*✍🏼 నేటి కథ ✍🏼*
*దున్నపోతుల కథ*
మీకు దున్నపోతులు ఎప్పుడూ ఎందుకు పని చేస్తూ ఉంటాయో తెలుసా? అవి బురదలో ఎందుకు పొర్లుతూ ఉంటాయో తెలుసా? ఈ కథ చదవండి తెలుస్తుంది.
*మూలం: వియత్నాం జానపద కధలు*
*స్వేచ్ఛానువాదం: ఆనంద్*
చాలా కాలం క్రితం దున్నపోతులు కూడా అడవిలోనే నివసించేవి. అవి చాలా బద్ధకంగా ఉండేవి, ఇతర జంతువులు తయారుచేసిన దారుల్ని వాడుకుంటూ ఉండేవి. ఇతర జంతువుల గడ్డిని దొంగతనంగా తినేవి, వాళ్ళ నీళ్ళన్నీ త్రాగేసేవి. అయితే అవి నీళ్లు త్రాగేవే కానీ ఎన్నడూ స్నానం మాత్రం చేసేవి కాదు. వాటికి తడవటమంటే అసలు ఇష్టం ఉండేదే కాదు, వానాకాలం వచ్చిందంటే చాలు- వానలో తడవకుండా ఉండటానికని ఎక్కడెక్కడికో వెళ్ళి దాక్కొనేవి. అవి శుభ్రంగా లేకపోయినా, కంపుకొడుతూ ఉన్నా, చూడటానికి మాత్రం చాలా అందంగా ఉండేవి. వాటి కొమ్ములు పొడుగ్గా వంపుతిరిగి ఉండేవి. వాటి శరీరం కూడా సున్నితంగా కండలతో బలిసి ఉండేది. మిగిలిన జంతువులు వీటి బలానికి భయపడి, వీటి కంపు భరించలేక వీటి నుండి దూరంగా ఉండేవి. కానీ ఒకసారి జంతువుల నెలసరి సమావేశంలో ఎవరో దున్నపోతుల గురించి పిర్యాదు చేసారు. అప్పుడు ఆ సమావేశానికి నాయకుడైన ఏనుగు అన్నది, "ఇప్పటికే ఆ జంతువులను చాల రోజులు భరించాము. ఇక చాలు. ఇప్పుడు ఇక ఆ జంతువుల గురించి ఏదైనా చేసే సమయం ఆసన్నమయింది అనుకుంటున్నాను, మీరందరూ ఏమంటారు?" అని. చాల మంది చాలా ఉపాయాలు, అభిప్రాయాలూ చెప్పినా, ఒక దుప్పి చెప్పినదే అన్నింట్లోకి బాగుంది. దుప్పి ఏమి చెప్పిందంటే, "మనలో బలంగా ఉండే పులిగారిని మన ప్రతినిధిగా నియమిద్దాం. పులి వెళ్లి దున్నపోతులకి ’స్నానం చేస్తూ ఉండమని, ఇతరుల తిండి తినకుండా ఉండమని, ఇతరుల నీళ్లు తాగకుండా ఉండమని, అందరూ కలసి చేసే పనుల్లో పాలుపంచుకొమ్మ’నీ చెప్పాలి. అయినా అవి వినక పోతే వాటిని అడవిలోంచి తరిమేద్దాం."
దున్నపోతు "అవును మాకు వినిపిస్తోంది. ఎవరవు నీవు, నీకు ఏంకావాలి?" అని అడిగింది.
"నేను జంతువుల సమావేశం నుంచి ఒక సమాచారంతో వచ్చాను. మీరంతా మాతో కలసి పనిచేస్తూ ఉండాలని, గడ్డి తీసుకురావటం లో మాకు అందరికీ సహాయం చేస్తూ ఉండాలని, ప్రతిరోజూ స్నానం చేస్తూ ఉండాలని మేము అనుకుంటున్నాము. మీరు అలా ఉండకపోతే ఈ అడవిలో ఉండకూడదు" అని చెట్టు మీద ఉన్న పులి అన్నది.
