
నేను ఒక క్రియాయోగిని. నా (Kotwa Markandeya Sastry Rtd DIG +919440364947 ) ధ్యాన సమయములో ఒకసారి యోగివేమన గురించి ధ్యానము చేశాను. ఆ సమయములో ఆ మహాయోగిని ఈ విధముగా ప్రశ్నించాను:
నీవు వ్రాసిన పద్యములలో యోగము గురించి ప్రస్థావన ఏమీలేదు, పైగా వినురవేమా, వినురవేమా అని స్వంత డబ్బా కొట్టుకుంటావేమిటి? అని అడిగాను. దానికి ఆ మహాయోగి ఈవిధముగా ఒక్కొక్క పద్యమునకు అంతరార్థము స్ఫురింపచేశాడు. ఆ అంతరార్థమునుబట్టి ఆ మహాయోగి ఒక క్రియాయోగి అని అర్థము అయినది. అందులో మచ్చుకు కొన్ని పద్యములు పొందు పరుస్తున్నాను:
వేమన ఒక క్రియాయోగి 1 - 10
చెప్పులోనరాయి చెవులోన జోరీగ
కంటిలోన నలుసు కాలులోన ముల్లు
ఇంటిలోన పోరు ఇంతింత కాదయా
విశ్వదాభిరామ వినురవేమ 1
వినురవేమా అనగా వేరయిన మనసుతో వినురా అని అర్థము..
వేరయిన మనసు అనగా స్థిరమయిన మనసు అని అర్థము. స్థిరమయిన మనసుతో చెవులోన జోరీగ అనగా గొంతులోని విశుద్ధ చక్రములో ఉపాంశురీతిలో జోరీగమాదిరిగా ఓంకారాన్ని చెప్పు లోనరాయి అనగా మనస్సులో చెప్తూ రాయి.
ఇంటిలోన పోరు ఇంతింత కాదయా అనగా ‘దేహో దేవాలయోప్రోక్తః జీవోదేవః సనాతనః ‘
ఈదేహమే ఒక ఇల్లు. ఆ ఇంటిలోని పోరు అనగా ఇంద్రియములపోరు. ఇంద్రియములు అనగా కన్ను సినిమా చూద్దామని, నోరు నానా గడ్డి తిందామని వగయిరా, అనుకుంటూ ఉంటాయి. కనుక ఓంకారాన్ని మనస్సులో చెప్తూ రాసుకుంటూఉంటే, అప్పుడు కంటిలోన నలుసు అనగా లోపల ఉన్న అజ్ఞానాన్ని కంటావు. ఓంకారాన్ని మనస్సులో చెప్తూ రాసుకుంటూఉన్నావు కాబట్టి కాలులోన ముల్లు అనగా లోపలి ముల్లుఅనగా అజ్ఞానము కాలిపోతుంది.
తాత్పర్యము ఏమిటంటే, ఓంకారాన్ని మనస్సులో చెప్తూ రాసు కుంటూ ఉంటే, శరీరములోని ఇంద్రియములపోరు బాధతప్పి, మనలోని అజ్ఞానాన్ని కంటాము. అది కాలిపోతుంది.
అంతరంగమందు అభవునుద్దేశించి
నిలిపిచూడచూడనిలుచుగాక
బాహ్యమందు శివుని భావింపనిలుచునా
విశ్వదాభిరామ వినురవేమా 2
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
మెడని నిఠారుగా ఉంచి చూపుడువేలును రెండుకనులమధ్య ఉంచి పాలభాగమునకు ఆనించి కొద్ది కొద్దిగా ఆవేలు కొనని పైకెత్తుతూ చూస్తూ ఉండాలి. ఆ కొన కనబడుట ఆగినచోట దృష్టిని నిలుపవలెను. దీనిని కూటస్థములో దృష్టి నిలుపుట అందురు. దీనినే అంతరంగమందు దృష్టి నిలుపుట అనికూడా అంటారు. అనగా అంతర్ముఖమగుట. అంతర్ముఖ దృష్టిని అభ్యాసము చేయగా చేయగా దృష్టి స్థిరమగును. శివుని పొందుకు అనగా పరమాత్మ పొందుకు అంతర్ముఖ దృష్టి అత్యవసరము. ఇది ఒక క్రియాయోగ ప్రక్రియ. పరమాత్మ పొందుకు స్థిర శ్వాస లేక స్థిర మనస్సు అవసరము. *శ్వాసని స్థిరము చేసిన మనస్సు స్థిరమగును. మనస్సు స్థిరము చేసిన, శ్వాస స్థిరమగును*. అనగా ఒకటి స్థిరమయిన రెండవది తనంతటతానె స్థిరమగును. చంచలశ్వాస లేదా చంచలమనస్సు చంచలదృష్టికి లేదా బాహ్యదృష్టికి కారణమగుచున్నది. అనగా కన్ను, ముక్కులాంటి ఇంద్రియవిషయములు బాహ్యమందు సంచరించును. కనుక బాహ్యమందు శివునిభావింప, నిలుచునా అనగా అంతర్ముఖ మవనిది శివునిపొందు సాధ్యమా అని అర్థము. సాధ్యముకాదు.
