*🌻రాజ తంత్రం🌻
* అవి హంపీ విజయనగర సామ్రాజ్యం వైభవంతో విలసిల్లుతున్న రోజులు. శ్రీకృష్ణదేవరాయలు ప్రజలను కన్న బిడ్డలలాగా చూసుకుంటూ వారికి ఏవిధమైన లోటూ లేకుండా పాలిస్తున్నాడు.
* మహామంత్రి తిమ్మరుసు చలవ వల్లనే రాయలు రాజ్యాధికారాన్ని పొందగలిగాడు. అందువల్ల ఆయనపట్ల రాయలకి గురుభావం, పిత్రుభావం రెండూ వుండేవి. అందుకే ఆయనను ఆప్యాయంగా 'అప్పాజీ' అని పిలిచేవాడు.
* అవి రాయలు రాజ్యానికి కొత్తగా వచ్చిన రోజులు కావడంతో ఇంచుమించు ప్రతి విషయానికీ మంత్రి తిమ్మరుసుపైనే ఆధారపడుతుండేవాడు రాయలు. ఆయన గీసిన గీటు దాటేవాడు కాదు. ప్రధాన నిర్ణయాలు అన్నీ ఆయనకే వదిలేసేవాడు. న్యాయ విచారణ అయితే జ్ఞాన వృద్ధుడయిన తిమ్మరుసు ఒక్కడే చేయాలి. ఆదర్శవంతమైన వారి పరిపాలనలో దేశం మూడు పువ్వులు ఆరుకాయలుగా విలసిల్లేది.
* అది సర్దార్ ఖాన్ ఇల్లు. సామాన్యుడైన ఖాన్ కమ్మరి వృత్తి చేస్తూ జీవితం గడుపు కుంటుండేవాడు. అతడు స్వతహాగా మంచివాడు. కాని ముక్కోపి కోపంలో దుర్వాసుడిని మించినవాడు. కోపం వచ్చిందంటే తాను ఏమి చేస్తాడో అతడికే తెలీదు.
* అది వేసవి కాలం పగలంతా వేడి గాడ్పులు వీస్తున్నా హంపీ విజయనగరం తుంగభద్రా నదికి దగ్గర వుండడం వల్ల రాత్రుళ్ళు కాస్తంత చల్లని గాలులు వీస్తున్నాయి. సర్దార్ ఖాన్ తన ఇంట్లో ముందు గదిలో పడుకొని వున్నాడు. కాని ఉక్కగా వుండడంతో సరిగా నిద్ర పట్టడం లేదు. అతడు నిద్ర పట్టక ఆటూ ఇటూ దొర్లుతున్నాడు.
* ఇంతలో అతడి ఇంటి అరుగు మీద నుండి ఎవరో ఖంగు ఖంగున దగ్గుతున్న శబ్దం వినిపించింది. ఎవరో చూద్దామని తలుపు తీసి బయటకు వచ్చాడు ఖాన్.
* ఆ అరుగు మీద ఎవరో నలుగురు పడుకుని ఉన్నారు. వారిలో ఒకడు బాధగా దగ్గుతున్నాడు. వారిని చూస్తూ "ఎవరయ్యా మీరు?” అని అడిగాడు ఖాన్.
* "అయ్యా ! మేము పరదేశీయులం. నగరంలో పనుండి వచ్చాం. బాగా రాత్రి అవడంతో ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాం. పొద్దున్నే వెళ్ళిపోతాం" అని వారిలో ఒకతను సమాధానం చెప్పాడు.
* "సరే” అంటూ లోనికి వెళ్ళిపోయాడు ఖాన్.
* మళ్ళీ కొంచెంసేపయ్యేసరికి. 'ఖంగ్ ఖంగ్' అంటూ మళ్ళీ చాలా ఎక్కువగా దగ్గు వినపడింది.
* సర్దార్భన్ కోపంతో ధడాలున తలుపు తీసుకుని బయటకు వచ్చాడు.
* “ఓయ్! ఇక్కడి నుండి మీరు వెంటనే వెళ్ళిపొండి. ఈ దగ్గుతో నాకు తల ఆదిరిపోతోంది నిద్రపట్టడం లేదు”అన్నాడు కోపంగా...
