Friday, June 28, 2024

****అనవసరమైన ఆలోచనలే ఆటంకం

🌹 శ్రీ రమణీయం - 20🌹
👌అనవసరమైన ఆలోచనలే ఆటంకం 👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

🌈  20. అనవసరమైన ఆలోచనలే ఆటంకం 🌹

✳️ ఈ సృష్టిలో ఏ ప్రాణి జీవనమైనా జనన మరణాల మధ్యలో సాగాల్సిందే. కోటి విద్యలూ కూటికొరకేనన్న నానుడి ఈ సృష్టిలోప్రతి ప్రాణికీ వర్తిస్తుంది. అలాగే, ప్రతి మనిషి జీవన విధానంలో ఆకలి, నిద్ర, శ్వాస, దాహం ఒకేవిధంగా ఉంటాయి. దీనినే జీవనం అంటాము. వీటిని గుర్తించడమే మనసు కర్తవ్యం. కానీ మనసును అవసరానికి మించి ఉపయోగించడం వల్లనే మనిషి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఇవే అనవసరమైన ఆలోచనలుగా మారి మన దివ్యత్వానికి ఆటంకాలుగా మారుతున్నాయి. 

✳️ ఆరడుగుల మనిషి సుఖమెరుగని తన నిద్రకోసం అరఎకరం పడకగదినీ, హంసతూలికా పాన్పులనూ కోరుకుంటూ ఉంటాడు. ఒకప్పటి మన వైదిక జీవిన విధానంలో... ఉన్నదాన్ని అనుభవించడం మినహా అతిగా కూడబెట్టే అవసరం, అవకాశం ఉండేవి కావు. సామాన్యుడైనా, సామ్రాట్టు అయినా చల్లని మంచినీటి కోసం మట్టికుండనే వాడేవారు. అధిక సుఖానికన్నా శాంతికే ప్రాధాన్యమిచ్చిన మన పూర్వీకుల జీవన విధానంలో వెలితికీ, దారిద్ర్యానికీ తావేలేదు. పాశ్చాత్య పోకడలకన్నా మన సంస్కృతి అందుకే గొప్పది. శాశ్వత శాంతినిచ్చే సంతృప్తితో కూడిన జీవన విధానం అవలంభించడం ఎలాగో మన పూర్వీకులైన మహర్షులు ఆచరించి చూపారు. ప్రతి మానవుడికి పరమలక్ష్యమైన మోక్షాన్ని అందించే మన జీవన విధానం నేడు కలుషితమవడమే మన అశాంతికి కారణం.

✳️ పోలిక వల్ల ఏర్పడే దారిద్య్ర్య భావనే నేడు చాలా మందిని అశాంతికి గురి చేస్తుంది. మనిషి తన అవసరాలను గుర్తించి అంతకుమించిన కోర్కెలు తగ్గించుకుంటే మనసు తన సహజస్థితిలోనే ఉంటుంది. శరీరంపై వస్త్రాలు ఉన్నాయన్న తృప్తిని మరిచి షాపులో ఉన్న కొత్త బట్టలు కొనలేక పోయామన్న బాధ మనసుకు భారాన్ని కలిగించే అనవసరపు ఆలోచనే అవుతుంది. ఆకలికోసం ఆహారం, ఒళ్లుదాచుకోవడానికి వస్త్రాలు, ఉండటానికి ఇల్లు... అవసరానికి తగినట్లుగా కాక అభిరుచులకు తగినట్లుగా ఉండాలన్న అత్యాశే మనసుని సహజత్వం నుండి దూరం చేస్తుంది. అవసరాలు శరీరానివి అయితే వాటికి సంబంధించిన కోర్కెలు మనసువి. వాస్తవానికి ఏ అవసరాలూ లేని మనసు శరీరం కోసం ఆ కర్తృత్వాన్ని వహిస్తూ కోర్కెల పుట్టగా మారింది. మనసుని వేధించే కోర్కెలను తొలగించాలి లేదా ఆ కోర్కె మనసుని వేధించనిదిగా మార్చుకోవాలి. మనసుని బాధించని కోర్కెలు ఎన్ని ఉన్నా ప్రమాదం ఉండదు. ఫలితాన్ని ఆశించని కోర్కె మాత్రమే మనసుని బాధించకుండా ఉంటుంది. ఒకసారి మాడిన వంటకాన్ని తిరిగి మార్చలేనట్లే కోర్కెల వల్ల ఏర్పడ్డ కర్తృత్వం, ఆ కర్తృత్వం వల్ల ఏర్పడ్డ కర్మలను ఎవరూ మార్చలేరు. 