అడవిదిరుగజిక్కదాకసమునలేదు
అవనితీర్థయాత్రలందులేదు
ఒడలుశుద్ధిచేసిఒడయనిచూడరా
విశ్వదాభిరామ వినురవేమా 3
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
అడవులలో తిరిగినా చిక్కదు పరమాత్మపొందు, ఆకాశములో చిక్కదు, భూమిమీది తీర్థయాత్రా స్థలములందునూ దొరకదు. ఒడయని అనగా పరమాత్మని కేవలము ఒడలు అనగా స్థూల, సూక్ష్మ మరియు కారణ శరీరములు శుద్ధిచేసిన యడల చూడ గలవురా సాధకుడా అని అర్థము.
అదిమిమనసునిలిపిఆనందకేళిలో
బ్రహ్మమయుడుముక్తిబడయగోరు
జిహ్వరుచులచేత జీవుండు చెడునయా
విశ్వదాభిరామ వినురవేమా 4
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
అదిమిమనసునిలిపి అనగా మనసు స్థిరము చేసి బ్రహ్మమయుడు అనగా బ్రహ్మ సాధకుడు, ఆనందకేళిలో అనగా పరమానందప్రాప్తి బడయగోరు అనగా పొందగోరును.. జిహ్వరుచులచేత జీవుండు చెడునయా అనగా నాలుక, చెవి, చర్మము, కన్ను, ముక్కు లాంటి ఇంద్రియసుఖములతో మనిషి ఇంద్రియలోలుడై జననమరణ చక్రములోబడి చెడిపోవును.
మనసు స్థిరము చేసి బ్రహ్మ సాధకుడు, పరమానందప్రాప్తి పొంద గోరును. ఇంద్రియసుఖములతో మనిషి ఇంద్రియలోలుడై జననమరణ చక్రములోబడి చెడిపోవును.
అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయనుండు
సాధనమునపనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమా 5
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
ఏ విధముగా తినగ తినగ వేము తీయగా నుండునో అదేవిధముగా యోగసాధన చేయగా చేయగా శాంతిగా తియ్యగానుండును. అనగననగ రాగ మతిశయిల్లుచునుండు అనగా ఓంకారోచ్ఛారణ చేయగా చేయగా శోబిల్లుతుంది. ఆ ఓంకారోచ్ఛారణ సాధనమున ధరలోని అనగా ఈ భూమి మీది మనిషి చేయవలసిన సాధనా పనులు సమకూరును.
యోగసాధన చేయగా చేయగా శాంతిగా తియ్యగానుండును. ఓంకారోచ్ఛారణ చేయగా చేయగా శోబిల్లుతుంది. ఆ ఓంకారోచ్ఛారణ సాధనమున ఈ భూమిమీదిమనిషి చేయవలసిన సాధనా పనులు సమకూరును.
ఆత్మలోనశివుని అనువుగా శోధించి
నిశ్చలముగ భక్తినిలిపెనేని
సర్వముక్తుడౌను సర్వంబుతానౌను
విశ్వదాభిరామ వినురవేమా 6
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
అంతర్ముఖమై నిశ్చలమైన భక్తితో చక్కగా శోధించి తనలోనే పరమాత్మను సందర్శించవలెను. బ్రహ్మవిద్ బ్రహ్మైవభవతి అనగా బ్రహ్మజ్ఞానము కలిగినవాడే బ్రహ్మ అగును. ఆ విధముగా, చేసిన సాధకుడు అన్నింటినుండి విముక్తిపొంది, సర్వము తానె అగును.
ఆత్మలోని సొమ్ము అంజనమునజూచి
అంటితిరుగునట్టియతడుయోగి
పుంజుగూటినుండిపొద్దెరింగియుకూయు
విశ్వదాభిరామ వినురవేమా 7
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
అంజనము అనగా కూటస్థములోని మూడవకన్ను. ఆజ్ఞాననేత్రము లో కనబడు ఆత్మలోని సొమ్ము అనగా పరమాత్మప్రకాశమును జూచి, దానినే అంటిబెట్టుకొని, కోడిపుంజు పొద్దు తెలిసి వెంటనే కూసిన విధమున, తిరుగునట్టి అనగా ఆస్పందనముతో మమైకమయినట్టి యతడు యోగి.
కూటస్థములోని మూడవకన్నులో కనబడు పరమాత్మప్రకాశమును జూచి, దానినే అంటిబెట్టుకొని, ఆస్పందనముతో మమైకమయినట్టి యతడు యోగి.