* "బాబ్బాబు ఇంత రాత్రప్పుడు ఎక్కడికి పోతాం? కాస్తంత ఓపికపట్టండి. అసలే మా రంగప్ప దగ్గుతో మెలికలు తిరిగి పోతున్నాడు” అంటూ బ్రతిమలాడారు ఆ బాటసారులు.
* “సరే దూరంగా పోయి దగ్గుకోమనండి. మళ్ళీ దగ్గు వినిపిస్తే నేను వూరుకునేది లేదు" అంటూ లోపలికి పోయి ధఢాలున తలుపులు వేసుకున్నాడు సర్దార్ ఖాన్.
* ఖాన్ పెట్టిన భయం వల్లనే తగ్గిందో లేక నిజంగానే తగ్గిందో కాని రంగప్ప దగ్గు కొంచెం తగ్గింది. ముసుగు బిగించికొని నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు.
* ఒక గంట గడిచింది.
* బయట అరుగు మీద బాటసారులు ఆదమరచి నిద్రపోతున్నారు. లోపల సర్దార్ ఖాన్ కి మగత నిద్ర పట్టింది.
* ఇంతలో వున్నట్లుండి ఏమయిందో ఏమో గాని, రంగప్పకి దగ్గు తన్నుకు వచ్చింది. 'ఖంగ్ ఖంగ్' మంటూ ఊరూ వాడా అదిరేటట్లు దగ్గసాగాడు.
* ఆ దగ్గుకి అదరిపడి లేచాడు ఖాన్. పట్టరాని కోపంతో ప్రక్కనే వున్న కైజార్ తీసుకొని ధడాలున వీధి తలుపు తీసుకుని బయటకి వచ్చి "బద్మాష్! పొమ్మన్నా పోకుండా నీ దగ్గుతో నా ప్రాణం తీస్తున్నావు. చావు ” అంటూ రంగప్పని బలంగా రెండు మూడుసార్లు పొడిచేశాడు.
* ఆసతే దగ్గుతో మెలికలు తిరిగిపోతున్న రంగప్ప, కత్తిపోట్లతో గిలగిలలాడుతూ రక్తపు మడుగులో పడి ప్రాణాలు వదిలాడు.
* హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకి మిగిలిన బాటసారులు కొయ్యబారి పోయారు. ఖాన్ ని ఎదిరించే ధైర్యం లేక అక్కడే వుంటే తమని ఏమి చేస్తాడోనన్న భయంతో వాళ్ళు పారిపోయారు. తర్వాత తిన్నగా వెళ్ళి తిమ్మరుసు మంత్రికి ఫిర్యాదు చేశారు.
* తిమ్మరుసు ఆజ్ఞ మేరకు రాజభటులు వెళ్ళి సర్దార్ ఖాన్ ని బందీ చేసి మర్నాడు రాజదర్బారులో ప్రవేశపెట్టారు.
* శ్రీకృష్ణదేవరాయలు సమక్షంలో విచారణ ప్రారంభమయింది. ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యంతో పని లేకుండా సర్దార్ ఖాన్ నేరం చేసినట్లు తనంతట తానే ఒప్పుకొనడంతో విచారణ త్వరగానే పూర్తయింది. తనకి రంగప్పతో వైరమేమీ లేదనీ, కేవలం అతడి దగ్గు భరించలేక క్షణికావేశంలో అతడిని చంపివేశానని తెలియజేశాడు ఖాన్.
* ఖాన్ మాటలకు సభికులంతా నివ్వెర పోయారు. కేవలం గట్టిగా దగ్గినందుకు దారుణంగా ఒక అమాయకుడిని చంపిన ఆ వ్యక్తికి మరణశిక్ష, అది కూడా చిత్ర వధతో విధించాలని అందరూ గట్టిగా అనుకున్నారు.
* న్యాయ నిర్ణయం తీసుకోవలసింది తిమ్మరుసు కదా! ఆయన తీర్పు కోసం సభికులంతా నిశ్శబ్దంగా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కృష్ణరాయలు కూడా ఉత్కంఠతో కూర్చున్నాడు.