అది విన్న వెంటనే పెద్ద దున్నపోతు వెటకారంగా నవ్వి, "పోరా! మీకు నచ్చక పోతే, మీరే వేరే ఎక్కడికైనా వెళ్ళండి. మేము సామాన్య జంతువులం కాదు, చాలా బలవంతులం. మేము ఏమి చేయాలో మాకు ఎవ్వరూ చెప్పనవసరం లేదు. మాతో ఇంకోసారి పెట్టుకుంటే మిమ్మల్నందరినీ నాశనం చేస్తాం." అని అంది.
పులి సమావేశానికి తిరిగి వచ్చి ఈ విషయం చెప్పింది. జంతువులన్నీ ఈ విషయం గురించి చర్చించటం మొదలు పెట్టాయి. అప్పుడు ఏనుగు నిశ్శబ్దంగా వుండమనటానికి సూచనగా డోలు మోగించి "స్నేహితులారా, మనం ఏమి చేయాలో చెప్పమని దేవుడిని ప్రార్ధిద్దాం" అన్నది. వాళ్లు అందరూ ప్రార్ధన చేశారు. అంతా నిశ్శబ్దంగా వుంది. అప్పుడు ఎక్కడినుంచో ఒక అదృశ్యవాణి వినపడింది: "జంతువులారా! మీరు చేసింది సమంజసమే. దున్నపోతులు చాలకాలం నుండీ తప్పులు చేస్తూ వున్నాయి. అ తప్పుల్ని సరి దిద్దుకునేందుకు కూడా ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు . వాటికి శిక్ష పడాల్సిందే. పులులన్నీ వెళ్లి దున్నపోతుల గుంపుపై దాడి చేయాలి." అని అన్నది.
పులులన్నీ దాడి చేయటానికి బయలుదేరాయి. దున్నపోతుల గుంపు కనిపించగానే ముందే వేసుకున్న పధకం ప్రకారం దాడిని మొదలు పెట్టాయి. ఆ పోరాటంలో ఒక్క పులి కూడా గాయపడలేదు కానీ దున్నపోతుల పరిస్థితి మాత్రం ఘోరంగా అయిపోయింది. వాటి అందమయిన కొమ్ములన్నీ వెనక్కి వంగి పోయాయి. ఒళ్ళంతా గాయాలయ్యాయి. చాలా దున్నపోతులు చచ్చిపోయాయి. చావకుండా బ్రతికి ఉన్న దున్నపోతులన్నీ ఒక ఏరు వద్దకు చేరుకొని, నీళ్ళలో పడుకొని, గాయాలను మాన్పుకున్నాయి. అవి కోలుకునేందుకు కొన్ని రోజులు పట్టింది.
తిరిగి బలం పుంజుకున్న తరువాత, ఏమి చెయ్యాలో నిర్ణయించు కోవటానికి అవి సమావేశమయ్యాయి. ముసలివి, తె లివైన దున్నపోతులన్నీ ’ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే బాగుంటుంది” అని అంటే, కుర్ర దున్నపోతులన్నీ ’ఇక్కడే ఉండి జంతువులతో పోరాడాలి” అన్నాయి. దున్నపోతులన్నీ ఇలా వాదించుకుంటూ ఉంటే, అంతకుముందు ఇతర జంతువులకు వినిపించిన అదృశ్య వాణి వినబడి ఇలా శపించింది: "మీరు చేసిన తప్పులకు మీకు శిక్ష పడింది. కానీ ఇది శిక్షలో ఒక భాగం మాత్రమే. మీ అందానికి గర్వపడినందుకుగాను మీరు వికారంగా తయారగుదురు గాక. శుభ్రంగా లేనందుకుగాను బురదలో పొర్లుతూ ఉందురు గాక. దగ్గరలోని గ్రామాలకు వెళ్లి అక్కడ రైతులతో ఉండి, వాళ్ల పొలాలు దున్నుతూ ఉండిపోదురు గాక!"
అప్పటి నుండి దున్నపోతులన్నీ వికారంగా తయారయ్యాయి. వాటి కొమ్ములు దేనికీ పనికిరాకుండా పోయాయి. అప్పటినుండీ అవి బురదలో పొర్లుతూ, పొలాలు దున్నుతూ ఉండిపోయాయి.
No comments:
Post a Comment