ఆలుసుతులుమాయ అన్నదమ్ములుమాయ
తల్లిదండ్రులుమాయ తానుమాయ
తెలియనీదుమాయ దీనిల్లుపాడాయ
విశ్వదాభిరామ వినురవేమా 8
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరాః
అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రతః
అని శాస్త్రములోనున్నది. అదేవిధముగా ఈ పద్యములో యోగి వేమన ఇలా అంటున్నారు.
*మా అనగా కాదు, య అనగా యదార్థం. మాయ అనగా యదార్థం కానిది.*
భార్యాపుత్రులు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, స్వయంగా తాను, తను నివసించే ఇల్లు అనగా ఈ శరీరము అన్నీ యదార్థం కాదు అని తెలియనీయదు ఈ మాయ అనగా పరమాత్ముని స్వప్నము.
ఇహమువిడువఫలముయింపుగగలదని
మహిని బలుకువారిమతముకల్ల
ఇహములోనఫలమునెసగుట కానరో
విశ్వదాభిరామ వినురవేమా 9
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
ఈ లోకములోనిఫలములు ఇక్కడనే విడుచుట మంచిదనే చెప్పే వారి మతము కుదరనిపని. ఇక్కడి మంచిచెడు ఫలములు మన వెంట జన్మజన్మలు పడుతూనే ఉండుననే విషయము గ్రహించు. అదే కర్మసిద్ధాంతము.
ఉన్నఘనతబట్టిమన్నింతురేగాని
పిన్నపెద్దతనములెన్నబోరు
వాసుదేవువిడిచి వసుదేవునెంతురా
విశ్వదాభిరామ వినురవేమా 10
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
నీవు చేసే సాధనా తీవ్రతనుబట్టి, ఘనతనుబట్టి మన్నింతురేగాని, సాధకుడు చిన్నవాడా లేక పెద్దవాడా అని చూడరు ప్రజలు. వాసుదేవుని అనగా శ్రీకృష్ణునికి పూజలు చేయుదురే కాని, పౌండ్రక వసుదేవునికి పూజలు చేయరు కదా.
వేమన ఒక క్రియాయోగి 11 - 20
ఎరుక కన్నను సుఖ మేలోకమునలేదు
యెరుక నెరుగ నెవని కెరుక లేదు
యెరుక సాటి యెరుక యెరుకయే తత్వంబు
విశ్వదాభిరామ వినురవేమా 11
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
పరమాత్మ నాలో ఉన్నాడు అనే పరిపూర్ణమైన జ్ఞానమే ఎరుక. అదియే బ్రహ్మజ్ఞానము. ఆ ఎరుకకన్నను అనగా ఆజ్ఞానముకన్నా ఇతర సుఖము ఏలోకమునను లేదు. అది సాధనద్వారా తెలిసుకొన వలయును. ఆ జ్ఞానము ఎవ్వనికీ లేదు. బ్రహ్మజ్ఞానమునకు సాటి బ్రహ్మజ్ఞానమే. అదే తత్వము.
కట్టెయందు నిప్పుగానని చందాన
తనువునందు నాత్మ తగిలియుండు
మరుగుదెలిపి పిదప మార్కొనవలెనయా
విశ్వదాభిరామ వినురవేమా 12
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
కట్టెయందు మండేగుణము ఉంటుంది, అది కనబడదు. అదేవిధముగా శరీరములోని కూటస్థుడగు ఆత్మ దృగ్గోచరముకాదు. ఆ రహస్యం తెలిసిన పిదప పధ్ధతి మార్చుకొని సాధన చేయవలెను.
కడకనఖిలమునకునడినాళమందున్న
వేగుచుక్కవంటివెలుగుదిక్కు
వెలుగుకన్నదిక్కువేరెవ్వరున్నారు
విశ్వదాభిరామ వినురవేమా 13
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
బ్రహ్మాండమునకు దానిమధ్యనున్న వేగుచుక్క వెలుగువంటి పరమాత్మ ప్రకాశమే ఆధారము. ఆప్రకాశమునకుమించి వేరేదిక్కు లేదు.
చదువు చదువకున్న సౌఖ్యంబులును లేవు
చదువు చదివెనేని సరసుడగును
చదువు మర్మమెరిగి చదివిన చదువురా
విశ్వదాభిరామ వినురవేమా 14
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
విద్య నేర్చుకున్న సంస్కారము, తత్తదుపరి సౌఖ్యము కలుగును. కాని మర్మమెరిగి చదివిన చదువు చదువురా అనగా పరమాత్మ పొందు తెలుపు సా విద్యా ఆధ్యాత్మ విద్యా, ఆధ్యాత్మిక విద్యయే అసలైన విద్య. దానినే మర్మమెరిగి అనగా పరమార్థము తెలిసుకొని చదవటము అని యోగి వేమన తత్వబోధ చేస్తున్నారు.
చిత్తశుద్ధి గల్గి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదువగాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత?
