Thursday, May 23, 2024

వేటూరి సుందర* *రామమూర్తి గారి* *వర్ధంతి.(22-5-2010).

 *ఈ రోజు వేటూరి సుందర* *రామమూర్తి గారి* 
 *వర్ధంతి.(22-5-2010).* 

ఆయన రాకముందు ఎందరో మహామహులు సినీ గీతాలు...సాహిత్యవిలువలతో వ్రాశారు. 

నీతులు రాశారు. బూతులు రాశారు!

కానీ ఈయన రాకతో రసవద్గీతలు & భగవద్గీతలు కూడా వెల్లువయ్యాయి.

పున్నాగపూలు సన్నాయి పాడాయి..కోకిలమ్మకు పెళ్ళి కుదిరింది...కోనంతా పందిరయ్యింది...చిగురాకులు తోరణాలయ్యాయి.

మానసవీణలు మధు గీతాలు పాడాయి.

వెల్లువొచ్చి గోదారమ్మా వెల్లకిలా పడింది.

గోవుల్లు తెల్లన, గోపయ్య నల్లన, గోధూళి ఎర్రనా ఎందువలన? అని సందేహాలు కలిగాయి!

నెమలికి నేర్పిన నడకలు, మురళికి అందని పలుకులు, అందానికి అందమైన పుత్తడి బొమ్మలు దొరికారు.

తకిట తకిట తందానాలు, జగడ జగడ జగడాలు, మసజసతతగ శార్ధూలాలు,గసగసాల కౌగిలింతలు తెలుగు పాటను శృంగారభరితం...రసవంతం చేశాయి.

                            @@@@

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది... మాధవుడు యాదవుడు మాకులమే లెమ్మందీ.. 
అని నడమంత్రపు మనుషులకు  జవాబిచ్చింది!

వేణువై వచ్చాను భువనానికి..గాలినై పోతాను గగనానికి....
 
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే....వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే...

నరుని బ్రతుకు నటన ..ఈశ్వరుని తలపు ఘటన... ఈ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన...

వేదాంత ధోరణి నిగ్గదీసింది.

చిలక్కొట్టుళ్ళు, గిచ్చుళ్ళు, 
తిక్క రేగిపోవడాలు, పలక మారిపోవడాలు, 
ఆకు చాటున తడిసిన పిందెలు, 
ఆరేసుకోబోయి పారేసుకోవడాలు...

ఇలాంటి పామర జన రంజకమైన పదాలు కూడా సంధర్భోచితంగా...సాహిత్య మర్యాదకు నోచుకున్నాయి!

ఈ ధుర్యోధన ధుశ్శాసన  గీతంలో... మర్మ స్థానం కాదది నీ జన్మ స్థానం.. అంటూ అందరినీ ఉద్వేగ పరిచే ఆవేశం!

వెండితెరపై పాటలకు సరికొత్త గౌరవం తీసుకొచ్చిన ఆ పాళీ..
ఎవరిదో మీకిప్పటికే తెలుసు.

కీ.శే.వేటూరి సుందర రామమూర్తి గారు.

                             @@@@

అలలు కదిలినా....పాటే! 
ఆకు మెదిలినా....పాటే!
కలలు చెదిరినా....పాటే!
కలత చెందినా.....పాటే!....

ఏ పాట నే పాడనూ.....అంటూ సందిగ్ధావస్థలో పడే వారు ఆకాలంలో. 

అదో స్వర్ణ యుగం....సినీ సంగీతానికి!

ఇప్పుడదేం లేదు! పాటలు ఉండాలి. 

అవి ఓన్లీ హీరో హీరోయిన్లకే ఉండాలి! 

మహా ఐతే...ఒకటో...రెండో ఐటెం సాంగ్స్ ఉండాలి! అవి కూడా స్టెప్పులేసుకునేందుకు వీలుగా....మాంచి ఊపు వచ్చేట్లుండాలి!

ఆ పాటలకు సందర్భ శుధ్ధి కూడా ఏమీ అవసరం లేదు! ఎప్పుడంటే....అప్పుడే వచ్చిపోతుంటాయి! 

సూటూ...బూట్లతో హీరో....పెద్ద పెద్ద కర్చీఫ్ లు పైన.... చిన్ని చిన్ని చెడ్డీలు క్రింద వేసుకుని హీరోయిన్...గెంతుతూ ఉంటే....

ప్రక్కన పదిమంది....వెనకాల వంద మంది గెంతుతూ ఉంటారు!

పాట ఎప్పుడెప్పుడైపోతుందా.....అని ప్రేక్షకుడు....చూస్తుంటాడు! 

అదీ ఇప్పటి పాట గతి!

