Sunday, August 20, 2023

నామస్మరణ మహత్యం

 _*నామస్మరణ మహత్యం*_
🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

🪷 మనం వెలకట్టలేని సంపదలు రెండే రెండు - _*ఒకటి మనశ్శాంతి. రెండోది సంతృప్తి.*_

🪷 ఈ రెండింటిని సంపాదించుకున్నవాళ్ళు ప్రతి క్షణం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు. కష్టపడఖ్ఖర్లేదు సంపాదించుకునేందుకు.

🪷 _*’కులదైవ (ఇలువేలుపు)’ నామ స్మరణ*_ చేస్తే చాలు. ఆ వెలకట్టలేని రెండు సంపదలూ లభిస్తాయి.

🪷 _*’ఆధ్యాత్మికత’ అనే సరస్సులో  ‘నామం’ అనే రాయి వేస్తే శబ్ద తరంగాలు వెలువడతాయి. అవి మనసంతా వ్యాపించి శరీరమంతా నిండిపోతాయి.*_

🪷 ఏ నామాన్నయితే మనం స్మరిస్తున్నామో ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని మన మదిలో నిలుపుతాయి. నామమే *'ఆధ్యాత్మిక శబ్ద తరంగం.'*

🪷 ”బెల్లం బెల్లం” అంటే బెల్లం రుచి మనకు తెలియదు. "తేనె తేనె” అంటే కూడా తేనె రుచి మనకు తెలియదు కదా…! బెల్లాన్ని కొరికి తినాలి. తేనెను నోటిలో వేసుకొని చప్పరించాలి. అప్పుడే ఆ మాధుర్యం మన అనుభవంలోకి వస్తుంది.

🪷 నిజానికి దైవనామం, దైవం వేరు కాదు. ఆ పేరు స్మరించగానే ఆయన మన దగ్గరుంటాడు. ఇది అనుభవైకవేద్యం. నామం చెబుతాం. శబ్దం వినిపిస్తుంది. మన రూపంలాగా రూపం కనిపించదు.

🪷 ’ఎంతకాలం నిరీక్షించాలి. ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడు’ అని సందేహం. అందుకే కొంతకాలం నామస్మరణ చేసి విసిగిపోయి విడిచి పెట్టేస్తారెవరైనా. మనం నిలబడాల్సింది ఇక్కడే. 

🪷 *దైవం ఒక అనుభవం.* ఇనుప ముక్కను బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది. ఆ ఉష్ణం ఇనుపముక్క ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది. అందులో వేడి కనిపించకపోవచ్చు, కానీ ముట్టుకుంటే చుర్రుమనిపిస్తుంది.

🪷 *నామస్మరణతో మనసును పదేపదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుంది. నామస్మరణ చేయగాచేయగా వెదురు ముక్క లాంటి శరీరం వేణువవుతుంది. బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదమవుతుంది. ముల్లోకాలూ తిరిగి, ‘నారాయణా! నారాయణా!’ అని స్మరించే నారదుడి చేతిలో తంబుర అవుతుంది.* 
 
🪷 *భక్తి-ప్రేమలను నింపి చేసే నామస్మరణకు మించిన యోగం లేదు. పూర్వజన్మ పుణ్యంవల్లనే ఆ భాగ్యం కలుగుతుంది. దాన్ని దక్కించుకున్నవారు తుకారాం, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు, ప్రహ్లాదుడు లాంటి భక్తులు. వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి నామ మాహాత్మ్యాన్ని విశ్వానికి వెల్లడించారు.*

🪷 *పురాణాల్లో, శాస్త్రాల్లో చదివాం ఆ మహానుభావుల గురించి. మనం కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. అందుక్కావల్సింది సాధనయే.*

🪷 *పూజ కోసం సామగ్రి కొనాలి. ఎన్నోకొన్ని నియమాలు పాటించాలి. వ్రతాలకూ, నోములకూ ఐతే కఠోరమైన నియమాలుంటాయి. యజ్ఞాలకూ, క్రతువులకూ శక్తియుక్తులుండాలి. శాస్త్రం తెలిసి ఉండాలి. దోషరహితంగా చెయ్యాలి.*

🪷 *కలియుగంలో నామస్మరణను మించింది లేదని చెప్పారు. ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనసును లగ్నం చేసి నామం స్మరించుకోవచ్చు. పనికి ముందూ, పనులు చేస్తూ నామస్మరణ, పని తరవాత మళ్ళీ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని పవిత్రమవుతుంది. అందులోని దోషాలు హరించిపోతాయి. ఆ విధంగా చేసే కర్మ భగవదర్పణ కర్మ అవుతుందని భగవద్గీత చెబుతోంది.*

🪷 *భయంలో, బాధలో, సుఖంలో, సంతోషంలో తేనెను పాలల్లో కలుపుకొన్నట్లు జీవితంలో నామాన్ని కలుపుకోవాలి. దైవం ఎప్పుడూ మనతో కలవడానికి త్వరపడుతూనే ఉంటాడు. నామస్మరణ ఈ రోజు మొదలుపెడితే ఇప్పుడే ఆయన మనకు చేరువవుతాడు.*

🪷 *నిరంతర భగవన్నామ స్మరణమే ఆధ్యాత్మిక జీవితానికి బంగారుబాట. సర్వకాల సర్వావస్థల్లోనూ భగవన్నామ స్మరణ చేయవచ్చు. విధివిధానాలూ, నిషేధాలూ లేనేలేవు.*



🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

No comments:

Post a Comment