Sunday, August 20, 2023

మొండితనం పట్టుదల ఈ రెండింటికి గల వ్యత్యాసం ఏమిటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం.

 [7/7, 20:23] +91 98491 63616: మొండితనం పట్టుదల ఈ రెండింటికి గల వ్యత్యాసం ఏమిటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం.

✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు

 రాజారావు రమల ముద్దుల  కూతురు సుధ.  ఏడో తరగతి  చదువుతోంది . తల్లిదండ్రుల అతి గారాబం వల్ల మొండిగా తయారయింది. అడిగింది ఇవ్వకపోతే అలక మొదలుపెట్టేది.   ఏడుపుతోనైనా  సాధించుకుంటుంది  తప్ప ఆలోచించదు.  

ఒకసారి వాళ్ళ ఊరుకి  సర్కస్ వచ్చింది. తీసుకెళ్లమని అమ్మానాన్నలని అడిగింది సుధ. ఆఫీసు పని మీదవెళుతున్నానని ,  తరువాత తీసుకెళ్తామని చెప్పాడు వాళ్ళ నాన్న. 
ఏ కళన ఉందో కానీ కొత్త డ్రెస్, బూట్లు కొంటానంటే  ఆగుతానంది సుధ. సరేనన్నాడు సుధ నాన్న. ఆయన తిరిగి వచ్చాక కూడా పనెక్కువై  ఈ  విషయం మరచిపోయాడు. సుధకి  కూడా గుర్తు లేక పోవడం వలన మళ్ళీ అడగలేదు.  

నెలరోజుల తరువాత ఒకసారి   జ్వరంతో బాధపడుతూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంది సుధ. ఆ సాయంత్రం బడి నుండి  విద్య  అనే స్నేహితురాలు వచ్చి సుధని పరామర్శించింది. మాటల మధ్యలో  ‘ఆ రోజే సర్కస్ చూడడానికి చివరి రోజు’ అంది.  

 అంతే। అమ్మానాన్నలని  సర్కస్ చూడడానికి  తీసుకెళ్లమని  అడిగింది సుధ.  జ్వరంతో  ఉన్నప్పుడు  బయట తిరిగితే బలహీనంగా ఉండటం వల్ల ఆనందించలేవని చెప్పారు వాళ్ళు. ఆరోజుతో ఆఖరు కాబట్టి వెంటనే వెళదామని ఏడుపు ప్రారంభించింది సుధ. దాంతో వాళ్ళు సరేనన్నారు. 

సర్కస్ జరుగుతున్న ఆవరణలోనే జెయింట్ వీల్ కూడా ఉంది. సర్కస్ కి సమయం ఉండడంతో జెయింట్ వీల్  ఎక్కుతానంది సుధ.

  “నీరసంగా ఉన్నావు. కళ్ళు తిరుగుతాయి. వద్దని’ చెప్పాడు సుధ  నాన్న.

 ’ నా ఫ్రెండ్  విద్య ఎక్కింది. నేనూ ఎక్కుతాను’ అంది సుధ బింకంగా. తనని ఒప్పించలేక సరేనన్నారు అమ్మానాన్నలు.  
 ఎత్తైన ప్రదేశానికి వెళితే వాంతులవుతాయన్న భయంతో క్రిందనే నిలుచుంది సుధ వాళ్ళమ్మ. 

జెయింట్ వీల్ ఎక్కి నాన్న చెయ్యి పట్టుకుని కూర్చుంది సుధ. కానీ  జెయింట్ వీల్ పైకి వెళ్లేసరికి భయంతో ఆపించమని ఒకటే కేకలు పెట్టింది.  కూతురినే చూస్తున్న  వాళ్ళమ్మ  ఆపరేటరుకి  చెప్పి చక్రాన్ని ఆపించింది.   

ఆ ప్రదర్శనలో ఏమేమి ఉన్నాయో చూస్తూ వెళుతుండగా  ఐస్ క్రీమ్ కొనమని   అడిగింది సుధ.  ‘జ్వరంతో ఉన్నావు. ఇప్పుడు తింటే జలుబు చేస్తుందని’ చెప్పారు కానీ   వినలేదు సుధ. ఏడువు ముఖం పెట్టేసరికి ఐస్ క్రీమ్ కొనిచ్చాడు వాళ్ళ నాన్న. 

‘ఇలా అన్నింటికీ మొండితనం ప్రదర్శిస్తే   కష్టం. వద్దని చెబితే వినాలి . నువ్వు పట్టిన కుందేలుకి  మూడే కాళ్ళు అనకూడదు. నీ మేలుకోరి చెప్పే మా మాటలు   వినాలి” అన్నాడు సుధ  నాన్న. ఊహూ.. వినను … అని అడ్డంగా తలూపింది  సుధ. 

