Wednesday, June 26, 2024

 "జ్ఞానగీత" (నిత్యజీవితంలో ఉపనిషత్తులు) -ప్రశ్నోపనిషత్తు - 04వ భాగము.
ఆరుగురు శిష్యులలో ఒకడైన కౌసల్యుడు, మూడవప్రశ్నగా ఆచార్యుడైన పిప్పలాదునుద్దేశించి, గురువర్యా! జీవుని శరీరంలో అన్నింటికన్నా ప్రాణం గొప్పదని చెప్పేరు, అయితే ఈ ప్రాణం ఎలా పుట్టింది? శరీరంలో ఎట్లు ప్రవేశిస్తుంది? వ్యాన, అపాన వాయువులుగా ఎట్లు మారుతున్నది? ఇంద్రియాలు, మనస్సును ఎట్లు ధరిస్తున్నది? ఎట్లు శరీరాన్ని విడచి బయటకు పోతున్నది? అని ప్రశ్నించేడు.
అంత పిప్పలాద మహర్షి శిష్యులనుద్దేశించి, మంచి ప్రశ్నతో పాటు ఎంతో కఠినమైన ప్రశ్న ఇది. తప్పక సమాధానం చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండని ఈ విధంగా చెప్పసాగెడు -
ఆత్మ ద్వారా ప్రాణం ఏర్పడుతుంది, అది మనస్సు ద్వారా జీవుని శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరం యొక్క నీడవలే ప్రాణం, ఆత్మను అంటిపెట్టుకొని వుంటుంది. ఎలాగైతే దేశాన్ని ఏలే చక్రవర్తి, కొన్ని ప్రాంతాలను పాలించడానికి కొంతమంది అధికారులను నియమించి, తాను మాత్రం సర్వాధికారిగా వుంటాడో అలాగే ప్రాణం కూడా శరీరంలో కొన్ని విభాగాలను ఏర్పరచి, తానే అన్నింటికీ సర్వాధికారిగా వుంటుంది.
ఈ ప్రాణం ఐదు రకాల వాయువుల రూపంలో శరీరమంతా నెలకొనివుంటుంది. శరీర మలమూత్ర ద్వారాలలో అపానవాయువుగా, జ్ఞానేంద్రియములలో ప్రాణవాయువుగా, ప్రాణ, అపాన వాయువుల నడుమ సమానవాయువుగా వుంటుంది. ఈ సమానవాయువు, దేహంలోనున్న అన్ని భాగాలకు అన్నసారాన్ని(శక్తిని) అందిస్తుంది. అన్నసారా శక్తితో ఆయా అవయములు చైతన్యమును పొంది, వాటి పనులను అవి నిర్వర్తిస్తుంటాయి.
ఇక ఆత్మ జీవుని హృదయంలో నెలకొనివుంటుంది. ఈ హృదయంలో 101 నాడులుంటాయి, ప్రతి నాడిలో మళ్ళీ 100 లఘునాడులుంటాయి. ప్రతీ లఘునాడిలో మళ్ళీ 72000 ఉపనాడులుంటాయి. వీటన్నింటిలో సంచరించే వాయువును వ్యాన మంటారు. ఈ నాడులలో ఎంతో ముఖ్యమైనది సుషుమ్ననాడి. అక్కడ ఉదానవాయువు వుంటుంది. ఈ వాయవే జీవుని యొక్క కర్మననుసరించి ఊర్ధ్వ, అధో, మనుష్య లోకములకు తీసుకొనిపోవును.
ఇక ఈ ప్రపంచానికి సంబంధించి సూర్యుడు ప్రాణము, భూమి అపానవాయువు, ఈ రెండింటి మధ్యనున్న ఆకాశము సమానవాయువు, భూమిని ఆక్రమించియున్న వాయువే వ్యానము. అగ్నియే (జఠరాగ్ని) ఉదానము, ఈ అగ్ని ఆరిపోయినప్పుడు జీవుని శరీరంలోయున్న అన్ని ఇంద్రియాలు ప్రాణంలోను, ప్రాణము మనస్సులోను కలసిపోవును. ఈ స్థితిలో మనస్సులో కలిగే సంకల్పమును అనుసరించి జీవునికి పునర్జన్మ సంభవిస్తుంది.
ఆత్మకు నీడలా ప్రాణం వుంటుంది కాబట్టీ, ప్రాణవిభూతే ఆత్మవిభూతి, అదే పరమాత్మ విభూతి.
నాలుగవ ప్రశ్నతో, తదుపరి భాగంలో మళ్ళీ కలుసుకుందాము... 🙏🏻

No comments:

Post a Comment