*కర్మ క్షేత్రం!*
------------------
జీవితం అంటే కత్తుల వంతెన
జీవితం అంటే నిప్పుల నిచ్చెన
నెత్తురోడుతుందని
నిప్పు కాలుతుందని
కూర్చుంటే
నిలువ నీరువై పోతావు
బురద ఏరువై పోతావు
ప్రతీ క్షణం మరో క్షణానికి తరుముతుంది
ప్రతీ కణం కొత్త కణాన్ని
కోరుతుంది
నువ్వేమీ పూలశయ్యపై
పడుకునేందుకు రాలేదు
నువ్వేమీ పాల బువ్వనే
తినేందుకు వీలులేదు
సవాలులో ప్రమాదముంది
సాహసిస్తేనే ప్రమోదమవుతుంది
భీరువుగా కూరుకోకు
భద్రతనే కూరుకోకు
ప్రతీ అడుగు రేపు కొరకు పడనీ
నిన్నలో నిలిచిపోకు
ప్రతీ గొడుగు వాన కొరకు తెరవనీ
చినుకులో తడిచిపోకు
నువ్వు ఒక మట్టిముద్దవు కారాదు
ఎవరు ఎట్లా పడితే అలా మలిచేందుకు
నువ్వు ఒక శస్త్రమల్లే మారి చూపు
నువు కోరుకున్న రీతిలో గెలిచేందుకు
మస్తిష్కం ఓ ఆయుధం
మనస్సు ఒక మర్కటం
ఆలోచనకు పదును పెట్టు
అవివేకాన్ని పాతిపెట్టు
నువ్వేక్కేందుకే ఆ శిఖరం వుంది
నువ్వు గెలిచేందుకే జీవితం వుంది
జీవితం ఓ యుద్ధం
కృష్ణుడెవరు తోడుండరు
జీవితం ఓ కురుక్షేత్రం
గీత నెవరు బోధించరు
నరుడూ నీవే నారాయణుడూ నీవే
మిత్రుడు నీవే శత్రువు నీవే
నీ మార్గం నువ్వు చేసుకోవాలి
నీ సమరం నువ్వే గెలుచుకోవాలి!!
---- _*దండమూడి శ్రీచరణ్*_
9866188266
No comments:
Post a Comment