  ఐస్ క్రీమ్ తినేసి బయటకి వస్తుంటే సుధ నాన్న తాలూకా స్నేహితుడు కనిపించాడు. వాళ్ళూ కుటుంబంతో వచ్చారు. ఆయన భార్యను,  కొడుకును సుధ అమ్మకి  పరిచయం చేసాడు. అందరూ కలసి కాసేపు  దగ్గర్లో ఉన్న  బెంచీ మీద కూర్చున్నారు.  
మాటల మధ్యలో వాళ్ళ కొడుకు గురించి చెబుతూ “వీడికీ మధ్య మెడిసిన్ లో  సీటు వచ్చింది” అని చెప్పాడు ఆయన. 

“చాలా సంతోషం. పార్టీ ఇవ్వాల్సిందే” అంటూ అబ్బాయికి అభినందనలు చెప్పారు సుధ అమ్మానాన్న. 

“తొలి ప్రయత్నం కాదు లెండి. మూడో ప్రయత్నంలో వచ్చింది. డాక్టర్ కావాలన్నది వాడి  కల. లాంగ్ టర్మ్ కోచింగు తీసుకుని మొత్తానికి కల నెరవేర్చుకున్నాడు” అన్నాడు ఆయన. 

కుర్రాడికి మరోసారి అభినందనలు చెప్పారు  సుధ అమ్మానాన్న.

వాళ్ళకి ధన్యవాదాలు చెప్పిన తరువాత ఆ కుర్రాడు  “మెడిసిన్లో  సీటు రాకపోతే రెండేళ్లు వృధా అవుతాయని వీళ్ళు  భయపడ్డారు. కానీ కష్టపడి చదివి ర్యాంకు  సాధించాను” అన్నాడు గర్వంగా.   

“నీలో  కూడా మా సుధలాగా మొండితనం ఎక్కువే. అనుకున్నది సాధించావు” అంది సుధ అమ్మ.

  “దాన్ని మొండితనం అనకూడదు. పట్టుదల అనాలి” అని  సరిదిద్దాడు సుధ నాన్న. 

“అనుకున్నదల్లా సాధించుకుంటానని మొండితనం అన్నారు నా విషయంలో.    ఇప్పుడేమో పట్టుదల అంటున్నావు.  రెండింటికీ  తేడా ఏమిటి” అనడిగింది సుధ.

 సుధ నాన్న “ చాలా ఉంది. మొదటిది  స్వార్ధం కోసం, రెండోది  ప్రయోజనం కోసం’ అన్నాడు. 

తల గోక్కుంటూ “సరిగా అర్ధమయ్యేలా చెప్పండి” అంది సుధ. 

“సరే. చిన్న చిన్న కోరికలు తీరకపోతే నిరాశ పడిపోయి  అలగడం, ఏడవడం,  మూర్ఖంగా  ప్రవర్తించడాన్ని మొండితనం అంటారు.  అందులో కేవలం   స్వార్థం ఉంటుంది.  మొండిపట్టు పట్టడం మంచిది కాదు. మొండితనం వలన కొన్నిసార్లు ఎదురుదెబ్బలు, నష్టం కలగొచ్చు.  నీ విషయమే మాట్లాడుదాం. ‘జ్వరంతో ఉన్నావు కాబట్టి బయట తిరగొద్దు, విశ్రాంతి తీసుకో’ అని  చెప్పాం .  జెయింట్ వీల్ ఎక్కవద్దన్నా ఆలకించావా? ఐస్ క్రీమ్ తినవద్దన్నా ఆగావా? అలా  మొండితనంతో కోరిన కోరికల వలన నష్టమే తప్ప లాభం ఉండదు. రేపు నీ ఆరోగ్యం క్షీణిస్తే నీ మొండితనమే కారణమౌతుంది” అని వివరించాడు సుధ నాన్న . 

“అలాగా… పట్టుదల గురించి కూడా చెప్పండి” అనడిగింది సుధ.
[7/7, 20:23] +91 98491 63616: “ఒక ఉన్నత లక్ష్యం కోసం బలమైన కోరిక పెట్టుకుని సాధించుకోవడాన్నే  పట్టుదల అంటారు. ఆ కోరిక సాధించుకోవడంలో వివేకం, విజ్ఞానం, విచక్షణ  ఉపయోగించాలి. పట్టుదలతో ప్రయత్నించేవారికి విజయం లభిస్తుంది.  ప్రయోజనం కలుగుతుంది. నీ లాంటి విద్యార్థులు గొప్ప  ఆశయం పెట్టుకుని అది నెరవేర్చడానికి  పట్టుదలతో ప్రయత్నించాలి. అప్పుడే ఆ అబ్బాయిలా  మంచి స్థాయికి వెళతారు”  అని చెప్పాడు  సుధ నాన్న. 

 తనకి అర్ధమైందన్నట్టు తలాడించింది సుధ.  
“ ఇకముందు మొండితనం వదిలేస్తాను. మీ మాట వింటూ  కష్టపడి చదువుతాను.  పట్టుదలతో ప్రయత్నించి గొప్పదాన్నవుతాను” అని మాట ఇచ్చింది  సుధ.   వాళ్ళమ్మా నాన్నతో సహా అందరూ  హాయిగా నవ్వుకున్నారు .  
—---***-----

No comments:

Post a Comment