విశ్వదాభిరామ వినురవేమా 15
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
అపిస్వల్పస్య త్రాయతే మహతో భయాత్. అని గీతా వాక్యము. యోగ సాధన కొంచెము చేసిననూ, అది భయంకరమైన సంసార దుఃఖమునుండి పోగొట్టును.
ఆ విధముగా, యోగ సాధన వలన కలిగే చిత్తశుద్ధి కొంచెమైనను, మన భయమును పోగొట్టును. మర్రివృక్షము పెద్దదైననూ దాని విత్తనము చిన్నదేగదా.
జనన మరణములకుతను స్వతంత్రుడుగాడు
మొదట కర్తగాడు తుదను కాడు
నడుమకర్తననుటనగుబాటుకాదొకో
విశ్వదాభిరామ వినురవేమా 16
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
అవ్యక్తాదీనిభూతానివ్యక్తమధ్యానిభారత,
అవ్యక్తనిధనాన్యేవ తత్రకాపరిదేవనా (గీత 2—28),
ప్రాణికోట్లన్నియు పుట్టుకకు పూర్వము కనబడకయు, పుట్టిన పిదప దేహముతోగూడి కనబడచును, మరణించినపిదప మరల కనబడకయు నుండుచున్నవి. పరమాత్మే కర్త. మనిషి కర్త కాదు. ఈపద్యముయొక్క అర్థముకూడా అదే. కనుక తను కర్త అనుకోవటము నగుబాటు.
బ్రతుకులన్నిమాయ భవబంధములుమాయ
తెలివిమాయ తన్నుతెలియమాయ
మాయదెలియువాడె మర్మజ్ఙుడగు యోగి
విశ్వదాభిరామ వినురవేమా 17
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
మా అనగా కాదు, య అనగా యదార్థము, మాయ అనగా యదార్థము కాదు.
బ్రతుకులన్ని యదార్థము కాదు, సంసారబంధములు యదార్థము కాదు, మాయయొక్క తెలివితో తనుయవరో తెలిసికోలేకపోతున్నాడు మనిషి. సాధనద్వారా ఇది యదార్థము కాదు అని తెలుసుకొన్న వాడే అసలైన యోగి.
బ్రహ్మమనగవేరెపరదేశమునలేదు
బ్రహ్మమనగ తానెబట్టబయలు
తన్నుతానెరిగినతానెపోబ్రహ్మంబు
విశ్వదాభిరామ వినురవేమా 18
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
బ్రహ్మము అనగా పరమాత్మ. పరమాత్మ వేరే దేశమున లేక లోకమున లేదు. తనే బ్రహ్మము. తనను తాను తెలిసుకొనిన తనే బ్రహ్మము అగును. భగవాన్ రమణ మహర్షి కూడాను ‘నేను ఎవరిని’ అని తెలిసికోమంటారు.
మనసులోనేపుట్టె మాయసంసారము
మనసు విరిగెనేని మాయతొలగు
మనసునిల్పెనేని మహి తానే బ్రహ్మము
విశ్వదాభిరామ వినురవేమా 19
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
యదార్థము కాని సంసారము మనసులోనే పుడుతుంది. మనసు విరిగితే మాయతొలగుతుంది. సాధనతో మనసుని స్థిరపరచవల యును. అపుడు తానె బ్రహ్మమగును.
మాటలుడగకున్న మంత్రంబు దొరకదు
మంత్రముడగకున్న మదికుదురదు
మనసునిల్పకున్న మరి ముక్తిలేదయా
విశ్వదాభిరామ వినురవేమా 20
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
మన్ త్రాయతే ఇతి మంత్రః అనగా మనస్సును రక్షించేది మంత్రము. ఓంకారోచ్ఛారణ చేసి చేసి ఆగినప్పుడు ఆ నిశ్శబ్దములో మంత్రము (ఓంకారము) వినబడును. ఆ ఓంకారము వినబడుట ఆగినప్పుడు మనస్సు స్థిరమగును. దీనినే కేవల నిశ్శబ్దము అందురు. ఆ నిశ్శబ్దములో స్థిరమయిన మనస్సే శుద్ధ మనస్సు. అప్పుడు ముక్తి లభించును. ఇదంతా క్రియాయోగ ప్రక్రియ.
వేమన ఒక క్రియాయోగి 21 - 30
మాయలోన బుట్టి మాయలోన బెరిగి
మాయ దెలియ లేని మనుజుడేల
మాయ దెలియువాడు మహిమీద ధన్యుండు
విశ్వదాభిరామ వినురవేమా 21
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
మా అనగా కాదు, య అనగా యదార్థము. కావున యదార్థము కానిది మాయ.
యదార్థముకాని మాయలోనేబుట్టి మాయలోన బెరిగినప్పటికీ మను జుడికి ఈ మాయ తెలియుటలేదు. సాధనతోనే మాయ తెలియును. భూమి మీద ఈ మాయ తెలిసినవాడే ధన్యుడు.
