*ఆపాతమధురాలు - - మధురానభూతులు*
***
రైల్వే స్టేషన్ లో వెయింగ్ మిషన్ ఎక్కడానికి 10 పైసల బిళ్ల కోసం మారాం చేసిన జెనరేషన్ మాది...
ఇంటి ముందు కొచ్చే పాల ఐసు 10 పైసలూ, ఫ్రూట్ ఐసు 5 పైసలూ నూ....
యస్సెల్సీ పాసవగానే టైప్ ఇన్ స్టిట్యూట్ కి పేపర్లు గుండ్రంగా చుట్టుకుని వెళ్లిన తరం వాళ్లం...
అద్దెకి బుక్స్ ఇచ్చే షాప్ దగ్గర్లో వుందా, ఆస్పత్రి వుందా అని అద్దె ఇళ్లు చూసుకున్న బంగారు రోజులవి....
సినిమా హాలు క్యూలో పాటల పుస్తకాలు కొనుక్కుని బట్టీలు పట్టే కాలం అది...
గెజిటెడ్ ఆఫీసర్లు అయినా సైకిళ్లు తొక్కేవాళ్లు ఆ రోజుల్లో...
డ్రాయింగ్ రూమ్ లలో జిమ్ములలో తొక్కే అవసరం పడేది కాదు...
చేబదుళ్లకి కాదేదీ అనర్హం...
పిన్నిగారింట్లోంచి గ్లాస్ తో కాఫీ పొడైనా...బాబాయ్ గారి రేలీ సైకిల్ అయినా, పక్కింటి అన్నయ్య జామెంట్రీ బాక్సూ , స్కూల్లో డ్రామాకి ఎదురింటి అక్కయ్య జడగంటలూ...కొండొకచో కాలి జోళ్లూనూ!!!
అప్పు పుట్టని పచారీ షాపులూ బట్టల కొట్టులూ వుండేవే కావు...
రేషన్ షాపుల్లో పంచదార కోసం, కిరసనాయిల్ కోసం నిలబడి,డ్యూయెట్లూ...
పాలసీసా కోసం బూతుల దగ్గర నిలబడినప్పుడు లవ్ లెటర్స్ ఎక్స్చేంజ్ లు జరిగేవి...
మధ్యతరగతి మందహాసం కాదు...పగలబడి నవ్వేది....
ఇంటి ముందుకు
కోతులాడించేవాడు, పాములాడించేవాడు,గంగిరెద్దులాడించేవాడు,ఎలుగు బంటిని తెచ్చేవాడు,చిలక జోస్యం చెప్పేవాడు,వానల్లు పడాలి వాన దేవుడా అని కప్పలకి పెళ్లిళ్లు చేసే వాళ్లు కాలాన్ని బట్టి వచ్చి వినోదం అందించే వాళ్లు...
మేకప్పులు అంటే మాకు తెలీని రోజుల్లో మొహాలకి గులాబీ రంగులేసుకునొచ్చి, ఇళ్ల ముందు సినిమా పాటలకి డాన్స్ లాడే వారు...
గారడీల వాళ్లు బాలన్సింగ్ ఎలాగో పైన తాడు మీద చిన్న పిల్లలని నడిపిస్తూ చూపించే వాళ్లు....
మూలికలూ, పసర్లూ అమ్మేవాళ్లు తాము నయం చెయ్యలేని రోగం లేదనే వాళ్లు...
స్టేషన్ దగ్గర చెవి గులిగిలు తీస్తామనే పెట్టెలతో తిరిగే వాళ్లూ, ..
ఇళ్లముందు కొచ్చి సవరాలు కడతాం అనే వాళ్లూ..
వాళ్ల కోసం టిన్నుల్లో జుట్టు వూడితే దాచుకున్న వాళ్లూ వుండేవారు ..
మధ్యాహ్నాలు భోజనాలయి వంటింటి గుమ్మం మీద తల పెట్టి కునుకు తీస్తుంటే...
"దువ్వెన్నలు, బొట్లు, కాటుక పెట్లు, ఈర్ పేన్లు...లబ్బర్ గాజులు రిబ్బన్లహో"...అంటూ పెట్టె నెత్తిన పెట్టుకొచ్చే వాళ్ల దగ్గర దొరకని ఫ్యాన్సీ వస్తువుండేది కాదు..వాళ్లు వెళ్లగానే "పాత బట్టలకి స్టీల్ సామాన్లిస్తాం"..అన్న వాళ్లు వచ్చి ఎన్నేసినా, చూపించినా గంగాళం కాకుండా ,ఆఖర్న ఉగ్గు గిన్నె ఇచ్చి పోయేవాళ్లు..గోతాముడు పాత బట్టలొదిలిపోయేవి..కత్తికి సాన పెడ్తాం, నవార్లు నేస్తాం..పరుపులేకుతాం..గిన్నెలకి సొట్టలు తీస్తాం..బంగారు వెండి వస్తువులకి పాలిష్ పెడతాం ...అరువు మీద చీరలిస్తాం అంటూ ఇంటి ఇల్లాళ్లని ఊపిరి తీసుకోనిచ్చే వాళ్లు కారు..ఇంక ముగ్గు అమ్మే వాళ్లూ ,ఉప్పు అమ్మేవాళ్లూ, కూరలూ పండ్లూ అమ్మే వాళ్లూ... సరేసరి....మాదా కబళం వాళ్లు "అన్నం వుంటే పెట్టమ్మా నీ కొడుకులు, బిడ్డలు, మనవలు సల్లంగుండ" అంటూ టైముల వారీగా వచ్చే వాళ్లు...సాయంత్రం 8 గంటల బిచ్చగాడొచ్చి వెళితే మా నానమ్మ మాత్రలేసుకునేది..
రేడియోలో బినాకా గీత్ మాలా ఊహల రెక్కలు విప్పేది..భూలే భిస్రే గీత్ అమర లోకాల్లో విహరింప చేసేది... రహస్య ప్రేమలు, అచ్చట్లు, ముచ్చట్లు... "ఏమిటో" అనుకోవడాలు ప్రొద్దుట సంస్కృత వార్తలు 'ఇతి బలదేవానంద సాగరహా 'తో ప్రారంభం అయితే ఈ మాసం పాటలూ కార్మికుల కార్యక్రమాలూ సంక్షిప్త శబ్ద చిత్ర ప్రసారాలూ..వివిధ భారతి మీరుకోరిన పాటలూ..పండితులచే నిర్మించబడ్డ నాటకాలూ..వావ్ రేడియో స్వర్ణ యుగం అది!
అప్పట్లో పేపరు చదువుతూ కాఫీ తాగని మనుషులు అరుదు..ఇంగ్లీష్ పేపర్ చదువుతే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అయినట్లే ,దూర్దర్శన్ లో ఇంగ్లీష్ వార్తల వల్ల ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నాం..తాతయ్యలకీ దూరపు చుట్టాలకీ ఉత్తరాలు రాస్తూ లెటర్ రైటింగులు నేర్చుకున్నాం....ఉభయకుశలోపరి ఎక్కడ పెట్టాలో, గంగాభాగీరధీ సమానురాలైన ఎప్పుడు వాడాలో తెలుసు!!
ఎన్నని చెప్పగలం ఆ పాత మధురాలు...కొన్ని కొన్ని గుర్తు చేసుకుందాం.
No comments:
Post a Comment