_*స్ఫూర్తి నింపే అర్జున లక్షణాలు...!*_
రాకుమారుడు అయినందువల్లనో, ధర్మరాజుకు తమ్ముడు అయినందువల్లనో- అర్జునుడికి ప్రత్యేక గుర్తింపు రాలేదు. బాల్యం నుంచీ తనకు ఇష్టమైన విలువిద్యను ద్రోణాచార్యుడి వద్ద అభ్యసించాడు. కఠోర సాధన చేశాడు. రెండు చేతులతో ఒకే విధంగా అస్త్రాలు సంధించే ధనుర్ధారిగా, సవ్యసాచిగా గుర్తింపు పొందాడు.
ప్రతి మనిషిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని గుర్తించి సాధన ద్వారా అసాధారణ ప్రతిభను కనబరచినప్పుడే ప్రత్యేకత సొంతమవుతుంది. అర్జునుడికి దుర్యోధనుడు, శకుని రూపాల్లో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదురయ్యాయి. సర్వం కోల్పోయి వనవాసం, అజ్ఞాతవాసాలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. విజయం సాధించాడు.
అర్జునుడు ఏకాగ్రతతో ఎన్నో అవరోధాల మధ్య పక్షి కన్ను గురి చూసి కొట్టగలిగాడు. చీకట్లో బాణాలు సంధించాడు. మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని సొంతం చేసుకున్నాడు.
మనలో ఎంతో ప్రతిభ ఉండవచ్చు. మన చుట్టూ ఎన్నో వనరులు ఉండవచ్చు. ప్రతిభను వెలికి తీసే నైపుణ్యం, వనరులను వినియోగించుకునే చాకచక్యం, చేసే పనిమీద ఏకాగ్రత ఉన్నప్పుడే ఆసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి.
_ఓసారి ద్రోణుడు శిష్యులతో గంగానదీ తీరానికి వెళ్ళాడు. గంగలో దిగిన ద్రోణుడి కాలును ఓ మొసలి పట్టుకుంది. ఏం జరిగిందో తెలిసే లోపలే ఆర్జునుడు సమయస్ఫూర్తితో ద్రోణుణ్ని కాపాడాడు. మనలో ఉండే నైపుణ్యాన్ని సమయ స్ఫూర్తితో నిర్వర్తించినప్పుడే గుర్తింపు వస్తుంది. తనను నమ్ముకున్న వారికి అన్యాయం జరిగినప్పుడు స్వధర్మాన్ని నిర్వర్తించడం కూడా మనిషి కర్తవ్యాల్లో ఒకటి._
ఊర్వశి అర్జునుణ్ని మోహిస్తుంది. ఆమె కామ వాంఛను తిరస్కరించిన అర్జునుణ్ని కోపంతో పేడి అవతారం ఎత్తమని శపించింది. అర్జునుడు ఆ శాపాన్ని స్వీకరించాడు. ఆ శాప ఫలితంగానే అజ్ఞాతవాస సమయంలో బృహన్నలగా అవతారం ఎత్తాల్సి వచ్చింది. ధర్మబద్ధం కాని ఊర్వశి కోరికకు లొంగిపోలేదు. అర్జునుడిలో ఉన్న ఇంద్రియ నిగ్రహం, ధర్మబద్ధం కాని దాని మీద అనాసక్తి- అతడికి వన్నె తెచ్చాయి.
నేడు మనిషిని భ్రష్టు పట్టించే ఎన్నో వ్యామోహాలు చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. ధర్మబద్ధం కాని వాటిని తిరస్కరించడంలోనే నైతికత వెలుగు చూస్తుంది.
కృష్ణార్జునుల మధ్య స్నేహమేకాక బంధుత్వం కూడా ఉంది. కృష్ణుడిని గురువుగా భావించాడు అర్జునుడు. కురుక్షేత్ర సంగ్రామంలో బంధుజనాన్ని చూసి జనాన్ని చూసి పాపభీతి, మనోదౌర్బల్యాలకు లోనయ్యాడు. కృష్ణుణ్ని శరణాగతి కోరాడు. అప్పటివరకు శత్రువులతో పోరాడటమే వీరత్వంగా భావించేవాడు అర్జునుడు.
భగవద్గీత ద్వారా అర్జునుడికి కంటికి కనిపించని అంతఃస్వరూపం చూపించి తనను తాను తెలుసుకోవడమే వీరత్వం అని బోధించాడు. బాహ్యంగా 'నేను' అనేది 'నువ్వు' కాదని విశ్వరూప సందర్శనం ద్వారా కర్తవ్యం గుర్తెరిగేలా చేశాడు కృష్ణుడు. మహాభారతంలో విలక్షణ పాత్ర అయిన అర్జునుడి లక్షణాలెన్నో నేటికీ మనిషి వ్యక్తిత్వ నిర్మాణానికి స్ఫూర్తినిస్తాయి.
No comments:
Post a Comment