                                @@@@

అసలీ పాటలు & పద్యాలు ఎందుకండి !? విదేశీ సినిమాలలో చాలా తక్కువగా ఉంటాయి....లేదా...సినిమా అంతా పాటలే ఉంటాయి. సౌండ్ ఆఫ్ మ్యూజిక్ లాగా!

ఈ ధుర్యోదన దుశ్శాసన దుర్వినీతి లోకం లో......బదులు సింపుల్ గా..నీకు తల్లీ..చెల్లీ లేరా! అనొచ్చు. 

ముప్పిరిగొన్న భావావేశాలను...మాట భరించలేదు. అవి పదాలుగా దొర్లకుండా...కళారూపం ఇవ్వాలి. అదే పాట!

                              @@@@

1974 లోవచ్చిన 'ఓ సీత కథ తో సినీ గీతాల రచన క్రొత్త మలుపు తిరిగింది.

ఆ పదవిన్యాసంలో.....
ఆ నవ్యతలో.....,
ఆ వైవిధ్యంలో...., 
ఆ నిర్భయ పదసృష్టిలో....
ఆ ప్రభంజనంలో...... 

సినీ కవిత 4 దశాబ్ధాల పాటు ఉర్రూత లూగింది.

ఇప్పటి తెలుగు సినిమా పాట...మాట ఎలా ఉన్నాయంటే....బెజవాడలో ఏలూరు కాలువ లేదూ...అలా ఉంది! ఒకప్పుడు  తెలుగు సినిమా పాట గౌరీశంకర శృంగం! అని అన్నాడాయన.

పాట పక్షి లాంటిదని....ఏ పక్షి ఎంత బరువు మోయగలదో...ఎంత దూరం పయనించ గలదో...వారికి తెలిసినట్లు ఇంకెవరికీ తెలియదని కాదు!

అలా తెలిసిన వారిలో అగ్రగణ్యులు వేటూరి వారు. ఏ పాటకు...ఎలాంటి అలంకారం చేయాలి. ఏ ఆభరణాలు తొడగాలో...బాగా తెలిసిన వారు!

శృంగార గీతాలు కూడా....చిందులు తొక్కేలా చేశాయి వీక్షకులను!

నమక చమక యమగమక లయంకర సకలలోక జర్జరిత భయంకర వికట నటస్పద విస్ఫులింగాల్ని....
కురిపించిన ఆ కలమే....

అబ్బ నీ తీయనీ దెబ్బ...ఎంత కమ్మగా ఉన్నదోయబ్బ...
అంటూ శృంగారాన్ని ఒలికించింది!

                              @@@@

నే చెప్పేదేముంది. అందరూ ఒప్పుకునేదే.
వేటూరికి సాటి వేటూరి యే....

వేటూరి వారిపాటకి
సాటేదని సరస్వతిని చేరి కోర, 
నా పాటేశ్వరుడికి వుజ్జీ
వేటూరేనంది నవ్వి వెంకటరమణా!

ఇది ముళ్ళపూడి వెంకటరమణ గారు ఛలోక్తి గా చెప్పిన విషయం.

గానం కోరుకునే గీతం వేటూరి 
గాయకుడు కోరుకునే కవి వేటూరి 
ఇది మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి ఉవాచ.

యాభై సంవత్సరాలు పైబడిన మా సినీ జీవిత ప్రయాణంలో మాకు తారసపడిన మహాకవులు ఇద్దరే ఇద్దరు. ఒకరు కణ్ణదాసన్. ఇంకొకరు వేటూరి.
ఇది సంగీత దర్శకద్వయం రాజన్-నాగేంద్ర గార్ల అభిప్రాయం.

పయనీర్ అన్నా, ట్రెండ్ సెట్టర్ అన్నా వేటూరి గారే! నేను కేవలం ఆయనకు కొనసాగింపు మాత్రమే.
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇలా చెప్పారు.

                            @@@@

వేటూరి సుందరరామ్మూర్తి గారు 1936 న జనవరి 29 న కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో జన్మించారు.

మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్... బెజవాడలో డిగ్రీ పూర్తిచేశారు. 

ఆంధ్ర ప్రభ పత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశారు. 
1956 నుంచి పదహారేళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు.

వేటూరి దైతా గోపాలం గారి దగ్గర...
ఆ తర్వాత మల్లాది వద్ద శిష్యరికం చేశారు.

8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు...
ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. 

వేటూరి గారు 75సంవత్సరాల వయస్సులో మే 22, 2010 న హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు.

వేణువై వచ్చాను భువనానికి
గాలి నై పోయాను గగనానికి.....అంటూ.

ఈ రోజు వేటూరి సుందర రామమూర్తి గారి
వర్ధంతి.(22-5-2010).

స్మృత్యంజలి.🌹

              
🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹

No comments:

Post a Comment