✳️ పరమాత్మ ప్రతిరూపమైన మనసు ఈ కర్తృత్వం చేతనే తన పరిశుద్ధతను కోల్పోతుంది. అవసరాలు దేహానివి, అనుభవించేది మనలో ఉన్న జీవుడు (పరమాత్మ),  అయితే మనసు ఈ రెండు పనులు తనవేనని భావించి మలినపడుతుంది. సాధనలో మనసుని నిమిత్తంగా, సాక్షిగా మారిస్తే బయట ఉన్న దేహకర్మలనూ, లోపల ఉన్న పరమాత్మ లీలలనూ ఒకేసారి దర్శించగలుగుతుంది. ఆ స్థితినే సహజ సమాధి అంటారు. ప్రకృతికి ప్రతిరూపమైన దేహాన్ని నడిపేందుకు మనలో ఆత్మగా ఉన్న భగవంతుడు మనసుని వాహకంగా వాడుకుంటాడు. ఈ మనసుకి తొలి అనుబంధం ఆత్మతోనే. కానీ తర్వాత ఏర్పడ్డ దేహంతో, దేహభావనతో ఉన్న జన్మజన్మల బంధం కారణంగా బలపడి ఈ సత్యాన్ని తెలుసుకోనివ్వదు.

✳️ కర్తృత్వం వల్ల ఏర్పడ్డ వాసనలు, వికారాలు మనసును కప్పి ఉంచుతాయి. ఈ మనస్సుకి కర్తృత్వం ఎందుకు కలుగుతుంది? మన చూపు వినికిడి, స్పర్శ, రుచి, వాసనలన్నింటికీ తాను మధ్యవర్తి మాత్రమే. కానీ తాను మధ్యవర్తినని మరిచి తానే దేహాన్ని అనీ, తానే యజమానినని భావిస్తుంది, అదే కర్తృత్వంగా మారుతుంది. ఆత్మ యొక్క 'ఎరుక' స్వభావమే మనం అనుభవిస్తున్న ఈ మనసు. మనిషి జీవించి ఉన్నాడనటానికి ఈ మనస్సే కదా గుర్తు. ఆత్మకు ప్రతిరూపమైన మనసుని తన సహజమైన 'ఎరుకగా' ఉంచడమే ఆధ్యాత్మిక సాధన. అంటే అసలు మనసుని ఉపయోగించకూడదని అర్ధంకాదు.

✳️ ఉద్దేశ్య పూర్వకంగా మనం చేసే అనవసరపు మనసు వాడకాన్ని తగ్గించాలి. అంటే మన బాహ్య అవసరాలు పరిమితం చేసుకోవాలి. సంసారంలో ఉంటూనే ఈస్థితి సాధన చేయటం వల్ల కర్మలోరాసి పెట్టి ఉన్న సుఖసంతోషాలు ఏవీ మనం కోల్పోము. పైగా, మన బాధ చింతనగా, దుఃఖం వేదనగా మారకుండా ఉంటుంది. మనస్సు విలువను గుర్తించి దానికి దాని మూలమే సురక్షిత అనవసరమైన భోగాలవైపు మరల్చని వ్యక్తి సన్యాసికి సమానమే అవుతాడు. బాధకి తావులేని మనసే దైవంగా ఉంటుంది. బాధ పోవాలంటే మనసులో భేదభావాలు పోవాలి. అంటే కష్టసుఖాలు, సుఖదుఃఖాలు సమాన దృష్టితో స్వీకరించాలి. కానీ అది ఎలా సాధ్యం! ఈ సృష్టిలో ప్రతి ప్రాణికీ అవి రెండూ సహజమేనని గ్రహించి స్వీకరించటమే దానికి మార్గం. ఎన్ని సుఖాలు అనుభవించినా అవి లేనప్పుడు కూడా బాధ పడనివాడే 'రాజయోగి'. మనసుని ఇలా వివేకవంతంగా మార్చిన రోజునే వాన్ని ఏకోన్ముఖం చేయటం సాధ్యం అవుతుంది.

