Wednesday, May 22, 2024

_ఈ సన్యాసి_* *_అద్భుతవచనాల విన్యాసి!_

 *_ఈ సన్యాసి_*
*_అద్భుతవచనాల విన్యాసి!_*

🙏🙏🙏🙏🙏🙏🙏

ఎప్పుడు పుట్టాడో
అప్పటి నుంచి 
ఆగని ప్రయాణమే..
జీవితం మొత్తం
ఉన్నత ప్రమాణమే..
బతుకుతెరువు కోసం కాదు 
తన పయనం..
పిన్న వయసులోనే తెరచుకున్న 
*జ్ఞాననయనం*
తనను తాను తెలుసుకుంటూ..
*_భగవంతుణ్ణి వెతుక్కుంటూ..!_*

ఆగలేదు..వీగలేదు..
జన్మభూమి నుంచి
మరుభూమి వరకు
అలుపెరుగని నడక
తెలియని ప్రయాస
*_దేవుడెక్కడన్నదే మీమాంస_*
నిరంతర జ్ఞానపిపాస!

సిద్ధాంతాలు..పిడివాదాలు
దేవాలయాలు..
సంప్రదాయాలు..
తగవని చెబుతూ 
ఆనవసర వాదాలు..
*_జీవుడే దేవుడని.._*
దరిద్ర నారాయణ సేవే
పరమార్థమని..
అదే యదార్ధమని
గ్రహించి..తా నిగ్రహించి..
ఉన్నతమైనది 
ఆధ్యాత్మిక శక్తని నమ్మి
జీవిత పర్యంతం
అదే ఆర్జించె...
*దుర్గుణాలను నిర్జించి..!*

అన్ని మతాలు సమ్మతమేమని..
*_ఏ మతానికైనా_*
*_మానవతే అభిమతమని.._*
ఆ మానవతకు..
అందులో సమానతకు
తన జీవితం అంకితమని
ప్రకటించిన 
*నిజమైన సన్యాసి..*
*నిరంతర పదన్యాసి..*
_*అద్భుత వచనాలవిన్యాసి!*_

ఎంతటి మహత్కార్యమైనా
ఆరంభం స్వల్పమని..
నిరాశ వీడితే ఫలితాలు
అద్భుతమని..
అందుకే గమ్యం చేరేదాకా
గమనం ఆపరాదని భావన
అందాకా అప్రమత్తమని బోధన
*_జీవితం మొత్తం_* 
*_అదే సాధన..!_*

అన్వేషి పాత్రలో
నరేంద్రుని యాత్రలో
ఒకటే ప్రశ్న..
*దేవుని చూసారా..*
సమాధానమై ప్రత్యక్షమైన 
ఒకే రూపం
సన్యాసుల్లో కలహంస
_*రామకృష్ణ పరమహంస..*_
అంతటి గురువుకూ
తప్పని పరీక్ష..
మొత్తానికి ఆ సన్నిధిలోనే
ఫలించిన నరేంద్రుని ప్రతీక్ష!

ఒకనాడు పస్తులున్నా
తరగని విలువల ఆస్తులు..
తానుగా చేస్తున్నా లంఖనాలు
ఆగని దానాలు..
కదిలిందంటే స్వామి రథం
మహరాజులైనా పట్టినట్టే బ్రహ్మరథం..
అలా జేజేలతోనే
ఆవిర్భవించింది 
*వివేకుని ఆధ్యాత్మిక సౌధం!*

రూపం ముగ్ధమనోహరం
మాట సమ్మోహనం..
ఆ మోమున 
కోటి సూర్యుల వెలుగో..
ఆకట్టుకున్న 
పలుకుల సొబగో..
మురిసింది చికాగో..
*_ఒకే ఒక్క ప్రసంగం.._*
*_తలవంచింది ప్రపంచం!_*

వివేకానందుని ఉనికితో
భారతీయ సిద్ధాంతాలకు
మరోసారి మహర్దశ..
ఇంత చేసిన స్వామికి
ఎందుకో మరి
పిన్న వయసులోనే
ముంచుకొచ్చిన చివరిదశ
బహుముఖుడు అంతర్ముఖుడై..
ఆధ్యాత్మిక చింతనతోనే
చేరాడు మృత్యువు చెంతన..!
🌸🌸🌸🌸🌸🌸🌸
యువజన దినోత్సవం...
స్వామి వివేకానంద జయంతి
12.01.1863..సందర్భంగా
శిరస్సు వంచి నమస్కరిస్తూ..

*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
         9948546286

No comments:

Post a Comment