*జీవనగీత" (నిత్యజీవితంలో భగవద్గీత)*.
*12.భాగము.*
ఈ ప్రపంచమంతా మూడు గుణవికారాలతో నిండి వుంటుంది. అవి సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ త్రిగుణముల మాయచే ఆవరింపబడిన జీవుడు, ఈ గుణములకు అతీతుడైన పరమాత్మ స్వరూపమును గ్రహించలేకున్నాడు.
వీటి ప్రభావముచేత జీవుడు, అశాశ్వతమైన తన శరీరమునే తానుగా భావించి క్షణికమైన దృశ్యవస్తువుల వెంట పరిగెట్టి వాటిని పరమప్రీతితో అనుభవించుచున్నాడు. వున్న పరమాత్మను లేదని వాదించి, లేని జగత్తును వున్నదిగా భావిస్తూ కాలప్రవాహములో కొట్టుకొని పోవుచు జననమరణములను పొందుతున్నాడు.
అనేక జన్మల సాధనాఫలితంగా, ఎదో ఒక జన్మలో జ్ఞానము ఉదయిస్తుంది. అప్పుడు జీవుడు ఈ జగత్తంతయూ బ్రహ్మమే( సర్వం ఖల్విదం బ్రహ్మ), జీవుడు కూడా బ్రహ్మమే(జీవో బ్రహ్యైవ నాపరః) అనే పరమసత్యాన్ని గ్రహిస్తాడు. అదే జీవుని ఆఖరి జన్మ అవుతుంది. ఈ స్థితిని సాధించిన మహాత్ములు చాల అరుదు.
ఇట్టి మహత్తరమైన శక్తిని పొందియుండి కూడా జీవుడు, మాయలోపడి, సత్యమును మఱచి, రాగద్వేషములకు వశుడై, మోహమందు మునిగి సుఖదుఃఖములు అనుభవించుచు కలుషిత మనస్కులై, సంసారచట్రములో బందీలగుచున్నారు.
మరి ఈ మాయనుండి బయటపడే మార్గము లేదా? అని పార్ధుడు ప్రశ్నించినప్పుడు, అర్జునా! ఎందుకు లేదు, నిశ్చయంగా వుంది! దానికి చేయవలసినదంతా -
"ఎలాగైతే శివాలయములో నందీశ్వరుడు, విష్ణువాలయంలో గరుత్మంతుడు, రామాలయంలో హనుమంతుడు, వారు మనస్ఫూర్తిగా నమ్మిన దైవమునే ఎల్లవేళలా చూస్తూ వారియందే మనస్సు లగ్నంచేసియున్నారో, అలాగే జీవుడు తనలో వున్న పరమపవిత్రమైన ఆత్మను తెలుసుకొని, దానినే ఆశ్రయించి, దానినే నమ్ముకొని, నిత్యమూ దానియందే మనస్సు లగ్నము చేసి, ఈ ఆత్మే అందరిలో నున్నదన్న పరమసత్యమును గ్రహించి, స్థిరబుద్ధితో వుంటారో వారే ఈ మాయను సునాయాసంగా దాటగలరని" శ్రీకృష్ణుడు ఘంటాపధంగా అర్జునునికి తెలియజేశాడు.
అందుకే వివేకానందుడు, “There is but one the free, the knower, Self without a name, without a form or stain. In him is Maya dreaming all this dream. The witness, He appears as Nature, Soul. Know Thou art That, Sannyasin bold say “Om Tat Sat”.
ఉన్నది ఒకే వస్తువు, మాయాప్రభావముచే అది నానరకములుగా కాన్పించుచున్నది. అట్టి బ్రహ్మమును ఆశ్రయించువారు, ధ్యానించువారు కృతార్థులగుచున్నారు.
మాటలతో ప్రకృతి లొంగదు. మంత్రములతో చింతకాయలు రాలవు. భగవంతుడు ప్రసాదించిన అపారమైన శక్తితో, దృఢమైన సంకల్పంతో, కఠోర సాధనతో, అనుభవపూర్వక జ్ఞానముతో తనతో పాటు సమస్త జడజీవ పదార్థములందు వున్న ఆ పరమాత్మని తెలుసుకోవడమే జీవుని కర్తవ్యమని బోధించాడు జగద్గురువు.
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
No comments:
Post a Comment