Sunday, June 23, 2024

భలే విత్తులు - బతుకు తెరువులు

 *భలే విత్తులు - బతుకు తెరువులు* 
🌲🌳🌴☘️🍀

అది ఒక పురాతన పల్లె. ఒకప్పుడది పచ్చని చెట్లతో పాడి పంటలతో ఎంతో కళకళలాడుతూ ఉండేది. ఆడింది ఆట పాడింది పాటగా ప్రజలు కాలం గడుపు తుండేవారు. నెలకు మూడు వానలు కురుస్తుండేవి. చెరువులు, బావులు నీళ్ళతో నిండి ఉండేవి. ఎటు చూసినా పచ్చని చెట్లే. ఫలసాయం తేరగా అందుతుంటే ప్రజలు ఆనందంగా హాయిగా కాలం గడుపుతూ సోమరిత నానికి అలవాటు పడ్డారు.

వంట చెరకు కోసం దూరానున్న అడవికి పోకుండా అందుబాటులో వున్న చెట్లను నరకడం ప్రారంభించారు. కొన్నాళ్ళకు పల్లె పరిసర వాతావరణంలో పెనుమార్పులు వచ్చాయి. పల్లె ప్రాంతం బీడుపడింది. వర్షాలు ముఖం చాటేశాయి. చెరువులు, బావులు ఎండిపోయాయి. దీంతో ప్రజలు పంటలను పండించలేకపోయారు.

ఒకప్పుడు చెట్ల కొమ్మలపై కిలాకిలారావా లు చేస్తూ అలికిడి చేసిన పక్షులు పల్లెను వదిలి వలసపోయాయి. పల్లెలో పనులు లేక కొందరు యువకులు పట్టణాలకు పోయారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు ఎక్కడో దూరానున్న అడవులకు,
కొండలకు పోయి కాయాకసరు తెచ్చుకొని కడుపు నింపుకుంటూ దిక్కుతోచక పుట్టిన ఊర్లోనే కాలం గడపసాగారు. 

అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున ఒక మునీశ్వరుడు దేశాటనం చేస్తూ ఆ పల్లెకు వచ్చాడు. ఆ ముని ఆ పల్లెను గతంలో సందర్శించినవాడే. పల్లె పరిస్థితి గమనించి దిగులుపడ్డాడు. అక్కడి వృద్ధులు ఆ మునిని గుర్తుపట్టి, "స్వామీ! చూశారుగా పల్లె. పాడి పంటలతో కళకళ లాడే ఈ పల్లె ఎలా అయిపోయిందో. మీరు మనసున్న మంచివారు. మా పల్లెలో అడుగుపెట్టారు. ఇక మాకు మంచి రోజులే. చావలేక బతుకుతున్న మాకు మీరే దిక్కు, కరుణించండి" అని వేడుకున్నారు.

ముని దీనులుగా కనిపిస్తున్న ఆ పల్లె జనాన్ని ఉద్దేశించి "చెట్లను ఎడా పెడా నరకడం వల్లే మీకీ దుస్థితి కలిగింది. నలుగురు యువకులను నాతో పంపండి. మేలు జాతి విత్తనాలు దుంపలు వారికిస్తాను. ఆ విత్తనాలను, దుంపలను పల్లె పరిసరాల్లో నాటండి. కొద్ది రోజుల్లో పెనువర్షం పడే సూచన కనిపిస్తుంది. ఈలోగా మీరు చెరువులను, బావులను బాగుచేసి సిద్ధం చెయ్యండి. ఒక్క నీటి చుక్కను కూడా వృధా చెయ్యొద్దు. చెట్లను పెంచి పూర్వ వైభవం పొందండి. పల్లె సుభిక్షమవుతుంది. నేను మరలా ఈ పల్లెకు వచ్చేసరికి కళకళలాడాలి" అని హితబోధ చేసి నలుగురు యువకులను తనతో పాటు తీసుకువెళ్ళాడు.

యువకులు ముని ఇచ్చిన విత్తనాలను దుంపలను పెద్ద పెద్ద మూటలతో పల్లెకు తీసుకువచ్చారు. ముని చెప్పినట్లుగా వాతావరణంలో మార్పు కనిపించింది. తొలుత ఈదురు గాలులు, చిన్న చిన్న చినుకులతో ప్రారంభమైన వర్షం పెద్ద తుపానుగా మారింది. తుపాను తీవ్రతకు అందరూ భయపడ్డారు. తెల్లవారి వర్షం వెలిసింది. పూడిక తీసిన చెరువులు, బావులు నీటితో నిండాయి. ఊరంతా మళ్ళీ మట్టివాసనతో గుబాళించింది. 

యువకులు తెచ్చిన విత్తనాలు, దుంపల ను పల్లె ప్రజలు నాటారు. ముని చెప్పినట్లే అవి తొందరగా మొలకెత్తాయి. కొమ్మలు, రెమ్మలతో చెట్లు ఎదగసాగాయి. గతంలో పచ్చదనంతో పాటు మాయమైన క్రిమి కీటకాదులు మళ్ళీ కనిపించసాగాయి. వలస పోయిన పక్షులు తిరిగి వచ్చాయి. తూనీగలు, సీతాకోక చిలుకలు గాల్లో ఎగురుతుంటే పాములు, ముంగిసలు, ఇలా ఒక దానిపై మరొకటి ఆధారపడి బతికే జీవులు పల్లె పరిసరాల్లో తారస పడసాగాయి. పచ్చని పట్టు పరికిణి కట్టుకున్న పల్లె పడుచులా కనిపించ సాగింది ప్రకృతి.

రైతులు మూలన పడేసిన వ్యవసాయ పరికరాలు బయటకు తీశారు. బీడు దున్ని పంటలు పండించారు. పల్లె పూర్వ వైభవం పొందింది. కరువు కాటకాలు తొలగి, సిరిసంపదలతో తులతూగ సాగారు ఆ పల్లెవాసులు. ఎంత సంపద చేతికందినా ఆ పల్లె ప్రజలు ముని మాటలు మరిచిపోలేదు. చెట్లు వాళ్ళ దృష్టిలో దేవతా మూర్తులై పూజలందు కోసాగాయి. 

'వృక్షో రక్షతి రక్షితః' అన్న సూక్తి అక్షరాలా నిజం అయింది.
🌴🌱
*సమాప్తం* 

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆

No comments:

Post a Comment