రామనామజపముచే మున్ను వాల్మీకి
పాపి బోయడయ్యు బాపడయ్యె
కులము ఘనము గాదు గుణమె ఘనమ్మురా
విశ్వదాభిరామ వినురవేమా 22
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
రామనామజప సాధనచే పూర్వము వాల్మీకి బ్రహ్మజ్ఞానము పొందిన బ్రాహ్మణుడయ్యెను. ఏకులములో జన్మించినా సాధనా గుణముంటే ఘనుడగును.
లోను జూడ జూడ లోకాభిరామంబు
బయలు జూడ జూడ బందనంబు
తన్ను జూడ జూడ తారకబ్రహ్మంబు
విశ్వదాభిరామ వినురవేమా 23
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
అంతర్ముఖమైన మోక్షము, బహిర్ముఖమైన సంసారబందనం, తనను తాను అనగా తన శ్వాసను తాను చూచుకుంటున్నట్లయితే పరమాత్మలో మమైకము. క్రియాయోగ సాధనలో ఇది ఒక ప్రక్రియ.
వేదవిద్యలెల్ల వేశ్యలవంటివి
భ్రమలబెట్టి తేటపడగ నీవు
గుప్తవిద్య యొకటే కులకాంతవంటిది
విశ్వదాభిరామ వినురవేమా 24
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
వేదవిద్యలన్నీ మనుజుడు ఏమి చేయాలి ఏమి చేయకూడదో తెలియని స్థితిని కలగజేసి ఒక్కొక్కప్పుడు తికమక పెడతాయి.
పరమాత్మపొందుకు సరిఅయిన దారి చూపించగలది గుప్తమైన ప్రాణాయామ క్రియాయోగ విద్య మాత్రమె.
వాక్కు వలన గలుగు పరమగుమోక్షంబు
వాక్కు వలన గలుగు వరలు ఘనత
వాక్కు వలన గలుగు నెక్కుడైశ్వర్యముల్
విశ్వదాభిరామ వినురవేమా 25
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
వాక్కు అనగా ఓంకారోచ్ఛారణ. దానివలన ఘనత, ఐశ్వర్యము, మరియు మోక్షము అన్నీ కలుగును.
శిలను ప్రతిమజేసి చీకటింటనుబెట్టి
మొక్కవలదికనుమూఢులార
ఉల్లమందు బ్రహ్మముండుట తెలియుడీ
విశ్వదాభిరామ వినురవేమా 26
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
విగ్రహపూజవలన ఉపయోగము శూన్యము, హృదయములోనే ఉన్న పరమాత్మను యోగ సాధనద్వారా తెలిసికొనవలయును.
ఉప్పుకప్పురంబు ఒక్కటై ఉండు
చూడ చూడ రుచులు జాడ వేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ వినురవేమా 27
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
ఒక శ్వాస మరియు ఒక నిశ్శ్వాస కలిపి హంస అంటారు. ఆరోగ్యకరముగానున్న వ్యక్తి రోజూకి అనగా 24 గంటలలో 21600 హంసలు చేస్తాడు.అనగా నిమిషమునకు 15 హంసలు చేస్తాడు.
అట్లా15 హంసలుచేసే మనిషిని భోగియంటారు. 15 కంటే ఎక్కువ హంసలుచేసే మనిషిని రోగియంటారు. ఇంకా ఎక్కువ హంసలుచేసే మనిషిని పరమరోగియంటారు. 15 కంటే తక్కువ హంసలుచేసే మనిషిని యోగియంటారు. 15 కంటే ఎన్ని తక్కువ హంసలు చేస్తూ వెళితే అంత మహాయోగిగా పరిణితి చెందుతూయుంటాడు.
యోగీ మరియు భోగీ, ఉప్పు కర్పూరముల లాగా ఒక్కటిగానే ఉంటారు చూడటానికి. కాని వారి వారి అభిరుచులు వేరుగా ఉంటాయి. డాక్టర్ చదవితే డాక్టర్ వెంకట్రావ్, లా చదవితే లాయర్ వెంకట్రావ్ లాగా, అలాగే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అనగా బ్రహ్మ జ్ఞానము తెలిసినవాడు బ్రహ్మే అవుతాడు. అలాగే పురుషులందే పుణ్యపురుషులయినయోగులు వేరుగా ఉంటారు.
గంగిగోవుపాలు గంటెడైనను చాలు
కడివెడైననేమి ఖరముపాలు
భక్తికలుగుకూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమా 28
స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
గంగిగోవు అనగా మేరుదండము లేదా వెన్నెముక. యోగికి నిఠారుగా కూర్చొని ధ్యానము చేయుటకు మేరుదండము చాలా అవసరము. పాలు అనగా భాగము.
అహంకారముతో చేసే పూజలకంటే, మేరుదండముతో నిఠారుగా కూర్చొని చేసే ధ్యానము భాగము కొంచెము సమయమయిన చాలు. భక్తికలుగుకూడు అనగా అదే నిజమయిన భక్తి కలుగచేయును.
ఆకుమీదివ్రాత అందరికి తెలియు
చేతిలోనివ్రాతచెప్పవచ్చు
తోలుకిందివ్రాతదొడ్డవాడెరుగును
విశ్వదాభిరామ వినురవేమా 29
ఆకు అనగా కాగితము. ఆధునిక ప్రపంచములో కాగితముమీది వ్రాతను చదువుకున్నవారు అందరూఅర్థము చేసికోవచ్చు. చేతిలోని వ్రాతను హస్తసాముద్రికము నేర్చుకున్నవారుచెప్పవచ్చు. తోలుకింది వ్రాత అనగా బ్రహ్మరాత కేవలము ఆ పరమాత్మకిమాత్రమే తెలుసు.
ఇంద్రియములుబట్టిఈడ్చుచునుండగా
వెర్రిమనుజుడేల వెదకుశివుని
ఇంద్రియములురోసి ఈశునిజూడరా
విశ్వదాభిరామ వినురవేమా 30
ఇంద్రియలోలుడైన వెర్రిమనుజుడు శివుని వెదకలేడు. క్రియాయోగ సాధనతో కలిగిన వైరాగ్యముతో ఇంద్రియవ్యాపారములను అరికట్టి పరమాత్మని పొందవలయును.
వేమన 31- 40
ఇల్లునాలివిడిచి ఇనుపకచ్చలుగట్టి
వంటకంబునీటివాంఛలుడిగి
ఒంటినున్నంత యంత ఒదవునా తత్వంబు
విశ్వదాభిరామ వినురవేమా 31
ఇల్లు, పెళ్ళాంబిడ్డల్ని వదిలి కాలికి ఇనుప చెప్పులు వేసికొని తిరిగినా, నీరు ఆహారములకు దూరమై ఒంటరిగానున్నంతమాత్రాన తత్వ జ్ఞానము అబ్బదు. దానిని క్రియాయోగసాధనతో పొందవలయును.
ఇహమువిడువఫలముయింపుగగలదని
మహినిబలుకువానిమతముకల్ల
ఇహము లోనఫలము నెసగుట గానరో
విశ్వదాభిరామ వినురవేమా 32
మాయలో అనగా సంసారములో ఉంటూ మాయ(సంసారము)ని జయించుట సాధన ద్వారా నేర్చుకొనవలయును. అంతేగాని సాధన చేయకుండా సంసారము వదలినంతమాత్రమున ఫలముండదు.
ఒడలబూదిబూసి జడలుధరించిన
ఒడయడైన ముక్తి బడయలేడు.
తడకబిర్రుబెట్ట తలుపుతో సరి యౌనె
విశ్వదాభిరామ వినురవేమా 33
శరీరమంతా బూడిద బూసికొని జడలు ధరించినతమాత్రాన ముక్తి పొందాడు. తడిక ఎంతగట్టిదైనా తలుపుతో సరిగాదు. యోగసాధన ద్వారానే ముక్తి సాధ్యము.
చిత్తశుద్ధి గల్గి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదువగాదు
విత్తనంబు మర్రివృక్షంబునకునెంత
విశ్వదాభిరామ వినురవేమా 34
అపిస్వల్పస్య త్రాయతే మహతో భయాత్. ఈ యోగసాధన స్వల్పముగా చేసినా మహత్తరమైన సంసార భయమును పోగొడుతుంది అని గీతా వాక్యము. మర్రివిత్తనము చిన్నదే. దానిలోనుండి వచ్చేది అతిపెద్దదైన మర్రివృక్షం. కనుక యోగసాధన వలన చిత్తశుద్ధి కలగును. ఆ పుణ్యము కొంచెమైనను చాలా మంచిది.
జనన మరణములకు తను స్వతంత్రుడుగాడు
మొదట కర్తకాడు తుదనుకాడు
నడమకర్తననుట నగుబాటుకాదొకో
విశ్వదాభిరామ వినురవేమా 35
అవ్యక్తాదీని భూతానివ్యక్తమద్యాని భారత. గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము లోని 28 వ శ్లోకము నకు ప్రతీక. వేమన ఎంతటి మహాయోగియో దీనినిబట్టి అర్థమగుచున్నది. మనిషి పుట్టుకకు పూర్వము కనబడకయు, పుట్టిన పిదప కనబడుచును, మరణించిన పిదప మరల కనబడకయు యున్నవి. అట్టి శరీరము నాది యని శోకించుట అవివేకము.