* “మహారాజా! ఈ వ్యక్తి క్షణికావేశంతో దారుణమైన హత్య చేశాడు. దానికి తగిన దండన పడవలసిందే. సకల రాజ భోగాలతో ఇతడిని గౌరవించడమే సరియైన శిక్ష" అని తీర్పు చెప్పాడు తిమ్మరుసు.
* చనిపోయిన వ్యక్తి బంధువులకు తగిన పరిహారం ఇవ్వాలని కూడా తన తీర్పులో పేర్కొన్నాడు ఆయన.
* ఆ తీర్పు విని తమ చెవులను తామే నమ్మలేకపోయారు సభికులు. ఖాన్ ఆశ్చర్యానికి అంతే లేదు. కారణం లేకుండానే తిమ్మరుసు అటువంటి తీర్పు ఇవ్వడని కృష్ణ దేవరాయలు మౌనంగా మిన్నకున్నాడు.
* కొంత కాలం గడిచింది. సకలరాజ మర్యాదలతో, భోగాలతో హాయిగా జీవితం గడుపుతున్నాడు సర్దార్ ఖాన్. తనకి అంతటి వైభోగం కలిగించిన తిమ్మరుసు పట్ల, కృష్ణరాయల పట్ల ఆత డికి కృతజ్ఞత అణువణువునా నిండి పోయింది.
* ఓసారి శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరుసు, ఖాన్ తో సహా కొద్దిమంది పరివారంతో వేటకి బయలుదేరాడు. అడవిలో విడిది చేశాడు. ఈ సంగతి తెలిసి బహమనీ నవాబు ఆడవిలో వున్న కృష్ణరాయల పై చాటుగా దాడికి వచ్చాడు.
* ఆ పరిస్థితులలో రాయలవారు చేయగలి గింది ఏమీ లేదు. తిమ్మరుసు వారి తరఫున సంధి రాయభారం తెలుపుతూ ఒక లేఖను రాసి దానిని ఖాన్ ద్వారా నవాబుకి పంపించాడు.
* కృష్ణరాయలంతటి వాడు సంధి కోరేసరికి పట్టపగ్గాలు లేకపోయాయి నవాబుకి. ఆ లేఖ విప్పి చదవసాగాడు. ఆ లేఖ నిండా నవాబును తిడుతూ ఘాటైన పదజాలం వుంది. అది చదవగానే కోపం పట్టలేక రాయలవారిని తిడుతూ లేఖని నేలకేసి కొట్టి దాని మీద ఉమ్మివేశాడు నవాబ్.
* తనకి దైవ సమానుడైన రాయలవారు పంపిన లేఖను అవమానపరచి, ఆయన్ని తిట్టేసరికి కోపం పట్టలేకపోయాడు సర్దార్ ఖాన్. వెంటనే బొడ్డు లోంచి కైజారు తీసి నవాబు మీదికి ఉరికి పొడిచి చంపేశాడు. ఆకస్మికంగా ఈ సంఘటన జరగడంతో అక్కడ ఎవ్వరూ నవాబును కాపాడలేక పోయారు. అయితే ఆ వెంటనే నవాబు పరివారం ఖాన్ తల నరికి వేసింది. నవాబు చనిపోవడంతో అతడి పరివారం తమ రాజ్యానికి పారిపోయారు.
* ఆ విధంగా రాయలవారి సామ్రాజ్యానికి పట్టబోయిన మహా విపత్తు కొద్దిలో తప్పి పోయింది. అప్పుడు అర్థం అయింది రాయలవారికి తిమ్మరుసు రాజతంత్రం.
* "అవును ప్రభూ ! క్షణికావేశంలో ప్రాణాలకు తెగించి ముందుకు ఉరికే వాళ్ళు కూడా అవసరమే. ఖాన్ లో ఈ లక్షణం గమనించి, ఎప్పటికైనా మనకి పనికివస్తాడనే అతడికి రాజభోగాలు కల్పించాను. ఆ కృతజ్ఞతతో అతడు తన ప్రాణాలొడ్డి మన సామ్రాజ్యాన్ని కాపాడాడు" అని విశదపరిచాడు తిమ్మ రుసు.
* తిమ్మరుసు రాజతంత్రానికి అందరూ ఆశ్చర్యపోయారు.
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
No comments:
Post a Comment