Sunday, April 2, 2023

*** *విషం కంటె విషయం ప్రమాదకరం

 *👌కథాఫలే - 50👌*
🥀 *విషం కంటె విషయం ప్రమాదకరం* 🥀
✍️ శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి వారు.
🙏🌺🌺🌺🌺🔯🌺🌺🌺🌺🙏

విషం తాగితే మానవుడు మరణిస్తాడు. విషం వల్ల శరీరం నశించిపోతుంది. కాని ఇంద్రియ విషయాలగు శబ్దస్పర్శాదులను సేవిస్తే, ఆయా ఇంద్రియార్థాదులందు ప్రవర్తిస్తే, విషయ భోగాలందు తగుల్కొంటే, జీవుడు కర్మలచేబద్ధుడై అనేక జన్మలందు పుట్టుచు, చచ్చుచు నానావిధాలైన యాతనలను అనుభవిస్తూంటాడు.

విషం ఒక్క శరీరాన్ని చంపితే విషయాలు అనేక శరీరాలను చంపుతాయని విజ్ఞులు పేర్కొంటున్నారు. కాబట్టి విషం కంటే విషయాలు మహా ప్రమాదకరాలని వివేకవంతులు నిశ్చయించి వాటి జోలికి పోక, వాటిని ఆశ్రయించక, దృశ్యం వైపు నుండి మరలి, ఆత్మవైపుకు తిరిగి, ఆత్మానుభూతిని పొంది సుఖించాలి.

ఒక్కొక్క ఇంద్రియ విషయానికి లోబడి ఒక్కొక్క జంతువు మృత్యువును కొని తెచ్చుకొనినట్లు మహనీయులు శాస్త్రాల్లో తెలిపినారు.

లేడి, ఏనుగు, మిడుత, చేప, తుమ్మెద అను అయిదు జంతువులు శబ్దస్పర్శాది విషయాలకు లోబడి, ఒక్కొక్క ఇంద్రియానికి వశమై చావును కొనితెచ్చుకొన్నవని పెద్దలు సాదృశ్యం చెపుతున్నారు. ఇక అన్ని విషయాలవైపు పరుగెత్తే మానవుని విషయమై వేరే చెప్పాలా? అని నిలదీసి అడుగుతున్నారు.

కాబట్టి వివేకం గలవారు, ఈ జన్మలోనే తరింపగోరుచున్నవారు విషం జోలికి పోనట్లువిషయాల జోలికి కూడా పోకుండ, అంతర్ముఖులై, ఆత్మవిచారణ చక్కగ గావించి తరించాలి. విషయభోగాల యెడల విరక్తి కలిగియుండాలి. ఇంద్రియాలనే గుఱ్ఱాలను తన అదుపాజ్ఞలలో తప్పక యుంచుకోవాలి.

వివేకమను పగ్గంతో వాటిని నిగ్రహించాలి. పెద్దల సాంగత్యాన్ని అవలంబించి, ఇంద్రియాలను శత్రువులను ఓడించి ఆత్మ సామ్రాజ్యాన్ని బడసి ధన్యులు కావాలి. జీవితంలో ముఖ్యంగ ఆచరించవలసిన పని ఇదియే. వివేకవైరాగ్యముల వలననే మానవునకు పూర్ణశాంతి లభిస్తుంది.

కాబట్టి విజ్ఞుడైనవాడు విషమువలె విషయాలను పరిత్యజించి స్వస్వరూపానుభూతిని బడసి ఆత్మానందు నిమగ్నుడై పరమశాంతిని పొందాలి. ఇదే మానవుని చరమ లక్ష్యం.

*దోషణ తీవ్రే విషయః కృష్ణసర్ప విషాదపి* 
*విషం నిహన్తి భోక్తారం ద్రష్టారం చక్షుషాప్యయమ్*

🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు

*సేకరణ:*
🙏🌺🌺🌺🌺🔯🌺🌺🌺🌺🙏

No comments:

Post a Comment