తోలుకడుపులోన దొడ్డవాడుండంగ
రాతిగుళ్ళనేల రాశిబోయ
రాలుదేవులైన రాశులు మింగవా
విశ్వదాభిరామ వినురవేమా 36
ఇక్కడ విగ్రహపూజని నిరశిస్తున్నారు యోగి వేమన. పరమాత్మ మనలోనే ఉండగా రాతిగుళ్ళచుట్టూ తిరుగుట వ్యర్థము. జడమైన రాళ్ళే దేవుళ్ళైతే ధనరాశులను మింగుతాయి.
బేసికంటివాని పెంపార మదినిల్పి
పూజ సేయవలెను బుద్ధినిల్పి
ఆత్మపూజకంటే అదనంబులేదయా
విశ్వదాభిరామ వినురవేమా 37
రెండు భ్రూమధ్యముల మధ్యనున్న ప్రదేశమును కూటస్థము అంటారు. మెడ నిఠారుగా ఉంచి కూటస్థములో దృష్టిని నిల్పి, బుద్ధినిల్పి, మనస్సు స్థిరం చేసి పూజ అనగా ధ్యానము చేయవలెను.
అప్పుడు తీవ్రమైన లోతైన ధ్యానములో యోగి ఆత్మను కూటస్థములో అద్భుతమైన ప్రకాశముగాను, శుద్ధజ్ఞానముగాను మరియు ఓంకార నాదముగాను అనుభూతి పొందుతాడు. దీనినే మూడవ నేత్రము లేదా శివుని మూడవ లేదా బేసికన్ను అంటారు. ఎన్ని ప్రవచనములు విన్ననూ ఈ అనుభూతిని మనిషి పొందలేడు. కేవలము ధ్యానము ద్వారానే ఈ అనుభూతిని మనిషి పొందగలడు. ధ్యానము ద్వారా పొందిన జ్ఞానమే జ్ఞానము. దీనినే ఆత్మపూజ అంటారు. దీనిని మించినదేదియు లేదు.
బ్రతుకులన్నిమాయ భవబంధములుమాయ
తెలివి మాయ తన్ను తెలియమాయ
మాయ దెలియువాడె మర్మజ్ఞుడగు యోగి
విశ్వదాభిరామ వినురవేమా 38
బ్రతుకులు, సంసారబంధములు, తెలివి, చివరికి తనను తాను తెలియనీయకుండా చేసేది అన్నీ మాయ పనే. క్రియాయోగ సాధనతో ఈ మాయను గ్రహించి దానికి అతీతముగా ఎదిగినవాడే మాయ యొక్క మర్మము తెలిసిన యోగి.
బ్రహ్మమనగ వేరే పరదేశమునలేదు
బ్రహ్మమనగ తానె బట్టబయలు
తన్ను తానెరిగిన తానె పో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినురవేమా 39
బ్రహ్మమనగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అనగా బ్రహ్మజ్ఞానము తెలిసినవాడే బ్రహ్మ కనుక తననుతాను తెలిసికొన్నచో తానె బ్రహ్మము.
మనసులోని ముక్తి మరియొక చోటను
వెదకబోవువాడు వెర్రివాడు
గొర్రెచంకబెట్టి గొల్ల వెదకినట్లు
విశ్వదాభిరామ వినురవేమా 40
మనయేవ మనుష్యాణాం బంధమోక్ష కారణం.
మనస్సే బంధానికిగాని మోక్షానికిగాని కారణం.
మనస్సుని స్థిరము చేసికోవడమే మోక్షము. తనలోనే యున్న మనస్సును స్థిరము చేసికోకుండా గొర్రె చంకలో బెట్టుకొని గొల్లవాడు వెతికిన చందమున మోక్షము ఎక్కడో ఉన్నదనే వెతుకులాట అవివేకం.
వేమన 41 --50
మనసులోనే పుట్టె మాయసంసారము
మనసు విరిగెనేని మాయతొలగు
మనసునిల్పెనేని మహితానే బ్రహ్మము
విశ్వదాభిరామ వినురవేమా 41
సంసారము అనేది చంచలమనస్సు వలన కలుగుతున్నది. క్రియాయోగ సాధనతో మనస్సు స్థిరము అయితే తానే బ్రహ్మము అవుతాడు.
ముక్తిగానలేని మూర్ఖజనులకెల్ల
బట్టబయలుజేసి పరమపదము
దారిజూపుఘనుడుదైవంబుగాదొకో
విశ్వదాభిరామ వినురవేమా 42
గురువు గొప్పతనమును వివరించారు యోగి వేమన ఇక్కడ. సాధకులకి ముక్తికై దారిజూపే ఘనుడే దైవములాంటి గురువు.
రాతిబొమ్మకేల రంగైన వలువలు
గుళ్ళు గోపురములు కుంభములును
కూడుగుడ్డ తానుకోరునా దైవంబు
విశ్వదాభిరామ వినురవేమా 43
ఇక్కడ విగ్రహారాధనను నిరశిస్తున్నారు మహాయోగి. పరమాత్మ సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, మరియు సర్వజ్ఞుడు. అటువంటి పర మాత్మని క్రియాయోగసాధనతో సాధించవలయును. అంతేగాని రాతి బొమ్మలను రంగురంగుల గుడ్డలతో అలంకరించి, గుళ్ళు గోపురము లు కట్టి ఆ రాతి విగ్రహాలకి ఆహారము అర్పించుట అనేది మూర్ఖత్వ ము. అన్నీ తానె అయిన పరమాత్మ కూడుగుడ్డ కోరడు.
