*జీవిత సార్థకత*
✍️ అజ్ఞాతః
🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
*భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితం ఎలా సార్థకం గావించుకోవాలి???*
💫 సృష్టిలో ప్రతిప్రాణికీ జన్మతోనే భగవంతుడు కొన్ని అమూల్య సంపదలిస్తాడు• వాటిలో మాతాపితలు, దేహం, నివాసప్రదేశం, జీవన కాలం ముఖ్యమైనవి•
💫 అదృష్టవంతులకే మాతాపితల ప్రేమ బహుకాలం దక్కుతుంది, దురదృష్టవంతులు బాల్యంలోనే ప్రథమ సంపదలైన తల్లినో, తండ్రినో లేక ఇద్దరినో పోగొట్టుకుంటారు.•••
💫 అలాగే ఆరోగ్యవంతమైన, అంగవైకల్యం లేని దేహం ఒక సంపద...
💫 సుఖవంతమైన, సురక్షితమైన నివాస ప్రదేశం ఒక సంపద, అన్నింటికంటే విలువైనది ఆయువుగా చెప్పుకొనే జీవితకాలం...
💫 భగవంతుడు సృష్టిని - ఎంతో ప్రేమగా, ఆర్ద్రతతో, అద్భుతమైన సృజనాత్మకశక్తితో సృష్టించిన సంగతి కేవలం రసజ్ఞులే గుర్తించగలుగుతారు, వారిని మలయమారుతం పరవశింపజేస్తుంది. కోయిల కమ్మనిగానం వివశుల్ని చేస్తుంది, నేలతల్లి సింగారించుకున్న పచ్చదనం కనువిందు చేస్తుంది.
అనేక ప్రాణుల కదలికలు మంత్రముగ్ధం చేస్తాయి, ప్రకృతి ఒడి, తల్లి ఒడితో సమానమనిపిస్తుంది.
💫 కన్ను తెరవగానే కనిపించే కమనీయ ఉదయ రేఖల్ని ఎందరు కనురెప్పల్లో దాచుకుంటున్నారు? పచ్చని పసిడి వెలుగులో పారిజాతాల్లా కురిసే అమృత జల్లుల్ని ఎందరు ఆలింగనం చేసుకుంటున్నారు?
💫 మనం ప్రకృతి లోనే బతుకుతున్నాం, కానీ మనసుతో కాదు, శరీరంతో... అందువల్లే, ఆనందం అందరాని అనుభూతిగా ఉంటోంది, మనం వెతుక్కునే చోట ఆనందం కనిపించదు, ఆనందం ఉన్నచోట్లను మనం గుర్తించలేకపోతున్నాం...
💫 *తల్లి ప్రేమలో, తండ్రి ఆలింగనంలో, బిడ్డ నవ్వులో, స్వార్థంలేని భక్తిలో... పాయసంలోని మాధుర్యంలా ఆనందం దాగి ఉంది.*
దాన్ని అనుభూతికి తెచ్చుకోవాలంటే మనకు మనసుతో ఎలా జీవించాలో తెలియాలి.
💫 మనసు మానవుడికి భగవంతుడిచ్చిన భిక్ష, దాని కక్ష్యలో బందీగా కాకుండా బంధువుగా జీవిస్తే, నిత్యమూ ఆనందార్ణవంలో అమృతస్నానమే.
💫 మనసును మందిరం చేసుకుని, మన ఇష్టదైవాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు ప్రతిబంధకాలన్నీ తొలగిపోయి, అదే అంతర్యామి కోవెలగా మారిపోతుంది.
💫 మనసును ప్రాపంచిక ప్రలోభాలు, తద్వారా కలిగే చీకాకులతో నింపివేస్తే శిక్షగా మారి, కక్ష తీర్చుకుంటుంది.
💫 మితిమీరిన వేగంతో వాహనం అదుపుతప్పి ప్రమాదంలో పడినట్లే, మానసిక శక్తిని దుర్వినియోగం చేస్తే అదే మన అశాంతికి కారణమవుతుంది...
💫 మనం ఏది చేసినా, ఏమి చేయాలనుకున్నా మనకున్న ఆయువు సమయంలోనే జరిగిపోవాలి.
✳️ గతించిన కాలం తిరిగి రాదు.
✳️ జీవితకాలం క్షణమైనా పెరగదు.
✳️ అమూల్య సంపద అయిన జీవనకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
✳️ కొందరు పెద్దలిచ్చిన సంపదను దుబారా, దుర్వినియోగం చేసి భ్రష్టులవుతారు.
💫 అలాగే చాలామంది భగవంతుడిచ్చిన సమయ సంపదను చేజార్చుకుంటారు. వ్యసనాలతో, విలాసాలతో సమయం వ్యర్థం చేసుకుంటారు. సోమరులకు సమయ సంపద ఎంత ఘనమైనదో తెలిసే అవకాశమే లేదు.
వారు మనిషి రూపంలోని పశువుల్లా జీవించి, ఆయువు ముగియగానే మరణిస్తారు, చేయడానికి ఏమీ లేదని కొందరంటారు. విశ్రాంత జీవితాన్ని వృథాగా గడిపేస్తుంటారు, అంతకన్నా సమయ దుర్వినియోగం మరొకటి లేదు, ఉండదు.
💫 ఒకప్పుడు గొప్ప హోదా, అధికారం చలాయించాక ఇంకేమీ చెయ్యాల్సింది లేదనుకోకూడదు...
💫 మన శేష జీవిత కాలాన్ని సమాజ సేవలో సద్వినియోగం చేసుకోలేమా? ఆలోచించండి...
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు*
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*
*సేకరణ:*
🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
No comments:
Post a Comment