*_నేటి మాట_*
*సంసారం - జైలు*
సంసారం (జననమరణ చక్రం) ఒక కారాగృహం.
జైలు, సంసారాన్ని జైలుతో ఎందుకు పోల్చారు శంకరులు...
జైలులో బందీలైనట్లుగ మనం ఈ జననమరణచక్రంలో బందీలయి పోతున్నాం.
ఈ దేహం అనే సెల్ లో బంధించబడుతున్నాం.
ఒక సెల్ నుంచి మరొక సెల్ కు మార్చబడుతున్నామే గాని అసలు జైలు నుంచి విడుదలై స్వేచ్ఛను పొందలేకపోతున్నాం!!...
ఆలోచనలు, కర్మలు అనే నేరాలను చేసి వాసనలు కర్మఫలాలు అనే మూటను సంపాదించి దానికి తగిన శిక్షగా జననమరణ సంసారచక్రమనే జైలులోబడి దేహాలనే ఒక సెల్ నుండి మరొక సెల్ కు మారుతూ తప్పించుకొనే ప్రయత్నం చేయక, చేసినా సరిగ్గా చేయక, చేయలేక ఇలా జైలులోనే మ్రగ్గిపోతున్నాము...
ఇలా ఎందుకు మ్రగ్గి పోవాల్సి వచ్చింది..
భగవంతుడు ప్రసాదించిన బుద్ధిని సరిగ్గా వినియోగించక ప్రాపంచిక విషయాలలోను, భోగాలలోను, మునిగి గొప్పతనం కోసం, కీర్తిప్రతిష్టల కోసం ప్రాకులాడటమే గాని అసలు నేనెవరు ? ఎక్కడి నుండి వచ్చాను ? తిరిగి ఎక్కడకు వెళ్ళాలి ? ఎలా వెళ్ళాలి ? అని ఆలోచించటం లేదు.
...అందుకే శిక్ష ,
ఈ దేహాలలో ఇరుక్కొని, నేను - నాది అనే అహంకార మమకారాలతో నా భార్య, నా బిడ్డలు, నా బంధువులు అంటూ గాడిద చాకిరీ నెత్తిన వేసుకొని జన్మంతా చేసి చేసి చివరకు అన్నింటిని అందరినీ వదిలి వాసనలు, కర్మఫలాల మూటను నెత్తిన బెట్టుకొని మరొక జైలు (సెల్) దేహం కొరకు వెతుక్కొని అందులో కూర్చొని, నీ వాసనల మూటను విప్పి గాడిద చాకిరీ చేస్తూ నీ కర్మఫలాల మూటను విప్పి సుఖదుఃఖాలు అనుభవిస్తూ మళ్ళీ ఒంటరి ప్రయాణం సాగించటమే!!...
ఇదేనా జీవితం ?
దీనికి విముక్తి ఎలా ?
ఎప్పుడు ? ఆలోచించాలి?...
ఇదే మానవుడిగా జన్మించిన జీవుడి ప్రధాన కర్తవ్యం. ఈ కారాగృహం నుంచి ఎందుకు విడుదల పొందలేకపోతున్నాం..? అంటే మన కాళ్ళకు ఇనుప సంకెళ్ళు వేయబడ్డాయి.
అవే వాసనలు లోక, దేహ, శాస్త్రవాసనలు...
రాజుగారి ఆజ్ఞ మీరితే కారాగారంలో బంధిస్తాడు, భగవంతుడి ఆజ్ఞ మీరితే ఈ సంసారమనే జైలులో బంధిస్తాడు...
*_🌻శుభమస్తు.🌻_*
*🙏సమస్త లోకా: సుఖినోభవంతు.🙏*
No comments:
Post a Comment