వాక్కువలన గలుగు పరమగు మోక్షంబు
వాక్కువలన గలుగువరలుఘనత
వాక్కువలన గలుగునెక్కుడైశ్వర్యముల్
విశ్వదాభిరామ వినురవేమా 44
వాక్ అనగా ఓంకారము. ఓంకారోచ్ఛారణ ఎంత ఉత్తమమైనదో వివరిస్తున్నారు మహాయోగి. ఓంకారోచ్ఛారణవలననే మోక్షం, ఘనత, ఐశ్వర్యములు కలుగును.
శిలను ప్రతిమజేసి చీకటింటనుబెట్టి
మొక్కవలదికను మూఢులార
ఉల్లమందుబ్రహ్మముండుట తెలియుడీ
విశ్వదాభిరామ వినురవేమా 45
విగ్రహారాధనను ఖండిస్తున్నారు మహాయోగి వేమన.
ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి అని గీతావాక్యము. పరమాత్మహృదయములోనే ఉన్నాడు. అట్టి చైతన్యమూర్తిని శిలలలో వెతకటము తెలివిహీనత. రాయిని ప్రతిమగా జేసి చీకటింటనుబెట్టి మొక్కవలదికను మూఢులార.
సకలతీర్థములను సకలయజ్ఞంబుల
తలుగొరిగినంత ఫలము గలదె
తలలుబోడులైన తలపులుబోడులా
విశ్వదాభిరామ వినురవేమా 46
అన్నిపుణ్యక్షేత్రములలోను, యజ్ఞసమయములలోను, పుణ్యఫల సిద్ధికై, మోక్షమునకై, పరమాత్మ తప్ప వేరే ఆలోచనలు రాకుండా ఉండటానికి తలలుగొరిగించుకుంటారు. క్రియాయోగసాధన చేయని యడల తామసికతపోదు, సాత్వికతరాదు, మనస్సు స్థిరమవ్వదు. చంచలమైన ఆలోచనలు పోవు. అంతేగాని, తలలు బోడులైనంత మాత్రమున తలపులుబోడులా అనగా తలలుగొరిగించుకున్నంత మాత్రము చేత తలపులు అనగా ఆలోచనలు రాకుండా ఉంటాయా?
హృదయమందు నున్న ఈశుని దెలియక
శిలలకెల్ల మ్రొక్కు జీవులార
శిలలనేమియుండుజీవులందేకాక
విశ్వదాభిరామ వినురవేమా 47
విగ్రహారాధనను ఖండిస్తున్నారు మహాయోగి. హృదయమందు నున్నపరమాత్మను తెలిసికోక, శిలలకు మ్రొక్కిన ప్రయోజనమేమి? ఏమీలేదు. మనలోనే ఉన్న పరమాత్మను క్రియాయోగ సాధనతో దక్కించుకో వలయును.
అన్నిగోసివేసి అనలంబు చల్లార్చి
గోచిబిడియగట్టిగోపమడచి
ఆస విడిచెనేని అతడె తా యోగిరా
విశ్వదాభిరామ వినురవేమా 48
శరీరమును శుష్కించుకొని, బలవంతముగా ఆకలిని చంపుకొని, కోపమును అణచుకొని ఆశలు వదలిబెట్టినంత మాత్రమున మనిషి యోగి కానేరడు. గీతలో చెప్పినట్లుగా అభ్యాసము వైరాగ్యములతో విషయవాంఛలకు దూరమవ్వ వలయును.
అల్పసుఖములెల్ల నాశించి మనుజుండు
బహుళ దుఃఖములను బాధపడును
పరసుఖంబునొంది బ్రతుకంగనేరడు
విశ్వదాభిరామ వినురవేమా 49
విషయవాంఛలనేవి అల్పసుఖములు. వాటికై వెంపరలాడి దుఃఖము చెందుటకంటే క్రియాయోగాముతో పరమాత్మను పొంది పరసుఖమునొందుట ఉత్తమోత్తమము.
ఆత్మశుద్ధిలేని ఆచారమదియేల
భాండశుద్ధిలేని పాకమేల
చిత్తశుద్ధిలేని శివపూజలేలరా
విశ్వదాభిరామ వినురవేమా 50
శుద్ధమనస్సు శుద్ధ బుద్ధి శుద్ధచిత్తము శివసాన్నిధ్యమునకు దారిచూపును. అదిలేని పూజ మలినపాత్రతో చేయు వంట లాంటిది.
No comments:
Post a Comment