కాఫీ కబుర్లు సంఖ్య 623 (మే 22 - 2024) బ్రతుకు పూలబాట కాదు.. ---- కష్టపడకుండా అందలం ఎక్కాలనుకోవడం మూర్ఖత్వం. కాలేజీ చదువుల కొచ్చాక మనకంటూ ఒక లక్ష్యం ఏర్పరుచు కోవడం చాలా అవసరం. జీవితం పూల రహదారి కాదు.. అడుగడుగునా.. ఇబ్బందులు బాధలు రూపంలో ముళ్ళుంటాయి. అనేక అడ్డంకులను అధిగమించి ముందుకు దూసుకుపోవాలి. జీవితం అంటేనే విధి ఆడించే వింత నాటకం. ఈ నాటకాన్ని రక్తి కట్టించాలి. ఎంతో శ్రమ పడితేనే గానీ అనుకున్నది సాధించలేం. జీవితంలో కూడా మనం పాఠాలు నేర్చుకోవాలి. మనకి తారసపడే ప్రతీ వ్యక్తి ఓ పాఠమే. మంచిని నేర్చుకుని చెడును వదిలేయాలి. ముందు కష్టపడితేనే తర్వాత సుఖపడతాం అనే సూత్రాన్ని అన్వయించుకోవాలి. ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించి అగ్రస్థానంలో ఉన్నాడంటే.. వెనుక ఎంతో శ్రమ పరిశ్రమ ఉంటాయి. సక్సెస్ సునాయాసంగా రాదు. చాలామంది తమ అమూల్యమైన జీవితాన్ని ఒక దిశా నిర్దేశం లేకుండా వృధా చేసుకుంటున్నారు. మహా ఐతే ఇరవై పాతికేళ్ళ జీవితం మాత్రమే తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఉంటుంది. తరువాత 70-80 ఏళ్ళ జీవితం మనదే. జీవితంపై ఒక అవగాహన ఉండాలి. మన జీవితాన్ని మనమే నిర్మించుకోవాలి. మంచైనా చెడైనా బాధ్యత మనదే. వృద్ధాప్యం కూడా పూలబాట కాదు. పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళకి పెళ్ళిళ్ళు అయి మరో తరం పుట్టుకొస్తుంది. కుటుంబ సభ్యులు పెరుగుతారు.. సమస్యలూ పెరుగుతాయి.. బిపీలు పెరుగుతాయి. మనకి 45 దాటాక.. మరో 15 ఏళ్ల తర్వాత వచ్చే 20-30 ఏళ్ల వృద్ధాప్య జీవితానికి ప్రణాళికలు వేసుకోవాలి ఆర్ధికంగా ఇతరత్రా కూడా. ఈ వయసులో ప్రశాంతత మనశ్శాంతి చాలా అవసరం. ఈ జీవితం ఒక్కసారే గనుక ఎక్కువ కాలం.. నిండు నూరేళ్ళు.. బతకాలని మనం కోరుకోవాలి. ఆర్ధికబలం ఆరోగ్యం.. ఈ రెండూ మనకుంటే పరిపూర్ణ జీవితం మనదే. మన జీవితం ఇతరులకి ఆదర్శం పాఠ్యాంశం గా ఉండాలి. నేమ్ & ఫేమ్ ఉంటే మన ఆర్ట్ కు, ఆశయాలకు మరణం ఉండదు. ఆలోచన ఆశయం, సరియైన అవగాహన ప్రణాళిక.. నిండు నూరేళ్ళ జీవితానికి పూలబాట. బ్రతుకు పూలబాట కాదు.. అది పరవశించి పాడుకునే పాట కాదు .. అన్న ఆత్రేయ వాక్యాలు ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే పరిపూర్ణ జీవితం గడిపి ధన్యులం అవుతాం.. ------- గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) విజయనగరం ఫోన్ 99855 61852....
No comments:
Post a Comment