ఏకోన్ముఖం అయిన మనసు దేన్నైనా సాధించగలదని దేవుడు ప్రతి మనిషిని తనంతటి శక్తివంతుడుగానే ఈ భూమిపైకి పంపాడని త్రైలింగస్వామి శెలవిస్తున్నారు. పరమాత్మకి పై తొడుగుగా వచ్చిన దేహం కోసం మనం వద్దనుకుంటే తప్పేదికాదు. మన చేతుల్లో ఉన్నదల్లా మంచి జీవన విధానం రూపొందించటమే ఈ జీవనానికి మూల బిందువు కనుక్కోవటానికే ఈ జీవితం. అందుకు అడ్డంగా ఉన్న 'నేను' అనే తొలి తలపును తీసివేయాలని శ్రీ రమణ భగవాన్ బోధించారు.

✳️ గంపలో ఉన్న మిఠాయిని ఉండలుగా చుడితే పరిధి ఏర్పడి లడ్డూలుగా మారుతుంది. అలాగే విశ్వమంతా నిండిన చైతన్యం మనసులో చేరటం ద్వారా పరిమితమైన నేనుగా మారింది. ఈ శరీరం ఉన్నంతవరకూ ఎవరైనా 'నేను' అనాల్సిందే. అయితే పూర్తిగా అదే శరీరభావనలో ఉండకూడదు. మన ఉనికిని తెలిపే అహంభావన లేకపోతే మన మనుగడే కష్టం. 'అహంభావన - నేను’లు ఒకే భావాన్ని స్పురింపజేస్తాయి. శరీరం తెలియటం అహంభావన అయితే శరీర అవసరాలు తీర్చటానికి మనం ఉపయోగించే పదమే 'నేను'. శరీరంలో ఏదో ఒక స్థానానికి పరిమితం కాకుండా శరీరం అంతటా ఈ అహంభావన వ్యాపించి ఉంటుంది. మనసు నిమ్మళం చేసే కొద్దీ మనోమూలమే ఆత్మగా స్పష్టం అవుతుంది. పరిశుద్ధాత్మగా ఉన్న ఆ దైవాన్ని మనలోనే ఉంచుకొని ఎక్కడో ఉన్నాడని వేడుకుంటాం. శాంతితో నిదానించే మనసు సహస్రనామాలు చదివినంత ఫలాన్ని పొందుతుంది. ఎందుకంటే ఏ స్తోత్రాల ఫలమైనా కర్మలు తీర్చి శాంతిని ఇవ్వడానికే కదా! అంతేగాక మనసుకు పరమాత్మ ప్రతిరూపమైన ఆత్మ తెలియాలంటే అది నెమ్మదించాలి. స్తోత్రం అంటే జ్ఞప్తిలో ఉన్న దాన్ని వల్లెవేయటమే కదా! నేను ‘ఆత్మరూపాన్ని' అన్న జ్ఞాపకాన్ని నిరంతరం వల్లెవేస్తే వచ్చేది శాంతే కనుక అది అన్ని స్తోత్రాల్లోకెల్లా ఉత్తమ స్తోత్రం అవుతుంది. ఏ పూజా విధానమైనా దేహభావన తగ్గించి శాంతిని ఇవ్వటానికే. అలా కానప్పుడు అవన్నీ నిష్ఫలం అవుతాయి. నిద్రలో మనసు పంచేద్రియాలతో తెగతెంపులు చేసుకొని ఎలా శాంతంగా ఉంటుందో జాగృతిలోనూ అవసరాల్లో మినహా ఎల్లప్పుడూ అలా ఉండగలగాలి. 'అవసరమైన పనులేవి తప్పుకాదు అనవసరమైన పనులు మంచివీ కావు' ఈ వివేకంతోనే మనసును అంతర్ముఖం చేయగలగాలి. మన చిత్తానికి 'నేనుదేహాన్ని' అనే జ్ఞాపకంతో పాటు నేను దైవాన్ని అనే జ్ఞాపకం కూడా ఉంది. కాకపోతే అది మరుగున పడింది. మన మనసు సాధనతో దాన్ని వెలికి తీస్తే నిరంతరం అదే భావనలో దివ్యత్వంగా ఉండిపోతుంది.

🙏 ఓం నమోభగవతే శ్రీరమణాయ 🙏

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment